‘అవును.. అమిత్ షా పేరు మేమే చెప్పాము’: కెనడా

కెనడాలో ఆశ్రయం పొందుతున్న సిక్కు తీవ్రవాదులపై నిఘా, బెదిరింపులో అమిత్ షా ప్రమేయం ఉందని మేమే ఓ అంతర్జాతీయ మీడియాకు లీకులు ఇచ్చినట్లు కెనడా విదేశాంగ శాఖ..

Update: 2024-11-02 13:01 GMT

భారత హోంమంత్రి అమిత్ షా పై కెనడా విదేశాంగమంత్రి చేసిన ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది. దీనిపై ఢిల్లీలోని కెనడా హై కమిషనర్ ను పిలిపించి భారత విదేశాంగ నిరసన వ్యక్తం చేసింది.

కెనడాలోని సిక్కు తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని హింస, బెదిరింపులు, గూఢచార సేకరణకు అమిత్ షా ఆదేశించారని కెనడా ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ మంగళవారం ఆరోపించారు. మోరిసన్ జాతీయ భద్రతా కమిటీలోని కెనడియన్ పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతూ, తాను షా పేరును వాషింగ్టన్ పోస్ట్‌కు చెప్పినట్లు వెల్లడించాడు. ఈ ఆరోపణలను వాషింగ్టన్ పోస్టు యదాతథంగా ప్రచురించింది.
జైస్వాల్ ఏం చెప్పారు..
భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, ఇతర దేశాలను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన వ్యూహంలో భాగంగా కెనడా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ మీడియాకు నిరాధారమైన అపోహలను లీక్ చేశారని ఆయన చెప్పారు. ప్రస్తుత కెనడా ప్రభుత్వం రాజకీయ ఎజెండా తో భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తాము ధృవీకరించట్లేదని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నలకు జైస్వాల్ సమాధానమిస్తూ, ఇటువంటి బాధ్యతారహిత చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్రమైన విఘాతలను కలిగిస్తాయని అన్నారు. కెనడా డిప్యూటీ మినిస్టర్ అమిత్ షా గురించి చేసిన "అసంబద్ధమైన, నిరాధారమైన" సూచనలపై తీవ్ర పదజాలంతో నిరసన తెలియజేయడానికి భారత్ శుక్రవారం కెనడియన్ హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి, అధికారికి దౌత్యపరమైన సమన్లు జారీ చేసినట్లు తెలిపారు.
భారత్ వైఖరి..
పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, షా ప్రమేయం గురించి కెనడాకు ఎలా తెలిసిందో మోరిసన్ చెప్పలేదు. జూన్ 2023లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన కెనడియన్ సిక్కు ఉగ్రవాదీ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధించిన విశ్వసనీయ సాక్ష్యాధారాలు కెనడా వద్ద ఉన్నాయని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఏడాది క్రితం చెప్పారు. కానీ వాటిని ఇప్పటి వరకూ వెల్లడించలేదు. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది.
దీనిపై అనేకసార్లు సాక్ష్యాలను ఇవ్వాల్సిందిగా కోరిన కెనడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. తరువాత భారత దౌత్య అధికారులను అనుమానితుల జాబితాలో చేర్చడంతో ఇరు దేశాల మధ్య తీవ్రమైన దౌత్య ఉద్రిక్తతలు తలెత్తాయి. భారత్ తన రాయబారులను వెనక్కి పిలిపించుకుని, కెనడా రాయబారులను బహిష్కరించింది.
Tags:    

Similar News