తిరుపతి ‘మల్లి సమోసా’ ఒకసారి తింటే, మళ్లీ మళ్లీ రావాల్సిందే...

మల్లి నిజంగానే సమోసాపారంగతుడు. చక్కగా, అందంగా,నునుపుగా, సౌష్టవంగా , త్రిభుజ సౌందర్యాలను కూరుతున్న వైనం కళ్లారా చూసి తీరాల్సిందే

Update: 2023-12-21 09:29 GMT
మాల్యాద్రి సమోసా బండి, తిరుపతి

(భూమన్ )

మల్లి తిరుపతిలో సమోసాల స్పెషలిస్ట్. ఒక ఏరియాలో ఆయన సమోసా ఎంత పాపులర్ అంటే, ఆయన జిఐ టాగ్ తీసుకోవచ్చు. సమోసా కూడా దోశ లాగానే ఎపుడూ నిత్యనూతనవుతున్న పసందయిన స్నాక్. దీనికి మల్లి సమోసాలు సాక్ష్యం.

మా పిల్లప్పుడు గాంధీ వీధిలోని డీలక్స్ హోటల్ సమోసాలకు నాటి కుర్ర కారంతా ఫిదా.. మరి కైమా సమోసాలంటేనో. ఇక చెప్పలేం.

మల్లి పూర్తి పేరు వేమన మల్యాద్రి. నాతో పాటి చాలా కాలంగా తిరుపతి కొండల్లోకి ట్రెకింగ్ వస్తున్నాడు. అతగాడు చేయి తిరిగిన సమోసాల స్పెషలిస్టు అని చెబుతూంటే విన్నాను. ఎపుడూ ఆ కోణం మీద దృష్టిపెట్టలేదు. మా బృందంలో ఒక ట్రెకర్ గానే చూశాను. రెండు మూడు సార్లు మా మిత్రులు ‘ మల్లి సమోసా’ లు మీరు తినాల్సిందే సార్ అన్నారు. అపుడూ నేను శ్రద్ద చూపలేదు. అయితే, పీర్ ప్రెజర్ ఎక్కువయింది. దీనితో ఒక సారి మల్లిన అడ్రస్ ఎక్కడ అని అడిగాను. ఆయన చెప్పాడు. ఆతర్వాత మర్చిపోయాను.

 



మొన్నా అధివారం బైరాగి పట్టెడ వెళ్లాను. అపుడొక మిత్రుడికోసం ఎదరుచూస్తున్నపుడు మల్లి ఇచ్చిన అడ్రసు గుర్తొచ్చింది. వెంటనే పక్కనే ఉన్న జగ్జీవన్ రామ్ పార్క్ దగ్గిర తిష్టవేసిన మల్లి సమోసా బండి దగ్గరికి వెళ్లాను. మనవాడిని ఆశ్చర్యపరిచాను.

మల్లి నిజంగానే సమోసాపారంగతుడు. చక్కగా, అందంగా,నునుపుగా, సౌష్టవంగా సమోసాలను తీర్చిదిద్దు తున్న వైనం కళ్లారా చూశాను. ఎన్ని సమోసాలు తిన్ననో గుర్తు లేదు. దాంతో సమోసా పూనకం వచ్చింది.

సమోసాలకు ఉన్న డగ్ర్స్ లాంటి వశీకరణ శక్తి. సమోసా ప్రియల్లో ఎడ్డిక్టయినవాళ్లే ఎక్కువ గాంటారు. వాళ్లు రోడ్డు, బస్సుల్లో, రైళ్లలోసమోసాలు అమ్మే వాడు రాగానే, కొనకుండా తినకుండా ఉండటం కష్టం.ఒక్కొక్క సమోసాది ఒక్కొక్క రుచి. ఏ రెండు సమోసాలు ఒక లాగుండవు. చేసేవాడిని బట్టి సమోస రుచి మారినట్లే, వూరునుబట్టి సమోసరుచి మారుతుంది. హైదరాబాద్ సమోస రుచి తిరుపతిలోఉండదు. అట్లాగే తిరుపతిలో ఉన్న సమోస రుచి చెన్నైలో ఉండదు, ఢిల్లీలో ఉండదు. నేను చాలా సార్లు ఢిల్లీ బెంగాలీ మార్కెట్ లో సమోసాలుతిన్నాను. ఆరుచే వేరు. ఈ తేడా గమనించాక సినిమా హాళ్లల్లో, రైళ్లలో, బస్సుల్లో సమోసాలు రుచి చూడటం ఎక్కువైంది. ఏ ఊరికి పోయినా ఏ దేశానికి పోయినా సమోసా,టి లేనిదే గడిచేది కాదు.

ఆ మధ్య కోక్ వాళ్లు సమోసాకు కొత్త అలవాటు జోడించారు. అమీర్ ఖాన్ బెట్టి సమోసా కోక్ కాంబినేషన్ తో యాడ్స్ గుప్పించారు. దీనితో సమాసా టీ తో పాటు మరొక జోడి, కోక్, దొరికింది. ఎవిరిష్టం వాళ్లది. నాకయితే, సమోసా టీ అద్భుతమయిన కాంబినేషన్.

ఈ సమోసా ఎక్కడి నుంచి వచ్చింది?


