శత్రువు చూడ్డానికే భయపడే చోట... గుర్రం కొండ కోట
తిరుపతి సమీపాన మరొక వింత..
అట్లా చంద్రగిరి కోటకు పోదాం పా శీనూ అని, అక్కడ వున్న పాతబడ్డ దేవాలయాలు, ఆ కట్టడ నైపుణ్యం చూసి అబ్బురపడిపోతూ చంద్రగిరి మహల్ నుండి నలుదిక్కులా చూస్తూ మురిసిపోయి, ఎన్ని మార్లు చూసి వుంటాం శీనూ గుర్రంకొండకు పోదాం పదా అండీ ఊ.. అని తిరుపతికి 110 కి. మీ దూరంలో వున్న ఆ ప్రాంతానికి బయలుదేరదీసినాడు.
దార్లో చంద్రగిరిలో కృష్ణదేవరాయలు ఎన్నడూ లేరని, ఇదంతా వేంకటపతి రాయల వైభోగమేనని విజయకుమార్ చెప్పిన సంగతులు చర్చించుకుంటూ ఉన్నాము. ఉప్పు సట్టె -పప్పు సట్టె, గంటా మంటపం, విజయనగర రాజులు వైభోగం గురించి మాటలు ముగిసేసరికి తరిగొండ చేరుకున్నాము.
దాదాపు దేశంలో ఉన్న చాలా కోటలు చూసినవాడిని, ఈ గుర్రంకొండ ను ఇంతా వరకు చూడకపోవటం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నిమార్లు దీన్ని ఆనుకుని ప్రయాణం చేసి వుంటాను. కుదర్లేదంతే.
ఈ రోజు కూడా కింది భాగమే కదా చూసేదని సాదాసీదా వచ్చినాము. ఈ గుర్రం కొండ మూడు గంటల ట్రెక్కింగ్ అని తెలియకపోయె.
ఒకే రాయితో గుర్రం కొండ చూడ్డానికి అద్భుతంగా ఉంది. శత్రువులు చూడ్డానికే భయపడే చోటు. ఎక్కటం దుర్భేద్యం. ఒకే వైపున, ఎక్కడానికి వీలున్న చోటు నుండి కోటను కట్టినట్టుగా ఉంది. ఆలనాపాలనా లేదు. టూరిస్టులు బాగానే వస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు. ఎక్కువ కాలం టిప్పు సుల్తాను ఏలుబడిలో ఉండటం, నవాబ్ మీర్ రజా ఆలీఖాన్ సమాధి, మక్బిరా ఉండటం ప్రధాన కారణమై ఉండొచ్చు.
రాగానే రంగీనా మహల్ ఎదురయింది. అద్భుత కట్టడం. నవాబుల నివాస భవనం. వెనకా, ముందు చూపరులను ఆకట్టుకునేట్టుగా ఉంది. ఆ దంతెలు, కట్టడపు నైపుణ్యం గొప్పగా ఉంది. పైన పెద్ద హాలు, వరండా, చక్కగా అందంగా అలంకరించబడిన గదులు, ఆరు స్నానపు గదులు ఉన్నాయి. ముందుగా ఉన్న కట్టడాలు నామ రూపాల్లేవు. కొంచెం పక్కగా ఉన్న వంటశాల బాగా పాడైపోయి ఉంది. ఏమైనా గొప్ప వారసత్వపు కట్టడం అది. అక్కడి నుంచీ కొంచెం పైకి పోయి కుడి పక్కకు దారి తీస్తే లక్ష్మినరసింహస్వామి దేవాలయం ధ్వజ స్తంభం, ధర్మకాటా ఉన్నాయి. గుడి ఎప్పుడూ మూసీ ఉంటుంది. మాకు తెలిసిన వాని వల్ల బీగాలు తెరిపించి మూలమూర్తిని చూడగలిగినాము. విగ్రహం బావుంది. ఆపైన్నుంచి చూస్తే కింద మసీదు, సమాధి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వెనక్కి వచ్చి చూస్తే వెనకాల దారి కనబడింది. అక్కడ పని చేసే అతను దారంతా కప్పుకుపోయింది, పోయి రావటానికి నాలుగ్గoటలయినా పడుతుందని, నిరుత్సాహాన్ని నూరిపోస్తుండీ, విని వినినట్టుగా ఉంది మా పాటికి మేం పైకి బయలుదేరినాము.
