తత్వసాగర మథనం- ‘నిర్వేదం’ నవల

శ్రీరామకవచం సాగర్ నవల దాపరికం, భేషజం, దొంగవేషం లేకుండా నిప్పుల్లో కాల్చిన నిజాయితీకి నిలువుటద్దం.;

Update: 2025-03-19 05:08 GMT

బతుకు విసిగిస్తుంది-విరక్త పుట్టిస్తుంది. ఎక్కడికో విసిరేస్తుంది. అంతు చిక్కని గతితార్కిక భౌతిక వేదన దహించి వేస్తుంది. దుఃఖపడి, రక్తమోడీ, అపజయాలనూ, అవమానాలనూ దిగమింగి తెలిసో తెలియకో నువ్వో రహస్యో ద్యమంగా మారిపోతావు. చెక్కు చెదరవు. ధైర్యం సడలదు. ఐనా పాడులోకానికి దూరంగా పారిపోతావు. అల్లకల్లోలమై, రాకాసి కెరటాలతో విరుచుకుపడుతున్న సముద్రం ఎదుట ఒంటరిగా నిలబడి వుంటావు. నీలోపల నిద్ర లేచిన సముద్రం పేరు ఎగ్జిస్టెన్షియల్ సంక్షోభం. ఒకే ప్రవాహంలో రెండు శరీరాలయ్యి ఈదుకుంటూ పోతుంటావు. నిన్ను నువ్వు వొదిలించుకోవడంతోనే జీవితం ఆరంభం అవుతుందనే ఆత్మజ్ఞానం వల్లనా! ఏమో!

శ్రీరామకవచం సాగర్ నవల నిర్వేదం - An incredible encounter with an insane life. 'అల్పజీవి'ని అక్షరశిల్పంగా చెక్కినవాడు రావిశాస్త్రి. అసంగతం, అసత్యానికి ఆవల అని దిగులు పడినవాడు కాశీభట్ల వేణుగోపాల్ చివరికి మిగిలేది? అంటూ నిరాశపడ్డాడు బుచ్చిబాబు. 'శూన్యం' అన్నాడు ముక్తవరం పార్థసారధి. 'జీవితాదర్శం' శాంతి అన్నారు గుడిపాటి వెంకటచలం. లాలసని కోల్పోయిన డాక్టర్ శేషగిరి నిర్వేదానికి నిర్వచనంగా మిగిలిపోయారు. పోనీ ఆ అరుదైన సముద్రపు నాచు స్పైరూలినా అయినా దక్కిందా? ఆనాకెరినినా ఐనా, స్పైరులినా ఐనా... మానవులకు దక్కవేమో!... ఐనా నిస్సారమైన, అసంబద్ధమైన ఈ జీవనయాత్ర వృధాప్రయాస కాదేమో!

కెరటాలమీద పడవలా వూగే ఈ ఎటర్నల్ డైలమాకి సముద్రం ఒక మెటఫర్. ప్రాణాలను నిలిపే ఆ నాచు ఒక సుదూరపు ఆశాదీపం. కథని కవచంగా ధరించి, జీవితోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ రచయిత అల్లిన బిగువైన వాక్యాల్లోని సౌందర్యాన్ని అనుభవించి తీరాలి. అనుభవజ్ఞానం అక్షరాలై వెలుగుతున్నప్పుడు, అనుభవ సారూప్యత మాత్రమే పాఠకుడికి దారి చూపించగలుగుతుంది. వొడుపూ, వాక్యనిర్మాణ చాతుర్యమే కాదు, నవలాశిల్ప రహస్యం తెలిసినవాడు సాగర్. పైకి ఇది మానవ జీవితాల మామూలు కథలాగే అనిపించినా, చెప్పుకోవడానికి కాదిది, శ్రీశ్రీ అన్నట్టు అనుభవించి, పలవరించడానికి మాత్రమే.

సాగర్ భావతీవ్రతలోని జీవశక్తి విస్ఫోటనమై మనల్ని కలవర పెడుతుంది. 'నిజాన్ని పలకవద్దు, నిప్పులాంటిది, కాలుతుంది' అనే మాటల్ని పట్టించుకునే మనిషి కాడు. సాహిత్యధర్మాన్ని నిలబెట్టడమే తన బాధ్యత అని భావించాడేమో! వేదన..సంఘర్షణ.. మానవ మనస్తత్వంలోని చీకటి గదుల ఆక్రందన గురించి ఎలా రాస్తాడంటే, సత్యం తల విరబోసుకుంటే ఎలా వుంటుందో, అలా! 'నిర్వేదం' ఒక తాత్విక చింతనామృత విశేషం మాత్రమేకాదు, నువ్వూ నేనూ తట్టుకోలేని షాక్ ట్రీట్మెంట్. ఈ పండితుడిలో దాగి వున్న తాత్వికుడికి జీవితం ఒక వ్యసనం. కళాతత్వం తెలిసిన, రసగ్రహణశక్తి వున్న యీ విశృంఖల రచయిత కొండలూ, సముద్రమూ దాటి ఆకుపచ్చని నాచుగా మారి మనకి చుట్టుకుంటాడు. బాధని తట్టుకుంటూ కన్నీళ్ళని ఆగమని ఆజ్ఞాపిస్తూ, ఇష్టమైన ఆయోష్కా బ్రాందీని ఆశ్రయిస్తాడు. “శశిని చషకంగా చేసి కళ్ళు మూసి తాగు వేదనలను" అన్న మద్దూమ్ మొహియుద్దీన్ మాటల్ని మననం చేసుకుంటాడు. పాఠకుణ్ణి ఎంటర్టైన్ చేయడానికో, గిలిగింతలు పెట్టడానికో ప్లాసిబో అనే గుళికల్ని మింగించే ప్రయత్నం చేయడీ డాక్టర్. పనివాళ్ళో, మిత్రులో, మోసగాళ్ళో, ప్రేమని పంచినవాళ్ళే... దుఃఖాత్మల వేదనాభరిత సంగీతాన్ని తీవ్రస్థాయిలో వినిపిస్తాడు. ఒంటరితనం, విరక్తితో దగ్ధం కానున్న భవిష్యత్తుని వూహిస్తూ ఆత్మహననం అనే సెల్స్ క్రూసిఫికేషన్కి పాల్పడతాడు. ఐనా సుదూరపు నీలిసముద్ర కెరటమేదో గొంతెత్తి పిలుస్తుంది. సంజీవిని స్పైరులినా పాశుపతాస్త్రమై వెన్నెల కెరటాలపై మెరుస్తుంది. ఎవరో ఆ చుక్కమ్మ ఓదార్పు బతికిస్తుంది. నమ్ముకున్న మిత్రుడు గుండెలకు హత్తుకుంటాడు. వయసుడిగిన వెంకటయ్యలో పరిపూర్ణ దర్శనభాగ్యం కలుగుతుంది. 

