బంగ్లాదేశ్‌లో నిరసనలకు అసలు కారణమేంటి?

ప్రధాని షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ను ఎందుకు వీడారు? హింసకాండకు కారణమేంటి? ఆందోళనకారులు షేక్ హాసీనాను ఎందుకు టార్గెట్ చేశారు? అల్లర్ల వెనక అసలు కథేంటి?

Update: 2024-08-06 09:09 GMT

బంగ్లాదేశ్‌లో రాజకీయ భూకంపం..ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను దేశం వీడేలా చేసింది. గత 15 సంవత్సరాలుగా దేశాన్ని ఉక్కు పిడికిలితో పాలించిన హసీనా..దేశంలో నియంత్రించలేని ఆందోళనలతో చివరకు బంగ్లాను వీడి భారత్ కు చేరుకున్నారు.

30 శాతం కోటా అమలు చేసిన హసీనా తండ్రి..

పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు 1971 లిబరేషన్ వార్‌లో పాల్గొన్న సైనికుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% కోటా కల్పించాలని 1972లో హసీనా తండ్రి, ప్రధానమంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసింది. అయితే 2018 అక్టోబర్‌లో విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. షేక్ హసీనా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే ఈ కోటాను పునరుద్ధరించాలని 2024 జూన్‌లో హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజా విచారణ అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 5 శాతం, మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

అయినా తగ్గని అల్లర్లు..

సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో నిరసనలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఆందోళనకారులు రిజర్వేషన్ల అంశం పక్కనపెట్టి, షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. ఏడు నెలల క్రితం వరుసగా నాల్గవసారి అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..సామూహిక నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

'సహకార నిరాకరణ' ఉద్యమం..

తమ డిమాండ్ల కోసం ఆదివారం (ఆగస్టు 4) నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకూడదని నిర్ణయించుకున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు.

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్దదెబ్బ..

విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్న హసీనా ప్రభుత్వానికి నిరుద్యోగులు, విద్యార్థుల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 10 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లిందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మార్గదర్శకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని ఒక నిపుణుడు పేర్కొన్నారు.

ప్రభుత్వ స్పందనేంటి?

నిరసనలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిరసనకారులను హసీనా రజాకార్లుగా అభివర్ణించారు. ఇది 1971లో స్వాతంత్ర్య పోరాటంలో పాకిస్థాన్ సైన్యం పక్షాన నిలిచిన వారిని సూచిస్తుంది. ఆ తర్వాత హసీనా వెనక్కు తగ్గారు. నిరసనకారులు ఉగ్రవాదులు కాదంటూనే.. విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఆఫర్‌ను విద్యార్థి సంఘాల నాయకులు తిరస్కరించారు. ఇది తమను బుజ్జగించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.

Tags:    

Similar News