ఇప్పుడే మాట్లాడేసుకుందాం (Today's Poem)

మనుషుల సంబంధాలు ఎపుడు ఎలా మారిపోతాయో తెలియని పరిస్థితి. అందుకే ఇపుడు మాట్లాడేసుకోవాలి, రేపు ఎవరు ఏమై పోతారో తెలియని అనిశ్చితిని గుర్తు చేసే కవిత

Update: 2024-05-11 03:21 GMT

 -డా.గూటం స్వామి

*******

ఇప్పుడే

అందరితో మాట్లాడేయండి!

అక్కలు,తమ్ముళ్లతో

ముందు ముందు ఇంత ప్రేమగా

మాట్లాడే అవకాశం దొరక్కపోవచ్చు!!

ఎవరి బ్రతుకులు వారివి అయిపోయినప్పుడు

బంధాలు బరువైపోయినప్పుడు

భవిష్యత్తు లో ఇంతటి ప్రేమలు ఉండకపోవచ్చు!!

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే

మాట్లాడేసుకోండి!

ముందు ముందు వాళ్ళతో మాట్లాడటానికి

సమయం చిక్కకపోవచ్చు!

వాళ్ళు నీతో మాట్లాడటానికి

ఇష్టపడకపోవనూ వచ్చు!

బంధాలు బళ్ళుమంటున్నప్పుడు

ఇంతకంటే ఎక్కువ ఆశించడం లో అర్ధంలేదు!

అమ్మకు నాన్నకు ఇప్పుడే

వాళ్ళకు ఇష్టమైనవన్ని కొని ఇచ్చేయండి!

నీకు పెళ్ళి అయ్యాక వాళ్ళకు కొనడానికి డబ్బులు ఉన్నా

కొని ఇవ్వడానికి నీ సహచరి ఇష్టపడకపోవచ్చు!

అమ్మ నాన్న ప్రేమను

ఇప్పుడే అనుభవించేయండి!

ముందు ముందు ఆ అవకాశం కోల్పోవచ్చు!

కాలచక్రంలో అనేకమార్పులు!

ఒకటి పొందడానికి పోతే

ఇంకొకటి పోగొట్టుకుంటున్న వైనం!

ఎవరూ ఏమి చేయలేరు!

ఎంత గుంజుకున్నా లాభం లేదు!!

అందమైన బాల్యంలో

మధుర జ్ఞాపకాలెన్నో!

గుండె పొరల్లో నిక్షిప్తం చేసుకో!

కష్టసమయాల్లో అక్కరకు రావచ్చు!.

నిట్టూర్పు సమయాల్లో నిన్ను ఆనంద పరచవచ్చు!!

ఇప్పుడే

అందరితో మనఃస్ఫూర్తిగా మాట్లాడేసుకో!!

అనుబంధాలను చెరిగిపోని తరహాలో

స్మృతులకెక్కించుకో

ముందు ముందు ఆ అవకాశం నువ్వు కోల్పవచ్చు!!




Tags:    

Similar News