శ్రీరామకవచం సాగర్

అతనిలో ఏకకాలంలో బుద్ధుడు, రమణమహర్షితో పాటు సమస్త మానవ ఆత్మల తేజస్సు పరిపూర్ణంగా కనిపిస్తుంది. డాక్టర్ శ్రీరామకవచం శేషాచలపతికి ఉత్తమ మానవతాపరిమళం సమ్మిళితం అయిన ఆ మహత్తర దృశ్యం మనల్ని పులకింపజేస్తుంది.

కథ క్లయిమాక్స్ వైపు పరుగులు తీస్తుంది. ఎక్కడో, సముద్రంలోపల ఎక్కడో దాగివున్న ఆ అరుదైన నాచుకోసం ప్రయాస. ప్రయాణం మొదలవుతుంది. అలలు తాకుతున్న అనంత శూన్యంలోకి... ఏదో ప్రాచీన కలల్ని నెమరేస్తూ- అప్పుడు రచయిత సాగర్ యిలా అంటాడు:

'భయవిహ్వలిత నించి బైటపడ్డాను. విరాగిలా, బైరాగిలా. బాటిల్లో సగం మిగిలిన ద్రవాన్ని...నేరుగా సముద్రం దానం చేసిన అలల సాక్షిగా...నా శరీరమే ఓ చషకంగా నన్ను నేను ఏమార్చుకుని-ధైర్యంగా, మత్తుగా...నా ప్రాచీనుల ప్రామిసరీ నోటు కాలిపోయినా - సముద్రం వాగ్దానం చేసిన కాలాతీత వ్యక్తుల సాక్షిగా-నా మరణానంతరం అక్కడే... ఆ మూలే... నిషిద్ధమవుతున్న కొండల సాక్షిగా... కాలకూటమవుతున్న అలల పర్యావసనాల శవాల... జీవాల... దుర్గంధాల సాక్షిగా ఆగినాను!"

ఆశనిరాశల కెరటాల మీద తేలివచ్చే ఒక అనుభూతి కావ్యం 'నిర్వేదం'. స్ఫురణ, తపన... తపస్సుగా మారిన దీక్ష-గుండెకింద తడిగా మారుతున్న ఒక అపూర్వానుభవం.

శ్రీరామకవచం సాగర్ అనే పేరుతో స్నేహితుని ముసుగులో మనమధ్య ' నవ్వుతూ తిరుగుతున్న ఈ పిచ్చివాడు నిజానికో ప్రేమదుఃఖోన్మాద కవి. తన నవలలకి దహనం, మూలుగు, యాతన అని పేర్లు పెట్టుకున్నవాడు. చివరికి ‘నిర్వేదం'తో నిఖార్సయిన కవిగాక ఇంకేమవుతాడు? చలం నించి త్రిపుర దాకా డెరిడా, సార్త్ర్ నించి ఆల్బర్ట్ కామూ దాకా, అంబేద్కర్ నుంచి ఆచార్య నాగార్జునుడి దాకా పరిపూర్ణంగా చదువుకున్న, ఒక సంస్కారవంతమైన తరానికి చెందిన సాగర్ ప్రయోగాత్మక రచయితగా మన ప్రేమని పొందినవాడు. దాపరికం, భేషజం, దొంగవేషం లేకుండా నిప్పుల్లో కాల్చిన నిజాయితీతో నిజాల్ని రాయగలగటం అందరివల్లా అయ్యేపనికాదు. 'నిర్వేదం' నిస్సందేహంగా ఒక తిరుగుబాటు. బతుకు ఎన్ని సమ్మెట దెబ్బలు కొట్టినా వాటిని తట్టుకొనే ఓర్పు, సాధన- A pain within the pain తోనే నిర్వేదం రాయడం ఒక గొప్ప సాహసం. నవల అద్భుతమైన ముగింపులో-చివరికి...జీవితం కల చిట్లి శాంతిలోకి ఎగురుతావు.

Tags:    

Similar News

అవిటి నత్త