వ్యత్యాసం (కవిత)
సంక్లిష్టమయిన సమాజం నిర్మించుకున్న మనిషికి, సమాజమే లేని ఇతర ప్రాణులకు ఉన్న తేడా ఏమిటో చెప్పే చక్కటి కవిత
By : The Federal
Update: 2024-02-19 06:46 GMT
వ్యత్యాసం !
తమ్మినేని అక్కిరాజు
కనీసావసరాలు
'కూడుగూడు' లేకపోతే
సమాజం దేనికి?
సమాజంలేని జీవుల్లో
కూడుగూడు లేని స్థితి
ఎక్కడా కనబడదే!
సమాజం నిర్మించు కున్న
మనిషికే ఈ దుస్థితి!
ఎందుకొచ్చింది?
మనిషి తప్ప-ఇతర
జీవ జాతులన్నీ
ప్రకృతి ఆధారితాలే !
మనిషి ఒక్కడే
నిరాధారుడైన
సామాజిక జీవి!
సమాజ నిర్మాణంలో
కంటే -ప్రకృతిలోనే
న్యాయబద్ధత ఉంది!
ఈ సమాజం దేనికి?
మనిషిని మనిషి
దోచుకు తినటానికా?
దగా దోపిడి వంచన
బ్లాక్మెయిల్ కిడ్నా ప్
హైజాక్ మాఫియా
అబద్ధాలు మోసం
భక్తి ముక్తి స్వర్గం
నరకం పుణ్యం పాపం
ఇవి మనుషులకే!
సర్వజీవుల సామ్యం
చావు పుట్టకలే!
ఇంకెందుకు సమాజం?
ప్రకృతిలోఉన్న ఏర్పాటు
సమాజానికి ఉండదా?
ఇదంతా చూస్తుంటే
'మనిషే 'కావాలని
చేస్తున్నట్టు లేదూ?
మన కష్టసుఖాలకు -దేవుడు
కారణమైతే -ఇతర జీవ
జాతుల్లోదేవుడు లేడు కదా ?
దేవుడితో పనిలేకుండా
అవి సుఖంగా జీవిస్తుంటే
దేవుడుండి మనకు కష్టాలా?
'ప్రకృతి'ని దేవుడిస్తే
'సమాజం' మనిషిది!
మనిషే మోసగాడు!
వీడి ఆర్ధిక సూత్రాల్లో
ఏదో లోపం ఉంది!
వాటిని మార్చాలి!
గుళ్ళు,దేవుళ్ళు సమస్యల్ని
పరిష్కరించవని మనకు
అర్థమైంది కదా?
నా ప్రశ్నల్లో -తర్కం
న్యాయం వేదాంతం
మానవత్వం ఉంది!
జవాబులు కావలి!
ఎవరు చెపుతారు?
మీరు? మీరు? మీరు?
గాంధీ నెహ్రూ పటేల్
మార్క్స్ అంబేడ్కర్
నాయకులు ఎవరైనా?
మోడీ జీ ని అడిగితే
రాముణ్ణి చూపిస్తాడు!
ఆయనవల్ల కాదు!
కనీసావసరాలు తీరే
సమాజం కావాలి!
జవాబు చెప్పేదెవరు?
అదాని అంబానీల భాగ్యం!
పూట గడవని దరిద్రం!
ఎందుకింత వ్యత్యాసం?