మాటమాటకి బాణీ కట్టుకునే బాలల ప్రపంచం
యుగాలు మారినా వన్నెతగ్గనిది వాళ్ల పాట ఒక్కటే...
By : The Federal
Update: 2024-08-11 03:30 GMT
-పద్మ వంగపల్లి
“అమ్మ పాడే జోల పాట” అంటూ ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ పాట, చాలా పాపులర్ అయింది.. పిల్లల్ని, పెద్దల్ని అలరించింది. ఈ తరంలో కూడా, ఒక అమ్మ పాట ఒక జోల పాట అందరినీ అలరిస్తోంది అంటే, అది పాటకున్న గొప్పతనం, అమ్మ జోలపాటలోని కమ్మదనం.
ఒక మనిషికి పాట ఎప్పుడు పరిచయమవుతుంది అంటే, అమ్మ కడుపులో ఉన్నప్పుడే అని సమాధానం చెప్పాలేమో. ప్రేమతో మాట్లాడితే, మొక్కలు కూడా వికసిస్తాయనే మాట చాలా మంది అంగీకరిస్తారు. మొక్కలకే అలా స్పందించే గుణముంటే, అమ్మ కడుపులో ఉండే బిడ్డ, పాటకి ఇంకెలా స్పందిస్తుందో మనం ఊహించుకోవచ్చు.
సంతోషంలోనూ, దు:ఖంలోనూ, వేడుకలోనూ, జాతరలోనూ, మనిషి పరిణామ క్రమంలోని ప్రతి దశలోనూ పాట ఉంది. పుట్టుకనుండి చావు దాకా పాట ఉంది. అమ్మకడుపులో ఉన్నప్పుడే బిడ్డకు పాట పరిచయమవుతుంది. అమ్మ మాట అర్థమవుతుంది. అమ్మ భావోద్వేగాలకు అనుగుగణంగానే, కడుపులో బిడ్డలో కదలికలు చాలా మందికి స్వానుభవమే. అందుకే, పిల్లలకి మొదటి పాట, అమ్మ జోలపాటతోనే పరిచయమవుతుంది.
తన బిడ్డకి పాట పాడని తల్లి ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. ఆర్థిక అంతరాలతో సంబధం లేకుండా, లాలి పాటలు, జోల పాటలు ప్రతి తల్లి తన బిడ్డకోసం పాడుతుంది. చాలా సార్లు ఆ జోలపాటతోనే అమ్మలు తమ బిడ్డల్ని నిద్రపుచ్చుతారు. గుక్కపట్టి ఏడ్చే బిడ్డను పాటతోనే సముదాయిస్తారు. బిడ్డ పుట్టినాక జరుపుకునే బారసాల వేడుకలోనూ పాటలే ప్రధాన పాత్ర పోషిస్తాయి.
జోలపాటలు, లాలిపాటలు పిల్లలని లాలిస్తాయి. అలరిస్తాయి. నిద్రపుచ్చుతాయి. ఆ తరువాత క్రమంలో పిల్లలు అనేక పాటలతో చెట్టపట్టాలేసుకుని పెరుగుతారు. అప్పుడప్పుడే మాటలు వచ్చే బుజ్జాయిలకి చిట్టి చిలకమ్మా లాంటి గేయాలు పరిచయం చేస్తాం. చుక్ చుక్ రైలు అంటూ బుజ్జాయిల వెనకాలే పరుగులు పెడతాము.
నిజంగా ఇలాంటి పాటలు, కొన్ని తరాలకు తరాలు, ఏ మార్పు లేకుండా వింటూనే ఉన్నారు. వాటి రచయిత ఎవరో తెలీదు, వాటికి స్వరాలు ఎవరు సమకూర్చారో తెలీదు. అయినా సరే, అక్షరం మార్పు లేకుండా ఇలాంటి ఎన్నో గేయాలు పిల్లల ప్రపంచంలో తూనీగల్లా తిరుగుతూనే ఉంటాయి.
ఆటలు ఆడి, పాటలు పాడి అలసీ వచ్చానే, తియ్యా తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా..
పిల్లి పిల్లా కళ్లు మూసి పీటమెక్కింది.. కుక్కపిల్లా తోకాడిస్తూ గుమ్మమెక్కింది..
అంటూ సాగే పాటలో పిల్లలకి అనేక పెంపుడు జంతువుల గురించి పరిచయం జరుగుతుంది. అలాగే ఆకలేసి వచ్చే బుజ్జాయికి ఏం తినాలనిపస్తుందో, అమ్మలకి చెప్పకనే చెప్పడం జరుగుతోంది.
