‘సింధు నీటిని మళ్లించే ఏ నిర్మాణాన్నయినా ధ్వంసం చేస్తాం’
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్..;
పహల్గామ్(Pahalgam) ఘటన తర్వాత భారత్ - పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇరుదేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏప్రిల్ 22న ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడంతో.. పాకిస్థాన్ పట్ల భారత్ కఠిన వైఖరి అవలంభించింది. అందులో భాగంగానే పాక్ జాతీయులను దేశం వీడాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. భారత్ - ఇండస్ జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్(Khawaja Asif ) చేసిన వ్యాఖ్యలు భారత్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇండస్ జలాలను మళ్లించేందుకు భారత్‌లో చేపట్టే ఎలాంటి నిర్మాణాన్నయితే కూల్చేస్తామని ఇస్లామాబాద్ పరోక్షంగా హెచ్చరించారు. వాస్తవానికి భారత్ పాక్‌ల మధ్య ఇండస్ జలాల ఒప్పందం 1960లో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌లోని వ్యవసాయ భూములకు 80 శాతం నీటి భారత్ నుంచి వెళ్తుంది.
ఇండస్ జలాల ఒప్పందం (Indus Waters Treaty – 1960) ..
ఇండస్ జలాల ఒప్పందం 1960 సెప్టెంబరు 19న నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ ఖాన్ సంతకం చేసిన ఒక ద్వైపాక్షిక ఒప్పందం. ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎమ్‌ఏఎఫ్)గా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 ఎమ్‌ఏఎఫ్‌గా ఉంది.