ఓసారి ఊరెళ్లండి..!
పండగకో పబ్బానికో వూరెళ్లడం చాలా ఆహ్లాదకరమయిన అనుభవం. పచ్చగా, చల్లగా, మెల్లగా పారాడుతున్న బతుకును చూడటం కనువిందు. అందుకే అపుడపుడూ వూరెళ్తూ ఉండాలని చెప్పే కవిత
By : The Federal
Update: 2024-04-02 07:26 GMT
ఓసారి ఊరెళ్లండి..!
-సంగెవేని రవీంద్ర
ఒకసారి ఊరెళ్ళిరండి...
ఆకాశjగంగ ఆనందంతో దూకినట్టు..
మండుటెండలో పండు వెన్నెల జాల్వారినట్టు...
ఈ కాంక్రీట్ జంగిల్ డబ్బునివ్వొచ్చు..
బొక్కల్ని సున్నంలో వేసి పిండుకుంది కదా...
పిశాచం నోరు తెరుచుకున్నట్టు విశాలమైన రోడ్లు..
అయితేనేం..
పాదాలకు పాదరసం అద్ది పరుగెత్తిస్తాయి..
మరో వైపు ఆకాశాన్ని సవాల్ చేసే రాకాసి టవర్లు...
పునాదుల్లో గుడిసెల్ని సమాధి చేసుకొని...
రక్తం.. రౌద్రం.. స్వేదం ..
ఎన్నో దారపోస్తే ఈ నగరం కాస్త కనికరించిందేమో కానీ...
ఖరీదు కట్టకుండా కన్నీళ్లేప్పుడూ తుడవలేదు...
నకిలీ సుఖాల వ్యామోహంలో
అసలు ముఖాల్ని వికారం చేసే నగరం...
పల్లెకెప్పుడూ ప్రత్యామ్నాయం కాబోదు...
పల్లె కళ్ళల్లోని పలకరింపుల మెరుపు జాడలు..
రంగులు పులుముకున్న నగరంలో అగుపించవు...
నగరం ఒక బిగ్ బజార్..
ప్రతిదానికీ రేటుంటుంది...
పల్లె కన్నతల్లి లాంటిది...
చల్లని ఒడిలో దాచుకుంటుంది...
తెలియని భయాలు చుట్టుముట్టినప్పుడు...
సమూహంలో ఒంటరిగా ఫీలైనప్పుడు...
గుండెల్నిండా అసంతృప్త ఆకాంక్షల నాగులు బుస కొట్టినప్పుడు...
చెవి రంధ్రాల్లో ధన బంధాలు కల్లోల సంద్రాలుగా మారినప్పుడు..
అలా ఒకసారి ప్రశాంతంగా ఊరెళ్ళిరండి..
మనసు దాహం తీరేటట్టు..
జారిన స్వప్నం దొరికినట్టు..
శాశ్వతంగా కాకపోయినా
కాసేపైన ...
స్వేచ్ఛగా ఊపిరి ఊదినట్టు...
ఊరెళ్ళడమంటే...
గుండెల్లో ఎదో జలపాతం పొంగినట్టు..
అందులో కిలకిలలాడుతూ కేరింతలు కొట్టినట్టు...
భలే తాజాగా ఉంటుంది..!!