అమెరికా కోర్టులో కేసుపై ఆదానీ గ్రూపు ప్రకటన, అవన్నీ కూడా..
ఆదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదానీ, అతని మేనల్లుడు సాగర్ ఆదానీ, ఉన్నతాధికారి వినీత్ జైన్ పై అమెరికాలో నమోదు అయిన కేసుపై..
By : The Federal
Update: 2024-11-27 05:31 GMT
ఆదానీ గ్రూపు చైర్మన్, అతని మేనల్లుడు, కంపెనీ ఉన్నతాధికారి వినీత్ జైన్ అమెరికా కోర్టులో నమోదు అయిన అవినీతి ఆరోపణలపై గ్రూపు స్పందించింది. అమెరికా అధికారులు కోర్టులో దాఖలు చేసిన నేరారోపణలో యూఎస్ విదేశీ అవినీతి పద్దతుల చట్టం( ఎఫ్సీపీఏ) నిబంధనలు ఉల్లంఘించలేదని ఆదానీ గ్రూపు వెల్లడించింది.
మనదేశంలోని సోలార్ ప్రాజెక్ట్ ల కోసం అధికారులకు ఆదానీ గ్రూప్ 265 మిలియన్ డాలర్ల మొత్తాన్ని లంచంగా ఇచ్చారని యూఎస్ న్యాయశాఖ అభియోగాలు మోపింది. దీనివల్ల వచ్చే 20 సంవత్సరాల కాలంలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని అందించే సోలార్ ప్రాజెక్ట్ లను దక్కించుకుందని వారి ఆరోపణ. ఈ లంచాల కోసం అమెరికా నుంచి ఫండ్స్ సేకరించారని వాషింగ్టన్ వాదన.
ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నమోదు ఉన్న నేపథ్యంలో లంచం ఆరోపణపై అమెరికా కేసు నమోదు చేసింది. అయితే ఈ ఆరోపణలన్నీ తప్పనీ గ్రూపు కొట్టేసింది. ఇవన్నీ కూడా కేవలం జరిమానాతో బయటపడే కేసులనీ గ్రూపు ప్రకటించింది.
గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ పై డిస్ట్రిక్ కోర్టులో జరిగిన ఫిర్యాదులో కేవలం నిందితుడిలనే పేర్కొందని, ఎటువంటి నేరాభియోగాలు మోపలేదని పేర్కొంది. "ఈ డైరెక్టర్లపై క్రిమినల్ నేరారోపణలో మూడు ఆరోపణలపై అభియోగాలు మోపబడ్డాయి, అవి (i) సెక్యూరిటీల మోసం కుట్ర, (ii) వైర్ ఫ్రాడ్ కుట్ర (iii) సెక్యూరిటీల మోసం" అని ఫైలింగ్ పేర్కొంది.
పార్లమెంట్ సమావేశాల ముందు..
ఆదానీ గ్రూపు పై ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల ముందే ఏదో ఒక వివాదం బయటకు వస్తోంది. ఇంతకుముందు హిండన్ బర్గ్ వివాదం కూడా సరిగ్గా పార్లమెంట్ సమావేశాల ముందే విడుదల అయింది. దీనివల్ల వేల కోట్లను స్టాక్ మార్కెట్ లో అది నష్టాలను చవిచూసింది. హిండన్ బర్గ్ వివాదం పసలేదని తేలింది. సుప్రీంకోర్టు సైతం ఈ వివాదాన్ని తోసిపుచ్చింది. ఎలాంటి అవకతవకలు జరగలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.