ఆమె ఒక తోట

ఇల్లు సీక్వెల్ -16 : అమ్మేమో నాన్నని తన తోటకి చంద్రుణ్ణి చేయాలని శతధా ప్రయత్నిస్తుంది. ఇక్కడ అమ్మ ఎప్పుడూ ఓడి పోతుంటుంది.

Update: 2024-06-30 03:30 GMT


అందరికీ తోట ఉంటుందా,

కొందరి ఇళ్లల్లో శ్మశానాలు కూడా ఉంటాయి.

ఇల్లు... తోట సజీవమవ్వాలనుకుంటాయి.

కానీ...ఆశలను హత్య చేసే మనుషులు ఇంటిని.. తోటని శ్మశానాలు చేస్తారు.

తోట మాత్రం.. పూలతో..నాజూకు తీగలతో ..

సుగంధాలతో కిటికీల్లోంచి..

తలుపుల్లోంచి ఇంట్లోకి రావాలనుకుంటుంది.

కానీ లోకానికి మూసుకుపోయిన ఇల్లు తోటని లోపలికి రానివ్వదు.

తోటని శ్వాసించి కొత్త ప్రాణం పోసుకుందాం అనుకునే ఇల్లాలు

ఇంట్లో బందీ అయిపోతుంది.

కానీ ఆమెలోపల రహస్యంగా ఒక తోట మొలుస్తూ ఉంటుంది.

****

తోట.. నీకు వేరు.. ఆమెకి వేరు...

తోటని చూసే మీ కళ్ళు వేరు!

నీలా కాదు! ఆమె కళ్ళకి హృదయం ఉంది.

తోటని ఆమె ప్రకృతై చూస్తుంది.

ఆమెనే కాదు!తోట తల మీద ఉన్న మబ్బులు..

నక్షత్రాలు, సూర్య చంద్రులు మొత్తం ఆకాశం చూస్తుంది కదా.

తోటని..మబ్బులు వర్షంతో ప్రేమిస్తాయి

చంద్రుడు వెన్నెలతో ప్రేమిస్తాడు.

సూర్యుడు నులివెచ్చని ఎండతో ముద్దు చేస్తాడు.

గాలి గాఢమైన స్పర్శతో కౌగలించుకుంటుంది.

ఎక్కడినించో ఒక గజల్ నో..

ఒక అమృత వర్షిణి రాగాన్నో

తోట చెవుల్లోకి రహస్యంగా వినిపిస్తుంది.

ఋతువులన్ని మోహావేశంతో తోటని కమ్మేస్తాయి.

మంచుకి వణికి పోయే తోటని సూర్యుడు ముద్దులతో వెచ్చబరుస్తాడు.

తోటని మోస్తున్న భూమి అద్భుతమైన సౌందర్య భారంతో

పూల మట్టి పరిమళాల్ని నక్షత్రాల మీదికి వెదజల్లుతుంది.

వర్షపు రాత్రి మేఘాలు వాన తీగలతో తోటను చుట్టినప్పుడు

తోట గాలిని తోడు తీసుకుని చేసే విలయ నృత్యం

ఆమె తనలోకీ ఆవహించుకుంటుంది.

ఇంత సౌందర్యం కోసం అమ్మ తన అమృత హస్తాలతో

ఇంటినే కాదు తోటను సాకుతుంది.

తోట అమ్మ హృదయం !

***

ఇల్లు ఇవ్వలేనిది ఆమెకి తోట ఇస్తుంది..

తోట ఆమెకి పూలు రాలిన నేలనిస్తుంది !

ఆమెకి తనదైన విశాల ఆకాశాన్ని నక్షత్ర కాంతులతో...

మంచు మోసే మబ్బులతో సహా...ఇస్తుంది.

ఆమెకి తోటలో..గుండె పగల ఏడ్చే.. పరిగెత్తే ..

నృత్యం చేసే... గొంతెత్తి పాడుకునే స్వేచ్ఛనిస్తుంది.

