Bangladesh: మహిళా జర్నలిస్టు నిర్బంధం

పదవీచ్యుతురాలయిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారురాలు అని ఢాకాలో ఓ మహిళా జర్నలిస్ట్‌ కొంతమంది నిర్భందించారు.

Update: 2024-12-01 14:05 GMT

బంగ్లాదేశ్‌లో రోజురోజుకు ఉద్రిక పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఇస్కాన్ ప్రచారకుడు చిన్మయ్ కృష్ణదాసును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢాకాలో జరిగిన ర్యాలీలో ఆ దేశ జాతీయ జెండాను అగౌరవ పరిచాడని అక్కడి ప్రభుత్వం కృష్ణదాసు అరెస్టు చేసింది. నిన్నటి రోజున మరో ఘటన జరిగింది. పదవీచ్యుతురాలయిన ప్రధానమంత్రి షేక్ హసీనాకు మద్దతుదారురాలుగా అనుమానిస్తూ.. బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ టీవీ మహిళా జర్నలిస్ట్‌ను ఢాకాలో ఒక గుంపు నిర్బంధించింది. చివరకు ఆమెను పోలీసులు రక్షించవలసి వచ్చింది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. శనివారం (నవంబర్ 30) మున్నీ సాహా అనే మహిళా జర్నలిస్ట్ తన కార్యాలయం నుంచి బయలుదేరారు. ఢాకాలోని కార్వాన్ బజార్ వద్ద ఒక గుంపు ఆమె కారును అడ్డగించి నిర్బంధించింది. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..ఆమె భారతీయ ఏజెంట్ అని, హసీనాకు మద్దతుదారు అని ఆరోపించారు. చివరకు సాహాను మెట్రోపాలిటన్ పోలీసులు రక్షించి మరో కారులో అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ఆమెను అరెస్టు చేయలేదు..

సాహాను పోలీసులు మొదట తేజ్‌గావ్ పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాంతో ఆమెను అరెస్టు చేసినట్లు మీడియా భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించామని, ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం విడుదల చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఒక్కసారిగా ఆమెను కొంతమంది చుట్టుముట్టడంతో తీవ్ర భయాందోళనకు గురై అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

"పోలీసులు మున్నీ సాహాను అదుపులోకి తీసుకోలేదు. ఆమె కార్యాలయం వెలుపల ఉన్న కవ్రాన్ బజార్ వద్ద కొంతమంది వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు. తరువాత భద్రతా కారణాల దృష్ట్యా తేజ్‌గావ్ పోలీసులు ఆమెను DB కార్యాలయానికి తీసుకెళ్లారు" అని పోలీసు అధికారి ఒకరు డైలీ అబ్జర్వర్ పత్రికకు తెలిపారు. సాహాపై నాలుగు కేసులు ఉన్నాయని, బెయిల్ కోసం కోర్టుకు హాజరు కావాలని కూడా పోలీసు అధికారి చెప్పారు. అయితే జర్నలిస్టును కొట్టిన వ్యక్తుల గురించి పోలీసులు ఏమీ ప్రస్తావించలేదు.

జర్నలిస్టులు టార్గెట్ అవుతున్నారు..

ముఖ్యంగా హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లోని జర్నలిస్టులపై ఆంక్షలు పెరిగిపోయాయి. అనేక మంది జర్నలిస్టులపై పలు కేసుల్లో కేసులు నమోదు కాగా, మరికొంత మంది అక్రిడిటేషన్‌ను తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రద్దు చేశారు.  

Tags:    

Similar News