బడికి సెలవైన రోజు

రకరకాల బాల్యమంతా ఒక రాసి పోసినట్లుంది బడి. బడిలో అరుపులు, కేకలు, బెదిరింపులు, అటలు, పాటలు ఆ కోలాహం వినడానికి ఇంత ఇంపుగా ఉంటుంది. బడికి సెలవిస్తే....

Update: 2024-03-20 05:50 GMT




నేటి కవిత


బడికి సెలవైన రోజు

బడికి సెలవైనరోజు
తరగతి గదులన్ని బెంగపెట్టుకుంటాయి!
ఐ.ఎఫ్.బి ప్యానల్స్ ముఖాలు నల్లగా మాడ్చుకుంటాయి
గ్రీన్ బోర్డులు బుంగమూతి పెడతాయి!
వరండాలు నిశ్శబ్ద దుప్పటి కప్పుకుంటాయి!
బెంచీలు కళతప్పిన రంగస్ధలమౌతుంది!
బడిగంట బిర్రబిగిసి మూగబోతుంది!
కిటికీలు, గుమ్మాలు తమ కళ్ళను తలుపులకు అతికించి మరీ చూస్తుంటాయి!
విద్యార్థుల రాకకోసం నిరీక్షణలు పోతాయి!
శునకాలు ఎక్కడిబడితే అక్కడ
గుర్రుపెట్టి నిద్రిస్తుంటాయి!

బడికి సెలవైనరోజో
ఏవైనా పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నప్పుడో
ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో
బడికి వెళితే
అప్పుడు ఎందుకో
తెలిసిన చోటైనా కొత్తగా అనిపిస్తుంది!
పరిసరాలు వింతగా తోస్తాయి!
హెచ్.ఎమ్.గది విశాలంగా కనిపిస్తుంది
ఆటస్థలం ఎడారిని తలపిస్తుంది!
పలకరింపులు లేక బోర్ కొట్టేస్తుంది!
అంతక్రితం గేటులోకి అడుగు పెట్టగానే
పరుగునఎదరొచ్చి పలకరించే విద్యార్థుల కోసం కళ్ళు ఆత్రంగా వెతుక్కుంటాయి!!

బడికి సెలవిచ్చిన రోజు
బడి ప్రాంగణంలో అడుగుపెడితే
పువ్వులు లేని తోటలోకి వెళ్ళినట్టుంటుంది!
ఆక్సిజన్ అందక కొట్టిమిట్టాడినట్టే ఉంటుంది!

ఏమైనా చెప్పండి
బడిలో పిల్లలు లేకుంటే
ఆ పాఠశాల పాఠశాలే కాదు!
కళ్ళముందు విద్యార్థులు కనబడకపోతే
ఉపాధ్యాయుల మోముల్లో
వెలుగురేఖలు విచ్చుకోవు!
ఉపాద్యాయులు,విద్యార్థులు
పాఠశాలకు కళ్ళు లాంటివాళ్ళు!
ఒక్క కన్ను దెబ్బతిన్నా ఆ బడి
సూర్యుడు లేని ఆకాశమే అవుతుంది!!

(ఓపెన్ స్కూల్ పరీక్షల సందర్భంగా మా పాఠశాలకు సిట్టింగ్ స్క్వాడ్ గా వెళ్తున్నప్పుడు అక్కడి వాతావరణం చూసి..రాసిన కవిత)

డా.గూటం స్వామి


Tags:    

Similar News