కేరళలో సీఏఏ వ్యతిరేక నిరసనలు

సీఏఏకు వ్యతిరేకంగా కేరళలో వామ పక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నాయి. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని ఐయూఎంఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Update: 2024-03-12 14:53 GMT
Source: Twitter


లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో జరిగే అన్ని రకాల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల బీజేపీ ఒరిగేదేమీ లేదు. కానీ కేంద్రం ఒక్కసారిగా తీసుకొచ్చిన ఈ చట్టానికి దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. వామ పక్షాలు ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీని వల్ల ప్రజల్లో సామరస్యతకు విఘాతం కలుగుతుందని వారు ఆరోపిస్తున్నారు.

సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా 2019-2020లో కేరళలో జరిగిన నిరసనలు రాష్ట్రంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్)కి కలిసొచ్చాయి. ఈ నిరసనల వల్ల 2020లో జరిగిన ఎన్నికల్లో మైనారిటీ ఓట్లన్నీ స్థానిక వామపక్ష ప్రభుత్వానికి వచ్చాయి. అదే విధంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ వ్యతిరేకత స్థానిక ప్రభుత్వానికి కలిసొచ్చింది.



తీవ్ర స్థాయిలో నిరసనలు ప్రారంభించిన వామపక్షం

దేశంలో సీఏఏను అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన గంటల వ్యవధిలోనే మలప్పురం నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి వీ వసీఫ్ పలు నిరసనలు ప్రారంభించారు. టార్చిలైట్లు పట్టుకుని భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి కేంద్రం తీసుకొస్తున్న సీఏఏ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనగా ర్యాలీ నిర్వహించారు. వీరితో పాటుగా రాష్ట్రంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, ముస్లిం సంఘాలు కూడా పలు ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తే యూడీఎఫ్ సంఘం కార్యకర్తలు రైల్వే స్టేషన్‌లో నిరసలు చేశారు. ఇందులో భాగంగా 10 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు.

సీఏఏపై స్టే కోరిన యూడీఎఫ్

సీఏఏ అమలుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని 140 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డిమొక్రాటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) ప్రకటించింది. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) నేత ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం రాష్ట్రంలో మొత్తం 2,500 ప్రాంతాల్లో తమ నిరసనలను తీవ్రతరం చేయనున్నట్లు ఐయూఎంఎల్ యూత్ వింగ్ వెల్లడించారు. ‘‘ఎవరికీ పౌరసత్వాన్ని అందించడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ మతం పేరిట చూపుతున్న వివక్షను మాత్రం అంగీకరించం. ఈ చట్టం అమలు చేయడం వల్ల వచ్చే పరిణామాలను న్యాయస్థానానికి వివరిస్తాం’’అని సీఏఏకు వ్యతిరేకంగా ఐయూఎంఎల్ తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది హారిస్ బీరన్ వెల్లడించారు.
సీఏఏ వల్ల దేశంలో మత పరమైన వివక్ష అధికమవుతుందని, ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వారికి పౌరసత్వం ఇవ్వబోమని అనడం సరైన పద్ధతి కాదని ఐయూఎంఎల్, యూడీఎఫ్, డీవైఎఫ్ఐ సంఘాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే ఇందులో కీలక మార్పులు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.


Tags:    

Similar News