అయ్యప్పభక్తులకు శుభవార్త- ఇరుముడితో విమానాల్లో ప్రయాణం

అయ్యప్ప స్వామి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. భద్రతాకారణాలతో ఇంతకాలం అనుమతించని ఇరుముడిని ఇకపై విమానాల్లో అనుమతించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్ణయించింది

Update: 2024-10-27 05:13 GMT

అయ్యప్ప స్వామి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. భద్రతాకారణాలతో ఇంతకాలం అనుమతించని ఇరుముడిని ఇకపై విమానాల్లో అనుమతించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్ణయించింది. విమానాల్లో ప్రయాణించే స్థోమత ఉన్నా ఈ ఆటంకంతో చాలామంది రైళ్లలోనే పోయివస్తున్నారు. ఇప్పుడా ఆంక్షను ఎత్తివేశారు. దీక్ష సమయంలో స్వామివారి దర్శనం కోసం విమానంలో ప్రయాణించే భక్తులు ఇక మీదట ఇరుముడిని చెకిన్‌ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకెళ్లవచ్చని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇప్పటివరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదు. భక్తుల ఇబ్బందులు తెలుసుకొని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.

అయ్యప్ప దీక్ష సమయం పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఇరుముడిని కట్టుకుని తలపై పెట్టుకుని శబరిమల బయలుదేరుతారు. భద్రతా కారణాల రీత్యా విమానాల్లో ఇరుముడిని అనుమతించలేదు. ఆ ఇరుముడిని చెక్ ఇన్ బ్యాగేజీలో ఉంచి సాధారణ ప్రయాణీకుల్లాగా విమానం ఎక్కాల్సి వచ్చేది. ఇకపై అలా కాకుండా తలపై ఇరుముడిని పెట్టుకుని విమానం ఎక్కవచ్చు. భక్తుల ఇబ్బందులు తెలుసుకొని వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

అయ్యప్ప భక్తుల వినతితో ఈ మేరకు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. అందుకు అనుగుణంగా పౌరవిమానయాన భద్రతా విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి శనివారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. భద్రతా కారణాల రీత్యా విమానంలో కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని ఇన్నాళ్లూ అనుమతించలేదన్నారు. దీంతో స్వాములు రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి మేరకు నిబంధనలు సడలించామని, ఈ సౌలభ్యం మకరజ్యోతి దర్శనం ముగిసే వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తాజా ఉత్తర్వులతో ఎయిర్‌పోర్టు సిబ్బంది స్కానింగ్‌ చేసిన తర్వాత భక్తులు నేరుగా ఇరుముడితో విమానాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు.

Tags:    

Similar News