నారింజ కాయ నిన్ను చూడగానె నా నోరూరు
తొక్కవిప్పి తినగ అబ్బబ్బ పులుపు తిననె తినను,
తీసి నేలకేసి కొడ్తా.. అంటూ సాగే పాటలో నారింజ పట్ల పిల్లలకుండే ఆపేక్షని, దాని రుచి చూసాక కలిగే విరక్తిని సరదాగా తెలియచేసే పాట ఇది.
చందమామ రావే.. జాబిల్లి రావే లాంటి పాటలు తాతల తాతల తాతల కాలం నుండి, ఈ తరం దాకా పిల్లలు వింటూనే ఉన్నారు. ఆ పాటకున్న ఆదరణతో సినిమాల్లోకి కూడా చేరిన సందర్భాలున్నాయి. చందమామ మీద ఏముందో తెలిసాక కూడా, అక్కడ మానవ ఆవాసాలే నిర్మించాలనే ప్రయత్నాలు మొదలయ్యాక కూడా చందమామని రమ్మని పిలుస్తున్నామంటే, పిల్లలకి ఆ పాటలు వినిపిస్తున్నామంటే అర్థమేంటి? కొన్ని పాటలు ఇక ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయని, అవి పిల్లలని, వాటిని పరిచయం చేసే పెద్దలని అలరిస్తాయనేది నిజం.
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది
పడమటింటి కాపురము చెయ్యనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది
మొగుడు చేత మొట్టికాయ తింటానన్నది
చాలా సరదాగా సాగే ఈ పాటలో, పిట్ట గురించి చెప్పడం, పిల్లలు ఆసక్తిగా వినడం చూస్తూనే ఉన్నాం. ఈ రోజుకీ ఈ గేయం, సరికొత్త టెక్నాలజీ యుగంలోనూ కార్టూన్ల రూపంలోకి మారినా, శ్రవణం నుండి దృశ్య రూపానికి మారిందే కానీ, సాహిత్యం మాత్రం అలాగే కొనసాగుతోంది. పిల్లలకి ఈ పాట వింటుంటే అదొ సరదా. నిజంగా పిట్టలు పెళ్లి చేసుకుంటాయా? అలాగే సంభాషించుకుంటాయా? అంటే కాదనే విషయం ఆ పాటని నేర్పే పెద్దలకి తెలుసు, నేర్చుకునే పిల్లలకి తెలుసు. కానీ, ఆ పాటలోని ఆనందం అలాంటిది మరి.
ఇలాంటి కొన్ని పాటల్లో మహిళల్ని, ఇంటికే పరిమితం చేసి, భర్త, పిల్లలే జీవితమనే భావజాలం కూడా ఉంది. అది కూడా పెద్దలు గమనించాల్సిన విషయం. అది పిల్లలకి అర్థం కాని విషయం.
బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెలితివి ?
బుజ్జి మేక : రాజుగారి తోటలోన మేతకెల్తిని.
రాజుగారి తోటలోన ఏమి చూస్తివి ?
బుజ్జి మేక : రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని.
పూల చెట్లు చూసి నీవు ఊరుకుంటివా ?
బుజ్జి మేక : ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని.
మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను ?
బుజ్జి మేక : తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని.
ఈ పాటలో మేకకుండే సహజ లక్షణం నచ్చిన ఆకులు కనిపిస్తే తినడం. అలాగే, రాజుగారి తోటలోకి అందరికీ ప్రవేశం ఉండదని, అక్కడి చెట్లు, ఆకులు, రాజభటుల సంరక్షణలో ఉంటాయని, వాటిని ముట్టుకోవడం, తెంచడం తప్పుగా చూస్తారనే విషయం ఈ పాటలో, చెప్పకనే చెప్పారు.
ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం
సవారీ చేస్తే చక్కని గుర్రం
సాములు చేస్తే సర్కస్ గుర్రం
పౌరుషం ఉంటె పందెం గుర్రం
ఆగకపోతే అరబ్బీ గుర్రం
చచ్చుదైతే జట్కా గుర్రం
గుర్రం అందరికీ అందుబాటులో ఉండే పెంపుడు జంతువు కాదు. కానీ, పిల్లలకి ఆ గుర్రమెక్కాలనే మక్కువ చాలా ఉంటుంది. అలాంటి పిల్లలందరూ ఈ గుర్రం పాటను భలే ఆస్వాదిస్తూ పాడుకోవడం మనకి తెలుసు. బొమ్మ గుర్రాలమీద కూర్చుని కూడా సంబరపడుతూ, ఈ పాట పాడుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ మొత్తం పాటలో ఒక్కో గుర్రం ఒక్కో ప్రత్యేకతను ఎలా కలిగి ఉంటుందో కూడా తెలియచేస్తుంది.
