ఆదివాసీ దినోత్సవాలు ఎందుకంటే...

మానవ సంస్కృతులన్నింటికి మూలం ఆదివాసిలే కారణమా..;

Update: 2025-08-09 05:12 GMT
సాంప్రదాయ అలంకరణలో ఆదివాసీలు

డా. ద్యావనపల్లి సత్యనారాయణ

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం మంది ఆదివాసులున్నారు. సుమారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం అందరం ఆదివాసులమేననే సంగతి సుమారుగా చదువుకున్నవాళ్ళందరికీ తెలుసు.

ఈ వేల సంవత్సరాల కాలంలో రకరకాల ప్రదేశాలకు వలస వెళ్ళి ఆర్థికంగా వెసులుబాటు పొంది సుమారు తొంబై శాతం మంది బాగుపడ్డారు. ఇంకా కొంత (5 నుంచి 10 శాతం) మంది అడవుల్లోనే జీవిస్తూ ఆదికాలాల నాటి జీవన సంస్కృతులను కాపాడుతూ వస్తున్నారు.

అంటే మన అందరి మూలాలను కాపాడుతూ వస్తున్నారు. ఆ వివరాలు, విశేషాలను తెలుసుకోవడానికే ఆదివాసీ దినోత్సవాలు జరుపుకోవాలి.

