ఆరు కత్తి పోట్లతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు సైఫ్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లో దోపిడీకి యత్నించాడు.;

Update: 2025-01-16 05:08 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లో దోపిడీకి యత్నించాడు. ఆ క్రమంలోనే సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడు. పలుమార్లు సైఫ్‌ను కత్తితో పొడిచాడు. సైఫ్‌ను అతడి కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్.. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. సైఫ్, అతడి కుటుంబీకులు అంతా నిద్రలో ఉండగా దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో అతడ ప్రయత్నించాడు. దొంగను గమనించిన సైఫ్ అలీఖాన్.. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నటుడిపై దాడి చేసి దుండగుడు పరారయ్యాడు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు సైఫ్ నివాసానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనం చేయడమే దుండగుడి లక్ష్యమా? లేకుంటే సైఫ్‌పై దాడి చేయాలనో లేక హత్య చేయాలన్న ఆలోచనతో వచ్చాడా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరు కత్తిపోట్లు

దొంగతో జరిగిన ఘర్షనలో సైఫ్‌కు ఆరు కత్తిపోట్ల గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. వాటిలో ఒకటి వెన్నుపాముకు దగ్గర్లో అయినట్లు తెలిపారు. మరో రెండు చోట్లు లోతైన గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. అయితే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్స్ కోసం చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతుండగా దానిపై సైఫ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీ ప్రయత్నం జరిగింది. అందులో సైఫ్ అలీఖాన్ గాయపడిన వార్త వాస్తవం. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తాం’’ అని తెలిపారు.

సైఫ్‌పై దాడి బాధాకరం

సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడంపై టాలీవుడ్ స్టార్ హీరో ఎన్‌టీఆర్ స్పందించారు. ఈ వార్త విని తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానన్నారు. ‘‘సైఫ్ సర్‌పై దాడి జరిగిన విషయం విని షాకయ్యాను. ఇది నిజంగా చాలా బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’’ అని ఎన్‌టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News