భారత్ వంద శాతం సుంకాలు తొలగించడానికి సిద్ధంగా ఉంది: ట్రంప్

చర్చలు ఇంకా పూర్తికాలేదని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-17 06:11 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా నుంచి భారత్ లోకి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై టారిఫ్ లు ఎత్తివేయడానికి న్యూఢిల్లీ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇది అమెరికా సాధించిన గొప్ప దౌత్య విజయంగా చిత్రించారు.

‘‘ మీకు ఇది తెలుసా.. వారు(భారత్) మనదేశంలోని వస్తువులపై 100 శాతం సుంకాలను ఎత్తివేయడానికి సిద్దంగా ఉన్నారు. వారు ఇక్కడ వ్యాపారం చేయడం అసాధ్యమని అనుకున్నారు’’ అని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు.
భారత్ తో వ్యాపార డీల్ సాధించడానికి తనకు ఎలాంటి తొందరపాటు లేదనే సంకేతాన్ని ఇచ్చారు. ‘‘అది తొందరలోనే పూర్తవుతుంది. ప్రస్తుతానికి ఏమి తొందరలేదు. ప్రతి ఒక్కరూ మాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్దంగా ఉన్నారు’’ అని ట్రంప్ అన్నారు.
తుది దశకు చేరకోలేదు: భారత్
అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. అయితే అవి ఫలప్రదంగా సాగుతున్నాయా అనే విషయంలో ఆయన కటువైన సమాధానమే ఇచ్చారు. ‘‘వారు(యూఎస్) చర్చలను సంక్షిష్టంగా మారుస్తున్నారు, ప్రస్తుతం చర్చలు ఫలితానికి దూరంగా ఉన్నాయి’’ అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.
‘‘భారత్, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవి చాలా కష్టమైన చర్చలు. ఇంకా తుది ఫలితం రాలేదు. వ్యాపార ఒప్పందం అనేది రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చాలి. ఈ ఒప్పందం రెండు దేశాలకు పనిచేయాలి. అప్పటివరకూ అది పూర్తి కానట్టే. ఇప్పుడే దాని గురించి చెబితే అది అసంపూర్ణమే’’ అని విదేశాంగమంత్రి అన్నారు.
వ్యూహాత్మక ఎత్తు వేసిన ట్రంప్..
భారత్ తో వాణిజ్య చర్చలు పూర్తికాకముందే ట్రంప్ ఈ విధంగా ప్రకటించడం వెనక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కొంతకాలంగా వాణిజ్యాన్ని జియో పొలిటికల్ టూల్ గా ఉపయోగిస్తున్నాడని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తాను, తన ప్రభుత్వం వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించామని చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు.
ట్రంప్ గతంలో కూడా అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న అధిక సుంకాలను ప్రస్తావించాడు. అలాగే పాకిస్తాన్ కు ఇస్తున్న వాణిజ్య ప్రొత్సహాకాలను కూడా బయటపెట్టాడు. ‘‘నేను వాణిజ్యాన్ని శాంతి స్థాపనకు మార్గంగా ఉపయోగిస్తున్నాను’’ అని ట్రంప్ టముకు వేసుకుంటున్నాడు. తన సొంత సోషల్ మీడియా అయిన ‘ద ట్రూత్’ లో ఇద్దరి మధ్య పోరు ఆపడానికి, శాంతి చర్చల కోసం వాణిజ్యాన్ని ఉపయోగించుకున్నాని ట్వీట్లు చేశాడు.
చైనాతో జరుపుతున్న వాణిజ్య చర్చలు ఆయన ఆర్థిక దౌత్యం విషయంలో మొత్తం ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ చర్యల వల్లే చైనా తన వస్తువులపై 125 శాతం నుంచి పది శాతం సుంకాలు విధించడానికి సిద్ధమైంది.
దానికి బదులుగా చైనా వస్తువులపై అమెరికా 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది. ‘‘నేను గనక చైనాతో ఆ ఒప్పందం చేసుకోకపోయి ఉండే, ఆ దేశం పతనమై ఉండేది’’ అని ట్రంప్ అన్నారు.
అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్
అంతర్జాతీయంగా పేరు పొందిన ఆర్థిక ఏజెన్సీ సంస్థ మూడీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్ ను తాజాగా తగ్గించింది. తన రేటింగ్ లో అమెరికా స్థాయిని ట్రిపుల్ ఏ నుంచి డబల్ ఏ1 కి తగ్గించింది. ద్రవ్యలోటు పెరగడం, దేశంపు అప్పులు ఇంకా పెరగడం, అధిక వడ్డీ రేట్లు, రాజకీయ వ్యవస్థ ఇంకా క్రియాశీలకంగా వ్యవహరించపోవడంతో రేటింగ్ ను తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
రేటింగ్ తగ్గడం వల్ల అప్పుల పై చేసే వ్యయం పెరుగుతుందని, ఫైనాన్షియల్ మార్కెట్ లో స్థిరత్వం తగ్గడానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పై ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పెట్టుకున్న నమ్మకం క్షీణిస్తుందని వారు చెబుతున్నారు.
Tags:    

Similar News