ఆమెకి కొన్ని పాటలని స్తుంది !

అవును..తోట ఆమెను పిలిచి నప్పుడల్లా

తోటలో..వెన్నెల రాత్రుళ్ళల్లో

కొన్ని రహస్య తన్హాయి రాగాలను పాడుకుంటుంది...

అప్పుడు తోట ఆమె ప్రియుడు !

కొన్ని రాత్రుళ్ళల్లో రానివ్వని పుట్టింటి వాళ్ళని...

బతకనివ్వని అత్తింటి వాళ్ళని వేదనగా

తలుచుకుంటూ పాడే పాటలకు

తోట మంచు బిందువుల కన్నీళ్ళని రాలుస్తుంది.

*****

అమ్మ తన ప్రతీ బిడ్డకి..తోటలో పూసిన పువ్వుల పేర్లు పెట్టుకుంటుంది.

ఆకాశమల్లి,మందారం,ముద్ద బంతి,చేమంతి..

అని పిల్లలని పిలుచుకుంటూ...

పిల్లల్లో పూలనీ.. పూలలో పిల్లల్ని..

ముళ్ళల్లో బాధల్ని చూస్తుంది.

తోట ముళ్ళు నాన్నలా గుచ్చుతాయేమో మరి ?

అచ్ఛం నాన్న ముందో నానమ్మ ముందో

నిలుచున్నప్పటి కన్నీళ్ళలా

ముళ్ల గులాబీ చెట్టు ముందు అమ్మ కన్నీళ్లు రాలతాయి.

ఇల్లిచ్చిన నొప్పిని ఆమె తోటలో సాంత్వన పొందుతుంది.

తన గాయపడ్డ చేతుల్ని మెత్తటి మట్టిలో

విత్తనాలు నాటుతూ రంగుల పూల కలలేవో కంటుంది.

తోట అప్పుడు అమ్మవుతుంది.

అమ్మకి చాలా సార్లు ఇంట్లో అన్నం దొరకదు..

అప్పుడు తోట పండై అమ్మ ఆకలి తీరుస్తుంది.

ఎన్నటికీ ఇంటికి యజమానురాలు కాలేని

అమ్మ అప్పు డు తోటమాలి !

****

కొన్నిసార్లు నాన్నకి అమ్మంటే ప్రేమ లేదని కాదు..

కానీ తన లోపల మనువు పెంచిన ముళ్ళతో

అమ్మని అప్పుడప్పుడు గుచ్చుతాడు..

అమ్మేమో

నాన్నని తన తోటకి చంద్రుణ్ణి చేయాలని శతధా ప్రయత్నిస్తుంది.

ఇక్కడ అమ్మ ఎప్పుడూ ఓడి పోతుంటుంది.

***

మెట్టినింటి వాడు ఇది నీ ఇల్లు కాదన్నప్పుడు...

పుట్టింటి వాళ్ళూ ఇది నీ ఇల్లు కాదన్నప్పుడు..

అమ్మ తనకోసం సృష్టించు కునే ఇల్లే తోటిల్లు..

పెరడిల్లు,వాకిలిల్లు... !

వాటి కోసం ఆమె గుప్పిట్లో ఎప్పుడూ

కొన్ని విత్తనాలు మొలుస్తూనే ఉంటాయి !

ఇంటి లోపల తనకంటూ గదే లేనప్పుడు

ఆమె ఇంటి చుట్టూ దొరికే

రెండు గజాల భూమిని స్వంతం చేసుకుంటుంది.

అక్కడ తోటని మొలిపిస్తుంది..

ఆమె విత్తనం నాటిన చోట భూమి మొత్తం పూవై పోతుంది.

***

ఆమె నిద్ర లేవడమే

రాత్రి నాటుకున్న విత్తనాల కలల మొలకలతో లేస్తుంది.

ఇల్లంతా మట్టి దుమ్ము ఉన్న చోట

విత్తనాలను వెదజల్లుతూ తిరుగుతూనే ఉంటుంది.

