బిజెపి లోక్‌సభ గెలుపు గుర్రాలపై కసరత్తు, సర్వత్రా ఉత్కంఠ
ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నదానిపై బీజేపీ అధిష్టానం ఒకటి రెండు ఆలోచించి నిర్ణయం తీసుకుంది. గెలిచే అభ్యర్థుల కోసం భారీ కసరత్తే చేసింది.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ గెలుపు గుర్రాలను బరిలో దించనుంది. ఇప్పటికే ఆ పార్టీ గెలిచే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. గురువారం దాన్ని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు ఉంచారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. వారు ఆ జాబితాను పున:పరిశీలించారు. ఫైనల్ లిస్టు ఈ రోజు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏప్రిల్, మే మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పోల్ షెడ్యూల్‌ను ప్రకటించేలోపు బీజేపీ తమ 543 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఎవరెవరు హాజరయ్యారంటే..
పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ నుంచి భూపేంద్ర పాటిల్, మధ్యప్రదేశ్ నుంచి మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ నుంచి విష్ణుదేవ్ సాయి, ఉత్తరాఘండ్ నుంచి పుష్కర్ సింగ్ ధావి, గోవా నుంచి ప్రమోద్ సావంత్ హాజరైన వారిలో ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
బరిలో కేంద్రమంత్రులు..
భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మనీష్ మందవీయా లాంటి కేంద్ర మంత్రులను ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. అందులో భాగంగానే వారిని ఈసారి రాజ్యసభకు దూరం పెట్టింది.
బీజేపీ విడుదల చేసే అభ్యర్థుల తుది జాబితా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. జాబితాలో కొత్తముఖాలు ఎంతమంది ఉన్నారు. పాతవారికి ఎక్కడెక్కడ స్థానాలు కేటాయించారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కంటే ముందు పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా అనేక సార్లు ఆయా రాష్ట్రాల ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.