‘‘పోటీకి అభ్యర్థులు లేని పార్టీ..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? ’’

ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా అభ్యర్థులను కూడా నిలబెట్టలేని వారు.. అధికారంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ధరాశివ్‌లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు.

Update: 2024-04-30 12:00 GMT

ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా అభ్యర్థులను కూడా నిలబెట్టలేని వారు.. అధికారంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ధరాశివ్‌లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు.

“ఒకప్పుడు వారికి (కాంగ్రెస్) 400 మంది ఎంపీలు ఉన్నారు.కానీ నేడు వారు 250-275 మంది అభ్యర్థులను కూడా నిలబెట్టలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు రావాలి. ఎన్నికలలో పోటీ చేయించేందుకు అభ్యర్థులు లేనపుడు.. మరి మెజారిటీ ఎలా సాధిస్తారు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా లేని పార్టీకి ఓటు వేయడం కూడా దండగే. మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు మీ ఓటును వినియోగించండి’’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.బలహీనమైన ప్రభుత్వం బలమైన దేశాన్ని తయారు చేయగలదా? అని కూడా మోదీ ప్రజలను అడిగారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 275 మంది అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయారని గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు పలికి ఓటును వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఓటమి భయంతోనే ఫేక్ వీడియోలు..

‘‘కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకున్నట్టుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నకిలీ వీడియోలను తయారచేస్తున్నారు. ‘మొహబ్బత్ కి దుకాన్’లో విక్రయిస్తున్నారు. సాంకేతికను ఆసరాగా చేసుకుని మోదీ ప్రసంగాలు, వాయిస్‌తో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు’’ అని మోదీ ఆరోపించారు.

బడా నాయకుడిని శిక్షించే సమయం వచ్చింది..

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌ను టార్గెట్ చేస్తూ..ఆయనను శిక్షించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రైతులకు ఏమీ చేయలేదని ఆరోపించారు.

మాధా లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్‌ పేరు ప్రస్తావించకుండానే మోదీ ఇలా అన్నారు. “పదిహేనేళ్ల క్రితం ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ బడా నాయకుడు వచ్చాడు. కరువు పీడిత ప్రాంతానికి నీరందిస్తామని అస్తమించే సూర్యుడి ముందు ప్రమాణం చేశాడు. అతను నీళ్లు తీసుకురా గలిగాడా? ఆ విషయం మీకు గుర్తుందా? ఆ హామీ ఇచ్చిన వ్యక్తిని మాట నిలబెట్టుకోలేదు. అందుకే అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని శిక్షించే సమయం వచ్చేసింది.’’ అని అన్నారు.

“రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం”లో ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు..చెరకు ధర క్వింటాం రూ. 200లుగా ఉండేది. కాని ఇప్పుడు తమ ప్రభుత్వంలో క్వింటాంకు రూ. 340 ఇస్తున్నామని మోదీ చెప్పారు.

“ఈ నాయకుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు.. చెరుకు రైతులు తమ బకాయిల కోసం నానా ఇబ్బందులు పడ్డారు. నేడు 100 శాతం బకాయిలు చెల్లించాం. 2014లో రైతులకు చెల్లించిన చెరకు బకాయిలు రూ.57 వేల కోట్లు కాగా, ఈ ఏడాది రూ.1,14,000 కోట్లు బకాయిలు చెల్లించాం’’ అని వివరించారు.

“ఈ బడా నాయకుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు.. నేను ఆయనకు పదే పదే చెప్పాను. ఆదాయపు పన్ను సమస్యను పరిష్కరించలేదు. మేము అధికారంలోకి వచ్చాక సహకార చక్కెర కర్మాగారాలకు ఆదాయపు పన్నును మాఫీ చేశాం. రూ. 10,000 కోట్ల ఉపశమనం కల్పించాం.” అని చెప్పారు.

అంతకుముందు సోమవారం పూణెలో జరిగిన ర్యాలీలో కూడా మోదీ పవార్‌పై విరుచుకుపడ్డారు. “మహారాష్ట్రలో 'భటక్తి ఆత్మ' (సంచారం చేసే ఆత్మ) ఉంది. విజయాన్ని సాధించలేక, ఇతరులు చేసే మంచి పనిని కూడా పాడు చేస్తుంది. దానికి మహారాష్ట్ర బాధితురాలైంది. ఇదే నాయకుడు ఈ గేమ్‌ను 45 ఏళ్ల క్రితం ప్రారంభించారు.తన స్వప్రయోజనాల కోసం మహారాష్ట్రను ఎప్పుడూ అస్థిర రాజ్యంగా ఉంచాలనుకున్నాడు. ఫలితంగా చాలా మంది ముఖ్యమంత్రులు తమ పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు.’’ అని ప్రధాని అన్నారు.

Tags:    

Similar News