విశ్వాస పరీక్ష నెగ్గిన జార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో సీఎంగా ప్రమాణం చేసిన చంపాయీ సోరెన్ చివరకు విశ్వాస పరీక్ష నెగ్గారు.
జార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ విశ్వాస పరీక్ష నెగ్గారు. శాసనసభలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కూటమి తన బలాన్ని నిరూపించుకుంది. 81 మంది ఎమ్మెల్యేలలో 47 మంది చంపాయీకి మద్దతు తెలిపారు.
గత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రూ. 600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డాడని, వచ్చిన డబ్బును విదేశాలను తరలించాడని ఈడీ అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. హేమంత్ స్థానంలో చంపాయీ సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టారు. గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఫిబ్రవరి 2న ఆయనతో ప్రమాణం చేయించారు. ఫిబ్రవరి 5న చంపాయీ సోరెన్ బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలలో 47 మంది చంపాయీకి మద్దతు తెలిపారు. 29 మంది మద్దతు తెలపలేదు. కోర్టు అనుమతితో హేమంత్ సోరెన్ కూడా బల పరీక్షలో పాల్గొన్నారు.
నాటకీయ పరిణామాలు..
ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు జేఎంఎం తమ 38 మంది ఎమ్మెల్యేలను ఈనెల 2న హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించిన విషయం తెలిసిందే. వారంతా ఆదివారం సాయంత్రం తిరిగి జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్నారు. వెంటనే వారిని రెండు బస్సులో నగరంలోని సర్యూట్ హౌస్‌కు తరలించారు.
మంత్రి అలింగిర్ ఆలాం విశ్వాస పరీక్షపై ధీమా వ్యక్తం చేశారు. ‘‘మేం బలపరీక్షలో తప్పక నెగ్గుతాం.మాకు 48 నుంచి 50 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉంది’’ అని మంత్రి తెలిపారు. జేఎంఎం మరో నేత మిథిలేష్ ఠాకూర్ కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్)తో కలిపి బలపరీక్ష నెగ్గుతారని గత వారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరలయ్యింది.