ఆప్ మంత్రి రాజీనామా.. అవినీతి పార్టీలో ఉండలేనని ప్రకటన..

ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ధ షాకే. ఆ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Update: 2024-04-10 13:48 GMT

ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ధ షాకే. ఆ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలో తాను ఉండదలచుకోలేదని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. “అవినీతిపై పోరాడటానికి పార్టీ పుట్టింది. కానీ నేడు పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. నేను ఈ ప్రభుత్వంలో పని చేయలేను. ఈ అవినీతితో నా పేరు కలపడం నాకు ఇష్టం లేదు’’ అని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

ఆనంద్ రాజీనామా ప్రకటన చేసిన వెంటనే.. AAP నాయకుడు సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. బిజెపి ఒత్తిడి చేయడం వల్లే ఆనంద్‌ పార్టీ నుంచి వైదొలగాలని అనుకున్నారని చెప్పారు.

దళితుల ప్రాతినిధ్యం లేదన్న మంత్రి..

సాంఘిక సంక్షేమ శాఖతో పాటు వివిధ శాఖలను నిర్వహించిన ఆనంద్ దళితులకు పార్టీలో ప్రాధాన్యంలేదని, ఆప్ అగ్ర నాయకత్వంలో దళితులు లేరని ఆరోపించారు. “పార్టీలో దళిత ఎమ్మెల్యే లేదా కౌన్సిలర్ లేరు. దళిత నేతలను నాయకత్వ పదవుల్లో కూడా నియమించలేదు. నేను బాబా సాహెబ్ అంబేద్కర్ సూత్రాలను పాటిస్తున్నాను. నేను దళితుల కోసం పని చేయలేకపోతే పార్టీలో ఉండి ప్రయోజనం లేదు' అని విలేకరులతో అన్నారు.

కేజ్రీవాల్‌ మాటలను గుర్తుచేస్తూ..

’’రాజకీయాలు మారితే దేశం మారుతుందని అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద చెప్పారని, అయితే రాజకీయాలు మారలేదు. కానీ రాజకీయ నాయకుడు మారాడు’’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్న మాటలను గుర్తు చేశారు పటేల్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనంద్.

రాజీనామా ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అదేం అంత ముఖ్యం కాదు. నిన్నమొన్నటి వరకు మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారే భావన మాలో ఉండేది. అయితే హైకోర్టు తీర్పు తర్వాత మా వైపు ఏదో తప్పు జరిగిందనిపిస్తోంది.’’ అని పేర్కొన్నారు.

'ఏ పార్టీలో చేరను'

తాను ఏ ఇతర పార్టీలో చేరడం లేదని ఆనంద్ స్పష్టతనిచ్చారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి అతిషి వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆనంద్ రాజీనామా చేయడం గమనార్హం. తనను కూడా సంప్రదించాలని చూశారని అతిషి చెప్పారు.

ఆనంద్ AAP జాతీయ కౌన్సిల్ సభ్యుడు. 2011 నుండి కేజ్రీవాల్ ఉద్యమంలో ఉన్నారు. పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఆనంద్ 2020లో పటేల్ నగర్ నుండి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.

Tags:    

Similar News