బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. నమ్మి ఓటెయొద్దు: సిద్ధరామయ్య

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతిఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Update: 2024-04-06 14:12 GMT

లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించాలని కోరారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతిఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

బీజేపీ మాదిరి కాకుండా కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో తన నాయకత్వంలో అమలు చేసిన విధంగానే మేనిఫెస్టోను అమలు చేస్తారని పేర్కొన్నారు.

“కాంగ్రెస్ నిన్న హామీలు ప్రకటించింది. వాటిని కూడా నెరవేరుస్తాం. బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపి కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. నేను మిమ్మల్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. మీరు నరేంద్ర మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయండి’’ అని సిద్ధరామయ్య అన్నారు.

కురుదుమలే గణపతి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కోలార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తరుపున నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని, ఓటమి భయంతో బీజేపీ చెప్పే అబద్ధాలను నమ్మవద్దని కోరారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు హామీ పథకాలకు ఐదేళ్ల వారంటీ ఉంటుందన్నారు.

పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ సిలిండర్లు, ఎరువులు, వంటనూనెలు, పప్పులు, కూరగాయల ధరలను మోదీ ప్రభుత్వం పెంచిందని, ఫలితంగా దేశంలోని ప్రతి కుటుంబం ఇబ్బందులకు గురవుతోందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేశాం. ఈ హామీల అమలు సాధ్యం కాదని బీజేపీ మొదట జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ హామీలు అమలు చేసి మాట నిలుపుకున్నామని చెప్పారు.

’’హామీలు ఆగిపోతాయని చెబుతున్నారు. మా హామీలు ఏ కారణంతోనూ ఆగవు. కాంగ్రెస్ హామీలకు ఐదేళ్ల వారంటీ ఉంది’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

ఓటమి భయంతో భాజపా చెప్పే అబద్ధాల జోలికి వెళ్లవద్దు..బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. ఇచ్చిన మాటకు కట్టుబడి మీ ఓటును గౌరవించాం.. మీ ఓటుకు విలువ ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని చెప్పారు.

Tags:    

Similar News