దారంతా బోద, గడ్డితో మూసుకుపోయిన మాట నిజమే. ఇట్టాంటి దారులనెన్నింటిని చూసి ఉంటాము. వాటినేమి లెక్క చేయకుండా మేమిద్దరమే. దారిలో మరెవ్వరూ లేరు. వాతావరణం బాగా ఉండటం వల్ల హాయిగా, ఆహ్లాదంగా ఉంది. పెద్దగా అలసట లేదు. పూర్తి ఎక్కుడే.కాకపోతే రాతి కట్టడం ఉంది. అప్పటి రాజులు, రాణులు ఎట్లా ఎక్కి ఉంటారో, నవాబులు, బీబీలు ఎంత కష్టపడి ఉంటారో వారి సేవకుల శ్రమ ఎంత అద్భుతం కదా అని అనుకుంటూ, గుర్రం కొండ యాదవ, విజయనగర, నవాబుల,బ్రిటిషు వారి ఏలుబడిలో ఎన్నెన్ని మార్పులకు గురై ఉంటుందో కదా అని చర్చించుకుంటూ ఒక ఆర్చీని చేరుకున్నాము. దేవుళ్ళ బొమ్మలు, ఆంజనేయుని గీత, పక్కన గోదాములాంటిది దాటి ఒక విశాలామయిన మైదానానికి చేరుకున్నాము. అది నీటి సీరువ. పక్కన ఏదో గోదామో, సైనికుల స్థావరమో ఉంది.
అక్కడ నుండి పైకి ఎగబాకితే మరో రెండు ఆర్చీలు, నీటి కొలనులు దాటుకుని పైభాగానికి చేరుకునేసరికి మా నడకకు రెండు గంటలు బట్టింది. పైన కోట గోడలు, విశాలమయిన రాతి బండ, పక్కన పెద్ద బంతి చెట్టు, పెద్ద సమాధి లాంటిది ఉన్నాయి.
అక్కడ ముగ్గురు యువకులు కనిపించినారు. నన్ను చూడగానే ఒకతను ఆశ్చర్యంగా సార్ మీరు ఇంత దూరం నడిచి వచ్చినారా, హెలికాఫ్టర్ లో ఏమైనా దిగినారా అని అనటం నాకెంతో ఆశ్చర్యంగానే ఉంది. ముస్లింలు, తరచూ వస్తుండటం, టిప్పు సుల్తాన్ వైభవాన్ని నెమరువేసుకుంటూ మాటలు కలిపి సర్రన దిగి పోయినారు.
మేము అంగుళమంగుళం తిరిగి, అలనాటి కట్టడాల వైభవాలకు అబ్బురపడుతూ దిగబడినాము. దిగేప్పుడు మాత్రం ముక్కాలు గంటలకంతా వచ్చేసినాము.
వొక గొప్ప కోట, ఆ చారిత్రక వైభవం, వారసత్వాన్ని తలచుకుంటూ తిరుగు ప్రయాణమయినాము.
చివరగా వొక్క మాట చెప్పాలి. ఇటీవల నా సన్నిహిత మిత్రులే కొందరు నా ఈ ట్రెక్కింగులు చూసి జాగ్రత్తలు చెబుతూనే ఇప్పుడివి అవసరమా అని అనటం గమనిస్తూనే ఉన్నాను. నేను ట్రెక్కింగ్ లతో పాటు నిరంతరం చదవటం, రాయటం, సభలు, సమావేశాల్లో పాల్గొవటం ఆపనే లేదు. ఉద్యమాలు, నిరసనలు లేవు కనుక నేనూ వాటిల్లో లేను.
నేనైనా తిరగ్గలిగినంత కాలమే కదా! కాకపోతే ఈ ట్రెక్కింగ్ ల వల్ల చక్కెర వ్యాధి, కాళ్ల నెప్పుల్లాంటి వేవి దరి చేరకపోవటం నన్ను చూసిన, చదివిన వారికి ఎరుకలోకి రావాలికదా!?
మళ్లీ చాన్నాళ్లకి కాశి పెంట్ల ట్రెక్కింగ్ తర్వాత పెద్ద ట్రెక్కింగ్ ను పూర్తి చేసి వచ్చినందుకు సంతృప్తిగా ఉంది. ఇంక మాకు దగ్గర్లో మిగిలి ఉన్నది వెంకటగురి దుర్గం. తొందర్లోకి ప్లాన్ చేద్దాం.
ఇది కూడా చదవండి