తన మీద కూడా చల్లుకుంటుంది .

మట్టి గొట్టు కున్న మనుషుల మీద కూడా విత్తనాలు చల్లుతుంది

ఎప్పటికైనా మొలవక పోతారా...

సున్నితమైన పూలై పూయకపోతారా అనే ఆశతో

అలా ఆమె ఇంటి లోపల కూడా

తోటను సృష్ఠించుకుంటుంది.

వంటింటి కిటికీ లో వంట మంట దహించే

తన దేహానికి చల్లని ఆకు పచ్చ లేపనం కోసం...

ఊపిరాడని బెడ్ రూమ్ లో ఆక్సిజన్ కోసం..

బ్రెహ్మ జెముడై గుచ్చుతున్న ఎడారి గదులలో..

చల్లటి గాలి కోసం అచ్చం తన లోపల తోటను మొలిపించుకున్నట్టుగా

ఇంట్లోపల ఆమె ఒక తోటను పెంచుతుంది.

****

ఇల్లు ముల్లయి గుచ్చినప్పుడల్లా తోట ఆమెకి పూలనే ఇచ్చింది!

ఆమెతో పాటు తోట కూడా ఎన్ని కన్నీళ్లు కార్చిందని..

ఇవ్వడమే తెలిసిన అమ్మా..తోటా

ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి పోయి ఓదార్చుకుంటారని.

ఆమె తనతో చేసిన సంభాషణ రహస్యంగా దాచుకుందని.

ఆమె దుఃఖపు తలని మృదువైన

పూలకొమ్మలతో పరిమళభరితంగా నిమిరిందని ?

కన్నీళ్ల కళ్ళని పూల యవనిక తో తుడిచిందని ?

తననెప్పుడూ చెమ్మగా ఉంచాలని ఆమె తోడి పోసిన నీళ్లు...

నీళ్లు లేనప్పుడు మబ్బుల్ని

తోట మెత్తగా నానే వరకూ కురవమని

ఆమె మేఘ మల్హర్ రాగాన్ని పాడుతూ ప్రార్థించడాన్ని

ప్రతీ ఆకుని,పువ్వుని,కొమ్మని

పిల్లల తలలు నిమిరినట్లు స్పర్శించడాన్ని..

రాలిపోయే పూల కోసం విలపించడాన్ని తోట ఎన్నటికీ మరవదు.

రాలిన మృత పుష్పాలను అమ్మ ఎంతో భద్రంగా

భూమిలో..సమాధిలో మనిషిని సర్దినట్లే పాతి పెడుతుంది..

ఒక కొత్త విత్తనం లా !

అప్పుడు భూమి ఒక అత్తరు బుడ్డీ గా మారిపోతుంది.

భూమి మొలకై మళ్లీ కొత్త సౌరభంతో పుష్పిస్తుంది.

***

తోట భూమి ఎన్ని నిజాలని సమాధి చేసిందో

ఎన్ని కథల్ని విన్నదో...ఎన్ని దృశ్యాలను చూసిందో

అలిసిన పాదాలతో తిరిగిన అమ్మ అలసటని..

ఎవరి నుంచో తప్పించుకు దాక్కుని చెట్ల నీడలలో సేద దీరడాన్ని

తోటలో కొత్త పూలను ఆమె తన లోపల తోటను కనుక్కోవడాన్ని

తనకు తాను తోటలో దొరకడాన్ని...

అనేక వెన్నెలా చీకటి కలిసిన రాత్రుళ్ళల్లో

తనను తాను తోటకి బంధించుకోవడాన్ని...

తోటను ఆవహించడాన్ని..

కొన్నిసార్లు కాళికలా..ఇల్లూ..తోటా వణికి పోయేలా రౌద్రించడాన్ని...

ఉన్మత్తంగా పాడుకోవడాన్ని...

వెర్రిగా పగలబడి నవ్వు కోవడాన్ని

తోట అన్నింటినీ నిశ్శబ్దంగా చూస్తుంది !

