‘‘రష్యా ఆయిల్ వల్ల బ్రాహ్మణులు లాభపడుతున్నారు’’
పిచ్చి వాదన చేసిన అమెరికా వాణిజ్య సలహదారు పీటర్ నవారో;
By : The Federal
Update: 2025-09-01 05:18 GMT
భారత్- రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై అమెరికా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. వైట్ హౌజ్ వాణిజ్య సలహదారు పీటర్ నవారో ఇందులో భాగంగా మరో వింత అయిన వాదన వినిపించారు.
భారత్, రష్యన్ చమురును లాండరింగ్ చేస్తోందని ఆరోపించారు. దేశంలోని బ్రాహ్మణ వర్గాలు రష్య ఆయిల్ నుంచి లాభపడుతున్నారని, ఇందుకోసం దేశంలోని సాధారణ పౌరుల ఖర్చును ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. భారతీయ వస్తువులపై ట్రంప్ర విధించిన 50 శాతం సుంకాలను ఆయన సమర్థించారు. న్యూఢిల్లీ, మాస్కో వాణిజ్యం చేయడం వల్లే ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.
ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పుతిన్, జిన్ పింగ్ తో మోదీకి పెరుగుతున్న సాన్నిహిత్యం వల్ల ప్రపంచం క్రమంగా అస్థిరతవైపు ప్రయాణిస్తోందని హెచ్చరించారు.
బ్రాహ్మణుల ప్రయోజనం..
ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశం భారత్ అని, భారత్ ను సుంకాల మహారాజుగా అభివర్ణించారు. భారత్ ఎగుమతి చేసే శుద్ది చేసిన రష్యన్ చమురు ఉక్రెయిన్ లో రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని ఆయన ఆరోపించారు.
‘‘వారు(భారత్) మనకు చాలా వస్తువులు ఎగుమతి చేస్తారు. మనం ఎందుకు గాయపడాలి? అమెరికాలోని కార్మికులు, పన్ను చెల్లింపుదారులు, ఉక్రెనియన్లు నష్టపోతున్నారు. మోదీ గొప్ప నాయకుడు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ పుతిన్, జిన్ పింగ్ తో కలిసి ఎందుకు నడుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని ఆయన పదునైన విమర్శలు చేయడానికి ప్రయత్నించారు.
భారతీయులకు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాని చెప్పారు. ‘‘భారత ప్రజలను పణంగా పెట్టి బ్రాహ్మణులు లాభార్జన చేస్తున్నారు. మేము దానిని ఆపాలని కోరుకుంటున్నాము’’ అని ఆయన వింతైన వాదన చేశారు.
మోదీ పర్యటన..
గల్వాన్ ఘర్షణ తరువాత ప్రధాని మోదీ చైనాలో తొలిసారిగా పర్యటించారు. తియాంజిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యారు. ఇక్కడ పుతిన్, జిన్ పింగ్ లతో ఆయన సమావేశం అయ్యారు.
భారత దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాల వెనక కీలక వ్యక్తి పీటర్ నవారో. గతంలోనూ ఆయన రష్యాతో న్యూఢిల్లీ ఇంధన వాణిజ్యాన్ని విమర్శించారు. ఉక్రెయిన్ లో రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధంగా అభివర్ణించారు. రష్యాతో భారత్ చేస్తున్న చమురు వ్యాపారం ద్వారా నేరుగా యుద్ధంలోకి నిధులు పంప్ చేస్తోందని ఆరోపించారు.
భారత్ రోజుకు 1 మిలియన్ బ్యారెళ్లకు పైగా శుద్ది చేసిన పెట్రోలియం ఎగుమతి చేస్తోంది. ఇది రష్యా దిగుమతి చేసుకునే మడిచమురులో సగం ఉంటుంది. ఈ ఆదాయం భారత ఇంధన దిగ్గజాల నుంచి నేరుగా పుతిన్ చేస్తున్న యుద్ధంలోకి ప్రవహిస్తోందని ఆయన ఎక్స్ లో విమర్శలు చేశారు.
పాశ్చాత్య కపట నాటకాలు..
అమెరికా ఆరోపణలపై అప్పట్లోనే భారత్ దీటుగా స్పందించింది. రష్యా నుంచి చైనా అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని గణాంకాలతో సహ వెల్లడించింది. కానీ చైనాను కాదని భారత్ పై సుంకాలు ఏ ప్రాతిపదికన వేస్తున్నారని ప్రశ్నించింది.
ఇదే కాకుండా తుర్కియే కూడా భారత్ కు సమాన స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుందని వెల్లడించింది. ఇవే కాకుండా రష్యాతో అమెరికా వాణిజ్యం భారీ స్థాయిలో జరుగుతోందని, కీలకమైన ఆయుధాలకు సంబంధించిన రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం ను దిగుమతి చేసుకుంటోందని వెల్లడించింది. ఈయూ ఇప్పటికి రష్యా నుంచి పెద్ద మొత్తంలో గ్యాస్ దిగుమతి చేసుకుంటుందని ఎదురుదాడికి దిగింది.
కొంతమంది నిఫుణుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి వాషింగ్టన్ ఇలా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. వాషింగ్టన్ వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోకి ప్రవేశిస్తే ఇక్కడ చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో భారత్ ససేమిరా అంటోంది.
అలాగే రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలని కూడా ట్రంప్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ అమెరికా, భారత్ కు నమ్మదగ్గ మిత్రుడు కాకపోవడం, భారత్ దిగమతి చేసుకున్న ఆయుధాల్లో 70 శాతం రష్యావే అవడంతో భారత్ కూడా ఈ ప్రతిపాదలనకు తలొగ్గడం లేదు.