ఇలాంటి అవసరాన్ని 1977 లో ఐక్యరాజ్య సమితి గుర్తించి పలు అంతర్జాతీయ సమావేశాలు జరిపింది. ఆనాటికి, అమెరికా "కొలంబస్ దినోత్సవం" జరుపుకుంటున్నది. కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలిపే దినోత్సవమే కొలంబస్ డే.
కాని ఆయన డిస్కవరీ వల్ల అంతకంటే ముందు అమెరికాలో నివసిస్తున్న స్థానిక రెడ్ ఇండియన్లు, అసే మొ||న ఆదివాసీ తెగలు బ్రిటీషు వలసవాదుల దోపిడీకి గురయి తమ సర్వస్వాన్ని కోల్పోయాయి.
వారు కనుమరుగైతే జీవ వైవిధ్యం కనుమరుగై మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది కాబట్టి ఆయా తెగలను రక్షించుకోవలసిన అవసరం అవశ్యంగా ఉందని గుర్తించి అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు 1990 నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
1994 నుంచి ఆగస్ట్ 9 న ప్రపంచంలోని చాలా దేశాలు ఐక్యరాజ్య సమితి నిర్ణయం మేరకు ఆదివాసీ దినోత్సవాలను జరుపుకుంటున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఉత్సవాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఈనాటి గ్రామ, పట్టణ, నగర ప్రజల జీవన సంస్కృతులకు మూలాలు గిరిజనుల జీవన సంస్కృతులలోనే మిగిలి ఉన్నాయి.
కాబట్టి వాటిని తెలుసుకోవడానికి మరియు ఆయా జీవన సంస్కృతుల రూపకల్పనకు గిరిజనులు ఎలా కృషి చేశారో తెలుసుకోవడానికి ఆదివాసీ దినోత్సవాలు జరుపుకోవాలి.
తద్వారా ఆదివాసుల కృషి పట్ల, మనందరి మూలాలను రక్షిస్తున్న ఆదివాసుల పట్ల మనందరికి గౌరవం పెరుగుతుంది. లేదంటే ఆదివాసులు నివసించే అడవులను నరికివేస్తూ పోతాం.
వారి వర్జిన్ ప్రాంతాల్లోని వనరులను కొల్లగొడుతూ పోతాం. పొల్యూషన్ పెంచుతూ పోతాం. తద్వారా ఆదివాసులకే కాదు, మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆదివాసీ దినోత్సవాల ద్వారా అలాంటి ప్రమాదాలను ముందే గుర్తించి ఆదివాసులను, ఆదివాసుల నివాస ప్రాంతాలను (అడవులను), వాటిలోని వనరులను రక్షించుకోవాలనే బాధ్యత తెలిసి వస్తుంది.
ఇలాంటి నేపథ్యంలో నుంచే కొన్ని ఆదివాసీ సంరక్షక, అభివృద్ధి చట్టాలు, పథకాలు పుట్టాయి. స్వదేశీ దర్శన్, పీఎం జన్మన్, ధర్తి ఆబ జన్ జాతి గ్రామీణ ఉత్కర్ష అభియాన్, ఆది కర్మయోగి, సీసీడీపీ (కన్జర్వేషన్ కమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) మొ॥వి అలాంటి పథకాల్లో కొన్ని.
అందరి సంక్షేమం కాకుండా తమ సంక్షేమం, అభివృద్ధి మాత్రమే ముఖ్యం అనుకున్నవాళ్ళు కొందరు ఆయా చారిత్రక కాలాలలో ఆదివాసుల భూములను కాజేయడం, వనరులను కొల్లగొట్టడం, అసలు అడవులపై వారికి హక్కు కూడా లేదంటూ కొత్తగా భరించలేని పన్నులు విధించి వసూలు చేయడం వంటి అమానవీయ పనులకు పాల్పడ్డారు.
వాటిని భరించలేక రాంజీ గోండ్, కుమ్రం భీమ్ వంటి గోండ్ ఆదివాసి వీరుల నేతృత్వంలో వందలాది మంది ఆదివాసులు తిరగబడ్డారు. మావె నాటే మావె రాజ్ (మా ప్రాంతంలో మాదే రాజ్యం), జల్- జంగిల్- జమీన్ వంటి నినాదాలను తెర మీదికి తెచ్చారు.
ఆనాటి రాజులు, అధికారులు వారిని అణిచివేశారు, చంపివేశారు. చంపబడుతామని తెలిసి పోరాటాలు చేశారు, చేస్తున్నారు అంటే వారికి బలవంతుల వల్ల ఎదురవుతున్న కష్టాల కంటే చావు కష్టతరమైనది కాదనే చేదు వాస్తవం స్పష్టమవుతుంది. కాబట్టి అలాంటి అరాచకాలను ఇకనైనా మానుకోవాలనే విషయాన్ని ఆదివాసీ దినోత్సవాలు స్పష్టం చేస్తాయి.
ఆదివాసులందరూ అన్ని పనులనూ తమకు తామే చేసుకుంటారు. పనులు అయిపోయిన తరువాత అందరూ గాన నృత్యాలతో మనోరంజనం పొందుతారు. ఆదివాసులందరూ తమ తమ ప్రత్యేక నృత్యాలలో ఆరితేరినవారే.
అదే గ్రామీణులు, పట్టణ, నగర ప్రజలందరికీ తమ తమ ప్రత్యేక నృత్యరీతులు లేవు, నృత్యాలు చేయడం రాదు. ఆదివాసులకు ఆస్తులు తక్కువ ఉన్నా దొరికింది తిని, ఆడిపాడి ఆనందిస్తారు కాబట్టి వారి ఆరోగ్య జీవన ప్రమాణాలు గ్రామీణులు, పట్టణీకుల కంటే ఎక్కువ.
నగరీకులే ఈ మధ్య తమ జీవన, సంస్కృతులను ఆదివాసులకు పరిచయం చేసి వారి సంతులిత జీవన విధానాలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి నిజాలూ ఆదివాసీ దినోత్సవాల ద్వారా తెలిసి వస్తాయి.
ఆదివాసీలు భక్తిశ్రద్ధలకు, పవిత్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. తమ తమ దేవీదేవతలుండే గుహలకు, పవిత్ర జల సేకరణకు చెప్పులు లేకుండా మైళ్ళుకొద్ది నడుస్తారు. దేవీదేవతల దర్శన మాత్రాన అలౌకికానందానికి గురవుతారు. దేవీదేవతలను ఆవాహన చేసుకొని దైవవాణి వినిపిస్తారు.
ఏ పంటనైనా దేవీదేవతలకు నైవేద్యంగా పెట్టకుండా తాము తినరు. గోత్రాల పేరుతో తమ మధ్య సరైనవావి వరుసలతో సమన్వయాన్ని సాధించడమే కాకుండా జీవ జంతుజాలాన్ని కూడా రక్షిస్తారు. దేవీదేవతల పట్ల అందరికీ విశ్వాసముంటుంది కాని ఆదివాసుల లాగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్పృహ ఉండదు. ఇందుకోసమైనా ఆదివాసీ దినోత్సవాలు జరుపుకోవాలి.
Tags:    

Similar News