నియంతృత్వం కావాలా? న్యాయబద్ద జీవనం కావాలా?: ఖర్గే

రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-02-25 14:28 GMT

రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బలంగా, ఐక్యంగా నిలబడకపోతే దేశంలో “నియంతృత్వ పాలన” వస్తుందని ప్రజలను హెచ్చరించారు. బెంగళూరులో జరిగిన 'రాజ్యాంగం - జాతీయ ఐక్యత సదస్సు-2024' సదస్సులో ఆయన ప్రసంగించారు.

‘‘చాలా మంది రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మీరు బలంగా, ఐక్యంగా నిలబడకపోతే.. దేశంలో నియంతృత్వ పాలన రావడం ఖాయం. మీకు నియంతృత్వ పాలన కావాలా? లేక న్యాయబద్ధ జీవితం కావాలా? నిర్ణయించుకోండి’’ అని ఖర్గే అన్నారు.

"రాజ్యాంగం బతికితేనే ఈ దేశ ఐక్యత బతుకుతుంది. ప్రజాస్వామ్యం బతికితే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించవచ్చు. కానీ నేడు కేంద్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రభుత్వం లేదా రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసే ప్రభుత్వం లేదు" అని ఖర్గే అన్నారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించడం, దానికి కట్టుబడి ఉండడం ముఖ్యమని చెబుతూనే.. ఒక నిర్దిష్ట భావజాలాన్ని రుద్ది పౌరులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలపై అవగాహనతో ఉండాలని ప్రజలకు సూచించారు.

ప్రస్తుతం ఉన్న రాజ్యాంగానికి బదులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే కుట్ర జరుగుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. "(ప్రధాని నరేంద్ర) మోడీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఆ రాజ్యాంగ పరిరక్షకులే బీజేపీయేతర ప్రభుత్వ రాష్ట్రాలపై EDని ప్రయోగించి ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. మణిపూర్, గోవా ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనది" అని ప్రశ్నించారు.

ఈ 'అబ్సెషన్' ఇలాగే కొనసాగితే దేశంలో నియంతృత్వం వచ్చే రోజు రావచ్చునని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ‘ప్రభుత్వ హామీలు’ లేదా కనీసం ‘బీజేపీ ప్రభుత్వ హామీలు’ అనే బదులు ‘నా హామీ’ అని చెప్పడం అలవాటైందని ఖర్గే అన్నారు. దేశంలోని ప్రజలు పన్నులు కట్టి డబ్బు ఇస్తున్నప్పుడు.. ఒక వ్యక్తి నేను చేశానని చెప్పడం సరికాదన్నారు. నేను అనే పదం ఏదో ఒక రోజు నియంతృత్వం వైపు నడిపిస్తుందన్నారు. 

Tags:    

Similar News