బావ బావ పన్నీరు బావ ని పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీసెడు గంధం పూసేరు
చావడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు ఇలాంటి సరదా పాటలు పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా వరసైన వాళ్లని ఆటపట్టించడానికి పాడుకోవడం చాలా చోట్ల చూస్తాం. అంతగా బావగారిని గుంజీలు తీయించేపాట, వరుసైన వాళ్లు సరదాగా పాట.
వానకాలం పిల్లలకి ఆనందాలు తెస్తుంది. వానకాలం గురించి ఈ తరం పిల్లలు కూడా పాడుకునే, వానా వానా వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్పా. తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగలేని నరసప్పా లాంటి పాటలు వినేందుకు పెద్ద వాళ్లకు కూడా తమాషాగా అనిపిస్తాయి.
ఇలాంటి పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు, పిల్లలకు భాషను నేర్పే సాధనాలు కూడా. ఇందులో పదాలు, పేర్లు, అక్షరాలతో చేసిన ప్రయోగాలు అద్భుతమనే చెప్పాలి. భాషకూడా పిల్లలకి ఈ పాటల రూపంలో చేరువవుతుంది.
ఉడుత ఉడుత ఊచ్ ఎక్కడికెళ్తావోచ్ .. కొమ్మమీద జాం పండు కోసుకొస్తావా., మా పాపాయికిస్తావా.. ఈ పాట విని పెరిగిన వాళ్లు, ఇప్పటికీ ఆ పాట పాడుకుంటారంటే, అతిశయోక్తి కాదేమో. ఉడుత కనిపించగానే, ఆ పాట మనకి గుర్తురాకమానదు. అంతగా ఈ ఉడుత పాట మనతో పెనవేసుకుపోయింది.
మెజార్టీ పిల్లలు పాడుకునే జానీ జానీ ఎస్ పప్పా కూడా, పిల్లలందరికీ ఇష్టమైన గేయం. అందులో నాన్నతో ఒక చిన్నారికి జరిగే సంభాషణ. ఇష్టమైన పంచదారని ఎవరికీ తెలీకుండా తినడం, నాన్న అడిగితే తినలేదని సమాధానం చెప్పడం, తిరిగి దొరికి పోవడం.. భలే ఉంటుంది.
అందులోని లయ, శృతి కూడా పిల్లల మనసుల్లో ఒక కొత్త ఉత్సాహన్ని నింపుతుంది. ఇలాంటి పాటలు పాడేటప్పుడు పిల్లలు ఆ పాటకి అనుగుణంగా నటిస్తూ, వారు కదిలే తీరు మనకి కళ్లకింపుగా ఉంటుంది. ఇలాంటి పాటలు పిల్లలకి పదాల పొందికని, తర్కాన్ని, అనేక వాస్తవాలను తెలియచేస్తాయి. ప్రకృతిని పరిచయం చేస్తాయి, చుట్టూ ఉండే ఇతర జంతుజాలంతో మచ్చికచేయడం కూడా నేర్పిస్తాయి.
ఇలా పిల్లలు అమ్మ పాడే జోలపాటలు, లాలి పాటలు వింటూ, ఎదిగే క్రమంలో ఇతర పాటలు వింటూ వాటిని నేర్చుకుంటూ, పాడుతూ ఉంటారు. యుక్త వయసు వచ్చేసరికి పిల్లల ఆలోచనలు, ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. వారు కోరుకునే పాటలు కొత్తగా ఉంటాయి. తిరిగి ఈ పిల్లలు చదువులు పూర్తయి, ఉద్యోగాలు సంపాదించుకుని, పెళ్లిళ్లు చేసుకుని, జీవితాల్లో స్థిరపడ్డాక, వాళ్లకి పిల్లలు పుట్టాక, తిరిగి బాల్యంలో తాము నేర్చుకున్న పాటలు, పాడుకున్న గేయాలే తమ పిల్లలకి కూడా వినిపించడం ప్రతి ఇంటా జరిగేదే కదా..
అదే ఆ పిల్లల పాటలకున్న గొప్పతనం. ఆ పాటల్లో ఉన్న కమ్మదనం.