అరుణాచల్ ప్రదేశ్ పై అమెరికా మాట: ఏమన్నారంటే..
అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికే భారత్ దే అని అమెరికా ప్రకటించింది. ఇక్కడ చైనా చేసే పనులన్నీ దురాక్రమణ కిందకే వస్తాయని అంది.
By : The Federal
Update: 2024-03-21 05:08 GMT
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కొంతకాలంగా తమ ప్రాదేశిక భూభాగమంటూ వితండవాదం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని భారత్ ఖండిస్తూ వస్తోంది. తాజాగా మనదేశ వాదనకు బలం చేకూరుస్తూ అగ్రరాజ్యం అమెరికా ఇదే మాటను నొక్కి చెప్పింది. ‘అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత్ దే. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఏసీ) చైనా తన ప్రాదేశిక క్లెయిమ్‌గా చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ’అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్ర పర్యటన తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా సైన్య అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘ అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంటూ’ అసంబద్ద వాదనలకు దిగాడు.
US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ బుధవారం (మార్చి 20) తన రోజువారీ విలేకరుల సమావేశంలో , “అరుణాచల్ ప్రదేశ్‌ను భారతదేశ భూభాగంగా యునైటెడ్ స్టేట్స్ గుర్తిస్తుంది. చొరబాట్లు లేదా ఆక్రమణల ద్వారా చైనా చేసే ఏకపక్ష ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని కోసం సైన్యం ద్వారా కానీ, పౌరులను ఉపయోగించి కానీ చైనా చేసే క్లెయిమ్ లను దురాక్రమణగానే చూస్తాం" అని ప్రకటించారు.
చైనా వాదన
ఈ వారం ప్రారంభంలో, చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ, టిబెట్ దక్షిణ భాగంలో అరుణాచల్ ప్రదేశ్ ఒక భాగమని చెప్పారు. చట్టవిరుద్దంగా అక్కడ జరిగే అభివృద్ధి పనులకు మా ఆమోదం ఎన్నటికీ లభించదంటూ నోరు పారేసుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న చైనా, తమ వాదనలను ఎత్తిచూపేందుకు ఆ రాష్ట్రానికి భారత నేతల పర్యటనలపై నిత్యం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీజింగ్ ఈ ప్రాంతానికి ఓ కొత్త పేరు కూడా పెట్టింది.
ఖండించిన భారత విదేశాంగ శాఖ
చైనా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత భూభాగమేనని ప్రకటించింది. అప్పుడు, ఇప్పుడు ఎల్లప్పుడు అది భారత దేశంతో విడదీయరాని భాగమని నొక్కి చెప్పింది. కొత్త పేర్లు పెట్టి వాస్తవితకను మార్చలేరని కూడా చైనాకు గడ్డి పెట్టింది.
మార్చి 9న, ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్‌లో 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్‌ను జాతికి అంకితం చేశారు, ఇది వ్యూహాత్మకంగా ఉన్న తవాంగ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందిస్తుంది అలాగే సరిహద్దు ప్రాంతంలో సైనికుల మెరుగైన కదలికను ఉపయోగపడుతుంది.