ఫిబ్రవరి 22న జర్నలిస్టుల ‘చలో అనంతపురం’

ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై వైసీపీ నేతల దాడికి నిరసనగా ర్యాలీ ఏపీయూడబ్ల్యూజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, సామ్నా, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపు

Update: 2024-02-20 10:21 GMT
వైసిపి కార్యకర్తలు గాయపడిన జర్నలిస్టు


ఆంధ్ర ప్రదేశ్ లో   జర్నలిస్టుల పై పెరుగుతున్న దాడులను అరికట్టాలని, అనంతపురం జిల్లా, రాప్తాడులో ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై దాడి చేసిన వారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ జర్నలిస్టులు  ఫిబ్రవరి 22న ’చలో అనంతపురం’ పిలుపునిచ్చారు.
 రాష్ట్రంలో జర్నలిస్టుల పై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని దాడులను అరికట్టాల్సిన పాలకులే దాడులను ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ   ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్, కార్యదర్శి రామసుబ్బారెడ్డి,సామ్నా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మారావు, రమణా రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శివ, ఫోటో జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు సాంబశివరావు ఆరోపించారు.
మొన్నటికి మొన్న అమరావతిలో ఇసుక అక్రమ రవాణా పై వార్త రాసినందుకు ఈనాడు రిపోర్టర్ పైన, పుట్టపర్తిలో ఈనాడు ఫోటో గ్రాఫర్ పైన, నిన్న రాప్తాడు లో సిద్దం సభ కవరేజ్ కు వెళ్ళిన శ్రీ కృష్ణ పైన అధికార వైసీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గం అన్నారు. దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి శ్రీ కృష్ణ మీద దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఆ మేరకు ఫిబ్రవరి 22న అనంతపురంలో పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నట్టు చెప్పారు. అనంతపురం, సమీప జిల్లాల జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జర్నలిస్టుల ఉద్యమానికి ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ప్రజా, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల నేతలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.


Tags:    

Similar News