కలం చాటు కవిత...

పడమటి కిటికి: ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ అమెరికా నుంచి పంపిన మూడు ముచ్చటైన కవితలు...;

Update: 2025-03-09 04:33 GMT

-ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ


కలం చాటు కవిత


కలం దాటని కవితలెన్నో గళం మాటున ఒదిగి ఉన్నాయ్

పెదవి దాటని ప్రేమలెన్నో మనసు చాటున దాగి ఉన్నాయ్

కళ్ళు చూసే కలతలెన్నో, కవితకొదగని బాధలెన్నో

ఎద దొలిచే వెతలెన్నో

మది దాటని గతులెన్నో మనసు చాటున పొంచి ఉన్నాయ్

నా ఎద పుటల్లో కడగండ్లు చెమర్చని నేత్ర నిశ్చలతలున్నాయ్

స్పర్శ చెప్పని ప్రేమ భాషల మధుర గీతికలున్నాయ్

పాంచభౌతిక, పంచేంద్రియ సంసార గతుల

జీవన గమనాల గుర్తులున్నాయి

జాడలున్నాయ్

కదలని కలం పలకని గళం

నన్ను జడంలా చూసి వెక్కిరిస్తున్నాయ్

2. తెలుగోడు

అవధానమది మన భాష సొత్తు

ఆవకాయ మన జాతి మత్తు

నిరవధిక వాక్సుధారస గరిమ మన కవుల సత్త

పప్పునయిన, పచ్చి ఆకునైన, అరి నరులనైన

నూరి వడ్డించు దొడ్డ ఘనత మన పాకశాస్త్ర గరిమ

అవధులన్ని దాటి గూగులునేలి, నాసాగ్రమున

నిల్చు కుశలాగ్ర బుద్ధి మన జాతి జన్యు రీతి

పోటీకి పాఠాలు, ఆషాఢభూతికి వినయాలు

శాస్త్రాలకి లొసుగులు నేర్పే బుధజన భూమి మనది

సలహాలకి రెక్కలిచ్చే గిరీశ గోత్రం మన వంశ భాగ్యం

తెలుగు భాష లెస్సయని పరభాష

రొంబ పలుకు దొడ్డ ఠీవి మనది

సరస సంభాషణ మన భాష మాండలిక సంపద

బహుళ ప్రజ్ఞాఖని, ఎల్లలెరుగని ఆదర్శ ముని

తెలుగు వాడు జగమెరిగిన దొడ్డ వాడు

వెరసి కెలికి కేళించువాడు తెలుగు వాడు

 3. పాశ్చాత్యం

మగువకి కొప్పులేదు

మల్లెకి వాసన లేదు

మగడికి జుట్టు లేదు

బిడ్డకి ప్రేమ లేదు

తిండికి రుచి లేదు

భుక్తికి వేళలేదు

ఖర్చుకి అదుపు లేదు

అప్పుకి కొదువ లేదు

ఆశకి అంతు లేదు

పశ్చిమం అలసి ప్రాగ్ముఖం పట్టింది

ప్రభాతం, సుప్రభాతం, సినిమా దృశ్యాలయ్యాయి

వాల్జడలు స్మాల్జడలయ్యాయ్

పరమాన్నాలు పిజ్జాల పోటీకి చిన్నబోతున్నాయ్

వాడవాడలు మాల్వాడల కొలువులయ్యాయ్

అప్పు తెచ్చి ఐపు పెట్టే అప్పనయ్యల భోగ్యం నవ భారత నైజమయ్యింది

ప్రాక్పశ్చిమ సంగమం నవయుగ నిజ రూప జీవనం


Tags:    

Similar News