***

పిల్లల్ని కనలేని ఆమె

భూమి పూల పిల్లల్ని కనడాన్ని చూస్తూ పరవశిస్తుంది.

అమ్మ పెంచిన తోటను నాన్న తనది అంటాడు

కానీ తోటా.. పూలు గుర్తు పడతాయి..

కన్నవాళ్ళని గుర్తు పట్టే పసి పిల్లల్లా అమ్మని !

ఎండిన తోటని

కలుపు కలుపైన తోటని, బురదతో

తోటని కూడా అమ్మ రక్షించి ప్రేమించింది మరి !

ఆమె తోటని ఎప్పుడూ వాడి పోనివ్వలేదు..

తన లోపలి తోటతో సహా !

తోట దాహాన్ని తీర్చేది ఆమెనే కదా!

***

ఏ అర్థరాత్రి..మంచం దిగి..

పడక గది దాటి ఓపలేని దుఃఖం తో

ఆమె తోటలోకి ఓదార్పు కోసం పరిగెత్తుకు వస్తుందో తెలీని తోట...

నిదురే పోకుండా వెన్నెల కళ్లేసుకుని ఎదురు చూస్తుంది..

తోటకి నిదుర లేని రాత్రులెన్నో!

****

తోట తనలో నడిచిన కొత్త పాదాలను గుర్తు పడుతుంది.

ఆమె పాదస్పర్శని అనుభూతి చెందుతుంది.

అమ్మ ఉందన్న దైర్యం తో తోట మొత్తం

లోకాన్నంతా తన సుగంధం తో పరిమళింపచేస్తుంది.

ప్రతీ రాత్రి తోట పూలు రాల్చినట్లు...

అమ్మ తన కన్నీళ్లు రాల్చుకుని దుఃఖపు తడిని

పూల రెక్కలకు అంటించి వస్తుంది.

ఆమె చెప్పిన కొన్ని కథలు

పక్షులు ,గువ్వలు ,పువ్వులు వింటాయి.

ఆమె ప్రతి పూ రెక్క మీదా..

వెన్నలకి మెరిసిపోయే లేత ఆకుల మీద రాసిన

మార్మిక కవిత్వాన్ని చదువుతాయి.

ఆమెకి సంఘీ భావంగా

పక్షులు కోయిలలు సంగీత ముషాయిరా చేస్తాయి.

దుఃఖాన్ని కొంత వదుల్చుకున్న తరువాత...

ఆమె రోజంతా తనని ముళ్లయి గుచ్చిన

ఇంట్లో వాళ్ళని అతికష్టం మీద క్షమించి ..

తోట ఇచ్చిన కొత్త పూల రంగుల్ని అద్దుకుని..

నక్షత్ర కాంతులతో పాత చర్మం రాల్చుకుని...

తోట ఇచ్చిన తేనెని, చంద్రుడు ఒంపిన వెన్నెలని త్రాగి

ఒక దేవతై పునర్జన్మించి మళ్ళీ ఆమె ఇంట్లోకి ఎగిరిపోతుంది.!.

తోట మరు రాత్రి దాకా విరహంలో ముడుచుకుంటుంది.

***

నీకు తోట కావాలా..

తోటలో పూలు పూయాలా ?

అయితే నీలో పూల రెక్కల్లో ఉండే స్వచ్ఛత..

అమ్మల్లో ఉండే గొప్ప మానవీయ సౌరభం ఉండాలి !

అప్పుడే నీ గుప్పిట్లో ఉండే విత్తనాలని భూమి తన లోపలికి ఆహ్వానిస్తుంది !

అప్పుడే ..అమ్మ లాంటి తోట

నిన్ను తన లోపలికి ఆహ్వానిస్తుంది..

ఆమెలను చేరాలంటే

నువ్వు ఎన్ని తోటలని దాటాలో నీకు తెలుస్తుంది !



Tags:    

Similar News