 



దేశమంతా అల్లుకు పోయిన ఈ సమాసా, తీరా చూస్తే ఇండియాది కాదు. ఇలా చెబితే నమ్మడం కష్టం. అది మధ్యప్రాచర్యం పదోశతాబ్దంలో ఇండియా వైపు వచ్చాయి. అరోజుల్లో ప్రపంచాన్వేషణలో ఉన్నవాళ్లు, తాము తీసుకుపోయేందుకు వీలుగా,రుచిగా, అంత సులభంగా చెడిపోకుండా ఉండేందుకు ఈ సమోసాలను కనిపెట్టారు. దీని ప్రస్తావన ఇరాన్ దేశస్థుడు అబోల్ ఫజాబే హకీ ( Abolfazabey Haqi) రాసిన తర్ఖే బో హరీ( Tarkhe Bay Harhi) అనే పుస్తకంలో కనిపించింది. దీనిని ఆ రోజుల్లో సంబోసా గా పలిచే వారు. అమీర ఖుస్రో తుగ్లక్ కాలంలో సమోస ప్రస్తావన ఉంది. సంబోసా ఎపుడు సమోస గా మారిందోచెప్పడం కష్టం.

మన దేశంలో 13వ శతాబ్దంలో అడుగుపెట్టినప్పటి నుండి నలుమూలలకు ఎగబాకింది. రకరకాల ఆకారాలతో ప్రత్యక్షమవుతుంది. లోన్ స్టఫ్ నుబట్టి కొత్త కొత్త పేర్లతో నిత్యనూతనమవుతూ ఉంది.  చివరకు వరల్డ్ సమోసా డే జరుపుకునే స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అయిదు, ప్రపంచ సమోసా దినోత్సవంగా గుర్తించారు తెలుసా.

బంగారు రంగుతో మిరమిట్లు గొలిపే ఈ సమోసా అలనాటి రాజులను ,రాణులను మెప్పించినట్లే ఇప్పటివారిని రకరకాల రుచులతో మెప్పిస్తున్నది. మైదా, గోధుమల పిండితో తయారయ్యే ఈ సమోసా నెయ్యి ,ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు,మొక్కజొన్న,మష్రూమ్, క్యాబేజీ ,అల్లం ,బఠానీలు, కోడి ,పొట్టేలు,మేకపోతు, ఎద్దు, గుడ్లు, చాపల గుబాలింపుతో అలరిస్తున్నది.

విద్యార్థులకైతే సమోసా చాట్ పెరుగు, చింతపండు సాస్ , కొత్తిమీర చట్నీ,చాట్ మసాలాతో బానిసలను చేస్తున్నది.

అస్సాం ,ఒరిస్సా, పశ్చిమబెంగాల్ బీహార్, ఉత్తరాఖండ్లో చిన్న సమోసాలు రాజ్యమేలుతుండగా ఆంధ్రా సమోసాలేమో కాస్త పెద్దవి.

హైదరాబాదులో చోటా వాల సమోసాలుంటాయి. ఇరానీ హోటల్లు వాటిని సార్వజీనం చేశాయి. ఎర్రమంజిల్ దగ్గిర రెడ్ రోజ్, బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1 సర్వి, సికింద్రాబాద్ ఆల్ఫా సమోసాలకు ఫిదా కాకుండా ఎవరుంటాయి. చోటావాల సమోసాలు చాయ్ కు మాంచి కాంబినేషన్.

సమోసా సలాడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ముక్కలుగా తరిగి సమోసా ,ఎర్రగడ్డలు, క్యాబేజీ పుదీనా, ఉల్లగడ్డలు, బఠానీలు, మసాలాలు నీచుతేట మిరప్పొడి ఉప్పు నిమ్మరసంతో అదిరిపోతుంది.

మద్రాసు బుహారి కీమా సమోసా తర్వాత దాన్ని మించిపోయిన మా మల్లి పురుషోత్తం సమోసాలు తిరుపతి వాళ్లని తిండిబోతుల్ని చేస్తున్నాయి.


 



తిరుపతిలో ప్రతి దినం బైరాగి పట్టెడలో ఉన్న జగజ్జీవన్ పార్క్ ఎదురుగా మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యి, రాత్రి 9 గంటల వరకు సాగే ఈ సమోసా ప్రయాణం నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నా. మొక్కజొన్నలు, ,ఎర్రగడ్డలు, గుడ్డు,కోడి, మసాలా పన్నీరు,మష్రూమ్ మొదలైన అయిదారు రకాల సమోసాలు అక్కడ ఘుమఘలాడుతూ ఉంటాయి. ఆ గుభాళింపు ఆదారిన పోయే ఎవరినైనా ఈ బంగారు రంగు సమోసాలు వలేసి లాక్కుంటాయి. మిగతా చోట్ల కంటే ఇక్కడ ధర కూడా తక్కువు. తక్కువ ధరతో తినేవారి తృప్తే తమ తృప్తి సార్ అనే మా ట్రెక్కింగ్ సహచరుని జీవన విధానం గొప్ప ఆదర్శం .

ఎంత కాలమిలా మల్లీ అంటే సార్ హాయిగా ఉంది జీవితం, శ్రమ అయినా జీవన సౌందర్యానికి మించినదేముండదు. ఆయన దగ్గిరకొచ్చే వాళ్లంతా ఆయన సమోసాలుకు సమ్మోహితులయిన పాత వాళ్లే. వాళ్లకి నచ్చినంతవరకు, వాళ్లు మెచ్చినంతవరకు అని చాలా తెలివైన సమాధానం చెప్పారు.


(భూమన్. ఫుడ్ క్రిటిక్,ట్రెకర్, తిరుపతి)

Tags:    

Similar News