మైనారిటీలో పడిన ట్రూడో సర్కార్.. మద్ధతు ఉపసంహరించిన సిక్కు పార్టీ
కెనడా ప్రధాని ఆధ్వర్యంలో నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఆయనకు మద్ధతు ఇస్తున్న ఎన్డీపీ తన మద్ధతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
By : The Federal
Update: 2024-09-05 06:29 GMT
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలో నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇన్నాళ్లు ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ( ఎన్డీపీ) మద్ధతు ఉప సంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ హఠాత్ పరిణామంతో ఆయన చిక్కుల్లో పడ్డారని అంతర్జాతీయా వార్తా సంస్థలు తెలిపాయి.
NDP నాయకుడు జగ్మీత్ సింగ్ ప్రకటించిన ఈ చర్య, ట్రూడో పదవికి తక్షణం ప్రమాదం కలిగించదు కానీ బడ్జెట్ ఆమోదం లో తీవ్ర ఇబ్బందులు తప్పవు. విశ్వాస పరీక్ష ను ఎదుర్కొనేందుకు హౌస్ ఆఫ్ కామన్స్‌లోని ఇతర ప్రతిపక్ష సభ్యుల మద్దతును పొందవలసి ఉంటుంది.
ఒక వీడియో సందేశంలో జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ.. తమకు, ట్రూడో పార్టీకి మధ్య 2022లో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ట్రూడో ప్రతిపక్ష కన్జర్వేటివ్ లను సమర్థవంతంగా నియంత్రించడంలో విఫలం అయ్యాడని సింగ్ తన వీడియో సందేశంలో ఆరోపించాడు. లిబరల్ ప్రభుత్వం నుంచి మద్దతును ఉపసంహరించుకోవాలనే NDP నిర్ణయాన్ని సమర్థించాడు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంభావ్య "కన్సర్వేటివ్ కోతలకు" వ్యతిరేకంగా "మున్ముందు ఇంకా పెద్ద రాజకీయ యుద్ధం" ఉందని హింట్ ఇచ్చాడు.
"కార్మికులు, పదవీ విరమణ పొందిన వారు, యువకులు, రోగులు, కుటుంబాల నుంచి పన్నులు వసూలు చేసి [కన్సర్వేటివ్ నాయకుడు పియరీ పోయిలీవ్రే] పెద్ద పెద్ద సంస్థలకు, సంపన్న CEO లకు మరింత సంపద ఇవ్వడానికి పూనుకుంటున్నారు" అని సింగ్ పేర్కొన్నారు.
"వాస్తవమేమిటంటే, ఉదారవాదులు చాలా బలహీనులు, చాలా స్వార్థపరులు, ప్రజల కోసం పోరాడటానికి కార్పొరేట్ ప్రయోజనాలకు చాలా కట్టుబడి ఉన్నారు. వారు మారలేరు, వారు ఆశను పునరుద్ధరించలేరు, వారు కన్జర్వేటివ్‌లను ఆపలేరు. కానీ మనం చేయగలం " సింగ్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం మైనారిటీలో పడిన ఎటువంటి ఇబ్బందిలేదని ప్రధాని ట్రూడో అన్నారు. పాలన యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. మేము కెనడియన్ల కోసం సమర్థవంతంగా పనిచేస్తున్నాం.. పని చేయబోతున్నాం.. అని ట్రూడో వ్యాఖ్యానించారు.
"రాజకీయాలపై దృష్టి సారించడం కంటే, గత సంవత్సరాల్లో మేము కెనడియన్లకు ఎలా మెరుగైన పాలన అందించగలము అనే దానిపై NDP దృష్టి కేంద్రీకరిస్తుందని నేను నిజంగా ఆశిస్తున్నాను." ట్రూడో చెప్పారు.
జస్టిన్ ట్రూడో, నవంబర్ 2015లో మొదటిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు, అయితే గత రెండు సంవత్సరాలుగా ప్రతిపక్ష సెంటర్-రైట్ వింగ్ కన్జర్వేటివ్‌ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాలనలో విఫలం అయ్యారని, అలాగే ద్రవ్యోల్భణం విషయంలో కూడా వెనకబడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
కాగా జగ్మత్ సింగ్ ఆధ్వర్యంలో న్యూ డెమెక్రాటిక్ పార్టీ ఖలిస్థాన్ వేర్పాటువాదానికి అండదండలు అందిస్తోంది. బహిరంగంగా దాడులను ప్రొత్సహిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. జస్టిన్ ట్రూడో భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం వెనక ఆయనకు మద్ధతు తెలుపుతున్న ఎన్డీపీ ఉందని నిపుణులు భావిస్తున్నారు.