జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం
మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఆయన స్థానంలో కొత్త సీఎంగా జేఎంఎం నేత చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.
జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపయీ సోరెన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంపయీతో పాటు కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణం చేశారు.
మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్..
జార్ఖండ్ గత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపణలొచ్చాయి. రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించాడని ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రాజ్ భవన్‌లో ఆయన రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అక్కడే ఉన్న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.
తొలుత హైకోర్టును ఆశ్రయించిన హేమంత్.. తరువాత పిటిషన్‌ని వెనక్కి తీసుకుని సుప్రీం తలుపు తట్టారు. ఆయన పిటిషన్‌పై విచారించిన కోర్టు..ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో సోరెన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. హేమంత్ అరెస్ట్ అనంతరం తదుపరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి చంపయి సోరెన్ 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ శాసనసభలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది.
హైదరాబాద్‌కు ఎమ్మెల్యేల తరలింపు..
బలపరీక్ష నేపథ్యంలో సంకీర్ణ కూటమి తమ సభ్యులను కాపాడుకునేందుకు సిద్ధమైంది. కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి గురువారమే వీరు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా..వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు.
ఎవరీ చంపయీ సోరెన్..
67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయీ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రి. జనవరి 1, 1961న జంషెడ్‌పూర్‌లోని ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి సిమల్ సోరెన్. రైతు. చంపై సోరెన్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ఉద్యమంలో శిబు సోరెన్‌తో చేరి ‘జార్ఖండ్ టైగర్’గా పేరుతెచ్చుకున్నారు. 2010లో అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. హేమంత్ సోరెన్ క్యాబినెట్‌లో ఆహారం, పౌర సరఫరాలు, రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు. 2019లో హేమంత్ సోరెన్ మళ్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు, చంపై సోరెన్ రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
అసెంబ్లీలో బలబలాలు..
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 81. జేఎంఎం మహాఘట్‌బంధన్ కూటమిలో సభ్యులు - 47 (జేఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీ,సీపీఐ (ఎంఎల్) ఎన్‌సీపీ). అసెంబ్లీలో పార్టీల వారీగా శాసనసభ్యులు సంఖ్యను పరిశీలిస్తే.. జేఎంఎం - 29, కాంగ్రెస్ - 17, ఆర్‌జేడీ -1, బీజేపీ - 26, ఏఎస్‌జేయూ - 3, ఎన్‌సీపీ -1, సీపీఐ (ఎంఎల్) - 1, ఇండిపెండెంట్లు - 2 ఉన్నారు.