విచారించను, నిరాశ చెందను.. మరోసారి దాడులు చేస్తాను: మసూద్ అజార్
ఏ మాత్రం మారని జైషే మహ్మద్ ఉగ్రవాద నాయకుడు;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-08 06:13 GMT
చింతచచ్చినా.. పులుపు చావదని ఓ తెలుగు సామెత. అలాగే ఉంది ఉగ్రవాద నాయకుడు జైష్ ఏ మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ తీరు. మొన్న జరిగిన ఆపరేషన్ సిందూర్ లో తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న తరువాత ఇప్పుడు బీరాలు పలుకుతున్నాడు.
ఈ దాడుల్లో అతని ఉగ్రవాద శిక్షణ కేంద్రం, అందులో ఉన్న 14 మంది తన సొంత కుటుంబ సభ్యులు మరణించారు. మరో నలుగురు అతని సన్నిహితులు సైతం మృత్యు కౌగిలిలో చిక్కుకున్నారు.
జైష్ ఏ మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్న బహావల్పూర్ లోని జామియా మసీద్ సుభాన్ అల్లాలపై భారత వైమానికదళం మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో మసూద్ అజార్ అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, అతని కుటుంబంలోని ఐదుగురు పిల్లలు ఉన్నారని అజార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గ్లోబర్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన అజార్, 1994 లో భారత్ లో అరెస్ట్ అయ్యాడు. అయితే పాక్ కు చెందిన ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా ఐసీ 814 హైజాక్ తరువాత విడుదల అయ్యాడు.
మా సంతోషం పోయింది..
‘‘ఈ రాత్రి మా కుటుంబంలోని పదిమంది కలిసి ఆనందాన్ని పొందారు. ఐదుగురు అమాయక పిల్లలు, నా అక్క, ఆమె గౌరవనీయమైన భర్త, నా ఫాజిల్ భంజే(మేనల్లుడు), అతని భార్య, నా ప్రియమైన ఫాజిలా(మేనకోడలు) నా ప్రియమైన సోదరుడు హుజైఫా, అతని తల్లి, మరో ఇద్దరు ప్రియమైన సహచరులు అల్లాను చేరుకున్నారు.’’ అజార్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
ఈ క్రూరమైన చర్య అన్ని హద్దులను ఉల్లంఘించిందని, ఇప్పుడు మా నుంచి ఎలాంటి దయ ఆశించకూడదని పేర్కొన్నాడు.
పాకిస్తాన్ లో అంతర్జాతీయ ఉగ్రవాది..
ఏప్రిల్ 2019 నుంచి ఈ అంతర్జాతీయ ఉగ్రవాది పాకిస్తాన్ లో బహిరంగంగా కనిపించడం లేదు. అజ్ఞాత వ్యక్తులు పాక్ లో ఉన్న భారత వ్యతిరేక తీవ్రవాదులను ఒక్కొక్కరిని కాల్చి చంపడంతో భయపడిన అతడు సైన్యం సహకారంతో సురక్షిత ప్రాంతంలో దాక్కుకున్నాడు.
అయితే కుటుంబ సభ్యులు మరణించడంతో అతను బహిరంగ ప్రార్థనలకు ప్రజలను ఆహ్వనిస్తూ కనిపించాడు. అతను అంత నిర్భయంగా పాక్ లో కనిపిస్తున్నప్పిటికి మా దేశంలో లేడని ఇస్లామాబాద్ ఇంకా బుకాయిస్తునే ఉంది.
అజార్ చరిత్ర..
56 ఏళ్ల మసూద్ అజార్ భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల కుట్రలో పాల్గొన్నాడు. వాటిలో ముఖ్యమైనది పార్లమెంట్ పై(2001) దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్ కోట్చ 2019 పుల్వామా దాడి వంటివి ఉన్నాయి.
1990లో కాశ్మీర్ లో జరిగిన ఊచకోతలో అతని ప్రమేయం ఉంది. తరువాత ఈ ఉగ్రవాదిని భారత దళాలు అరెస్ట్ చేశాయి. 1999 లో హైజాక్ చేయబడిన ఐసీ -814 ప్రయాణీకులకు బదులుగా అజార్ ను విడుదల చేసిన తరువాత బహవల్ పూర్ కేంద్రంగా జేఏం ను స్థాపించాడు. ఇక్కడే ఉగ్రవాదులకు బ్రేయిన్ వాష్ చేసి ఉగ్రవాద శిక్షణ ఇచ్చి భారత్ లో చొరబడేలా ఏర్పాట్లు గావిస్తున్నాడు.
2019 మే లో జైషే మహ్మద్ చీఫ్ ను బ్లాక్ లిస్ట్ చేయాలనే ప్రతిపాదనపై చైనా అడ్డుతొలగిన తరువాత ఐరాస అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఈ అంశంపై న్యూఢిల్లీ మొదటిసారిగా ప్రపంచ సంస్థను సంప్రదించిన ఒక దశాబ్ధం తరువాత చైనా తన మొండి పట్టును వీడింది.
ఆపరేషన్ సిందూర్..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న భారత్, పాక్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాలలో 24 మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు మరణించారని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాము అత్యంత జాగ్రత్తగా ఎంత అవసరమో అంతే మొత్తంలో పేలుడు పదార్థాలను ఉపయోగించామని సైన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
భారత ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపిన ప్రకారం.. ఉగ్రవాద గ్రూపులు తరుచుగా జనసాంద్రత కలిగిన పౌర ప్రాంతాలలో తమ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజల ప్రాణానికి నష్టం కలగకుండా దాడులు చేయాల్సి ఉంటుందని దీనికోసం భారత త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి.
అయితే ఈ దాడులపై పాక్ స్పందించలేదు. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని ఆరోపించింది. తాము కూడా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని కూడా బీరాలు పలికింది.
ఆ దాడిలో 26 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారని పాక్ సైన్యం తెలిపింది. బహవల్పూర్ లో గాయపడిన వారందరిని విక్టోరియా ఆసుపత్రికి తరలించి, అత్యుత్తమ చికిత్స అందించామని పంజాబ్ సమాచార మంత్రి అజ్మా బోఖారి తెలిపారు.