కథలన్నీ కంచికి ఎందుకు చేరాలి...?

కథ కంచికి మనం ఇంటికి... అంటాం... కథలన్నీ కంచికే ఎందుకు చేరాలి...? కంచె ఏమైనా కథలను నిల్వచేసే కారాగారమా...?

Update: 2024-04-19 09:50 GMT
Source: Twitter

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: అనగనగా ఓ రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు... ఓ కొండపై వాటిని ఎండబెట్టారు... అందులో ఓ చేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు అంటే... నాకు గడ్డిపరక అడ్డొచ్చింది అని చెప్పింది. గడ్డి గడ్డి ఎందుకు అడ్డొచ్చావంటే.. నన్ను ఆవు మేయలేదని చెప్పింది. ఆవు ఆవు ఎందుకు మేయలేదు అంటే… నన్ను పోలిగాడు ఇప్పలేదని చెప్పింది. ఏమిరా పోలిగాడా ఆవును ఎందుకు ఇప్పలేదు అంటే.. నాకు అవ్వ గంజి పోయలేదు అన్నాడట... అవ్వ అవ్వ ఎందుకు గంజిపోయలేదు అంటే... నా పిల్లోడు ఏడుస్తున్నాడు అందట... పిల్లడా పిల్లడా ఎందుకు ఏడుస్తున్నావు అంటే... నన్ను చీమ కుట్టింది అన్నాడట... చీమ చీమ ఎందుకు కుట్టావంటే... నా బంగారు పుట్టలో చెయ్యి పెడితే కుట్టనా అందట... ఆ ఇంతటితో కథ అయిపోయింది. ఇక కథ కంచికి మనం ఇంటికి.. చిన్నతనంలో నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన ఎన్నో కథలు మనం విని ఉంటాం. ఏ కథ చెప్పినా చివర్లో కథ కంచికి మనం ఇంటికి అంటూ ఉండేవారు... కంచికి కథకి అసలు సంబంధం ఏంటి...? కంచి అనేది మహా పుణ్యక్షేత్రం... తమిళనాడులో ఉండే కంచి కామాక్షమ్మ టెంపుల్‌కి మన పెద్దలు చెప్పే కథలకు అసలు సంబంధం ఏంటి...? అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తే ఉంటాయి.

అసలు కంచి గురించి ఓసారి తెలుసుకుందాం...

కాంచీపురం... ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని... అక్కడున్న కామాక్షమ్మ ఆలయం అతి ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాలలో వేగవతి, పాలార్ నదుల మధ్య కాంచీపురం పట్టణ నిర్మాణం జరగగా... పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం, కర్ణాటక రాజ్యం చివరకు బ్రిటిష్ వాళ్లచే పాలించబడిన నగరం అది. అత్యధిక దేవాలయాలు కలిగిన నగరంగా దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. సంస్కృత పదాలు 'కంచి' 'పురం' లను కలిపి కాంచీపురంగా పేరు పెట్టారు. కాంచీపురం అంటే బ్రహ్మ ఆరాధన స్థలం అని అర్థం. వెయ్యి దేవాలయాల నగరంగా కూడా ఈ నగరం ప్రసిద్ధి చెందింది. అందులో ఒకటి కంచి కామాక్షమ్మ దేవాలయం. ఆలయాలకే కాదు కంచి.. పట్టు చీరలకు కూడా ప్రసిద్ధి చెందింది. కంచిలో ఆదిశక్తి అమ్మవారి అంశగా కామాక్షమ్మ వెలిశారు. భారతదేశంలో ఉన్న శక్తి పీఠాల్లో ఇది ఒకటి.

మన కథకి కంచికి సంబంధం ఏంటి...?

నిజానికి చెప్పాలంటే కథకి కంచికి అసలు సంబంధమే లేదు... కథ కంచికి అంటే కామాక్షమ్మ టెంపుల్ కాదు... కంచె అంటే ముళ్లకంచి... కథలన్నీ కల్పితలే కాబట్టి... కథ విన్నాక ఆ కథని కంచి (ముళ్ళ కంచె) లో పడేసి మన పని మనం చేసుకోవాలని దాని అర్థం. లేకపోతే మనం చెప్పుకునే కథలో గడ్డి పరక, ఆవు, చీమ మాట్లాడడం ఏంటి...? కథలన్నీ కంచికెందుకు చేరుతాయని ఓ పెద్దాయనని అడుగుగా...' కంచి అంటే తమిళనాడులోని కంచి కామాక్షమ్మ దేవాలయం కాదు. వ్యర్థమైన కథలు బుర్రలో పెట్టుకోకుండా కథలను ముళ్ళకంచిలో వేసి ఇంటికి వెళ్లాలని దాని అర్థం' అని ఓ రిటైర్డ్ ఉద్యోగి శైలసోమయాజుల. సూర్యనారాయణమూర్తి.. ది ఫెడరల్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు. దీంతో కథలన్నీ కంచికే ఎందుకు వెళ్లి చేరుతాయి... అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది.

Tags:    

Similar News