ఖలిస్తాన్ అనుకూల నిరసనలో పాల్గొన్న పోలీస్ సస్పెండ్
కెనడాలోని హిందూ ఆలయంపై దాడి చేయడానికంటే ముందు నిరసన ప్రదర్శనలో స్థానిక సిక్కు యువతతో పాటు, ప్రభుత్వ అధికారి..
By : The Federal
Update: 2024-11-05 06:44 GMT
కెనడాలోని బ్రాంప్టన్ లో గల హిందూ ఆలయం వెలుపల ఖలిస్థాన్ అనుకూల నిరసనలో పాల్గొన్నందుకు కెనడియన్ పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్లు మీడియా కథనం తెలిపింది.
ఆదివారం హిందూ దేవాలయం వద్ద ఖలిస్తానీ జెండాలను పట్టుకున్న నిరసనకారులు ప్రజలతో ఘర్షణ పడ్డారు. ఆలయ అధికారులు, భారత కాన్సులేట్‌తో కలిసి నిర్వహించిన కాన్సులర్ కార్యక్రమానికి అంతరాయం కలిగించారు. నిరసనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పీల్ పోలీసులు కూడా పలు వీడియోలను పరీశీలిస్తున్నారు. ఈ నిరసనలో పాల్గొన్న ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తరువాత అధికారులు వెల్లడించారు. "కమ్యూనిటీ సేఫ్టీ అండ్ పోలీసింగ్ యాక్ట్ ప్రకారం ఈ అధికారి సస్పెండ్ చేయబడ్డారు" అని వారు చెప్పారు. "మేము వీడియోలో చిత్రీకరించబడిన మొత్తం పరిస్థితులను పరిశీలిస్తున్నాము. ఈ విచారణ పూర్తయ్యే వరకు తదుపరి సమాచారాన్ని అందించలేము."
సస్పెండ్ అయిన పోలీస్ అధికారి హరీందర్ సోహిగా గుర్తించారు. ఇతను ఇండో కెనడియన్. CBC న్యూస్ నివేదిక ప్రకారం, అతను ప్రదర్శనలో ఖలిస్తాన్ జెండాను పట్టుకుని కెమెరాకి చిక్కాడు. సస్పెండ్ అయిన తర్వాత హరీందర్ సోహీకి సోషల్ మీడియాలో హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పీల్ ప్రాంతీయ పోలీసు సంఘం అతనికి సాయం రక్షణను అందించింది.
ముగ్గురిపై అభియోగాలు
భారత కాన్సులర్ అధికారులు హిందూ ఆలయాన్నిసందర్శించారు. ఈ సందర్భంగా దాడి జరిగింది. ఈ హింస పై ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసినట్లు పీల్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు, ఖలిస్తాన్‌కు మద్దతుగా బ్యానర్‌లు పట్టుకున్న ప్రదర్శనకారులను చూపిస్తున్నాయని CBC నివేదిక పేర్కొంది.
కెనడాలోని వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ ప్రకారం, , ప్రదర్శనకారులు పొరుగున ఉన్న మిస్సిసాగాలోని వెస్ట్‌వుడ్ మాల్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత, మిస్సిసాగాలోని ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని సిక్కు ప్రార్థనా స్థలం మాల్టన్ గురుద్వారా వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు.
"ఈ ప్రదర్శనలు మూడు వేర్వేరు ప్రదేశాలలో జరిగినప్పటికీ, అవి ఒకదానికొకటి సంబంధించినవిగా కనిపిస్తున్నాయి. నిరసనకారులు హిందూ భక్తుల మధ్య అనేక సంఘటనలు చెలరేగాయి" అని పోలీసులు ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం, పీల్ పోలీసులు మాట్లాడుతూ, ప్రజా శాంతి భద్రతలను కాపాడేందుకు హిందూ సభ మందిర్ ఆలయం వద్ద తమ సంఖ్యను పెంచినట్లు తెలిపారు.
ఆలయంపై దాడిని భారత్ ఖండించింది
ఈ దాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది పిరికిపంద చర్యగా ప్రధాని మోదీ అభివర్ణించారు. హింసకు పాల్పడిన వారిపై విచారణ జరగాలని విదేశాంగ శాఖ కెనడాను కోరింది. కెనడాలోని భారతీయ పౌరుల భద్రత గురించి న్యూఢిల్లీ "తీవ్ర ఆందోళన"గా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
"అంటారియోలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలో తీవ్రవాదులు, వేర్పాటువాదులు జరిపిన హింసాత్మక చర్యలను మేము ఖండిస్తున్నాము. అటువంటి దాడుల నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను రక్షించాలని మేము కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము" అని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కోరారు.