SYRIA | సిరియా తల రాత మార్చిన గోడ మీది రాత
ఓ 14 ఏళ్ల కుర్రాడు 13 ఏళ్ల కిందట ఓ స్కూలు గోడపై రాసిన నినాదం ఇప్పుడు సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది.
By : The Federal
Update: 2024-12-09 07:45 GMT
2011 ఫిబ్రవరి 11.. సిరియాలోని దారా నగరం.. ఓ 14 ఏళ్ల కుర్రాడు ఓ స్కూలు గోడపై ఓ నినాదం రాశాడు. దానర్థం 'ఇక నీ వంతే'. ఈ నినాదం ఆ కుర్రాడి కుటుంబం పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది. అది జరిగిన 13 ఏళ్ల తర్వాత సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడా అధ్యక్షుడు చనిపోయాడని కొందరు, ఎక్కడున్నాడో కనిపించడం లేదని మరికొందరు చెబుతున్నారు.
ఆవేళ ఏం జరిగిందంటే...
2011లో 'అరబ్ స్ప్రింగ్' అనే ఉద్యమం పశ్చిమాసియా దేశాలను కుదిపేసింది. ఓ అమ్మాయి మొబైల్ టెలిఫోన్ ను ఉపయోగించి సందేశాలను పంపి యువతను కూడగట్టి పాలకులకు నిరసన తెలిపేందుకు ప్రారంభించిన అరబ్ స్ప్రింగ్ ఉద్యమంతో అనేక మంది నియంతలు పరారయ్యారు. సరిగ్గా ఆ సమయంలో సిరియా(Syria)లో ఓ సంఘటన జరిగింది.
దాదాపు 13 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు అనుకోకుండా వేసిన తిరుగుబాటు బీజం నేడు వటవృక్షంలా మారింది. నియంతృత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించింది. 2011లో మొదలైన ‘అరబ్ స్ప్రింగ్’ తిరుగుబాటు తీవ్రతను గుర్తించని సిరియా పాలకుడు అసద్ దాని ఫలితం ఇంతలా ఉంటుందని ఊహించకపోవచ్చు. చివరికి అదే ఆ అధ్యక్షుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ఆవేళ గోడ మీద ఏమి రాశారంటే...
2010-11లో ట్యునీషియాలో ఓ చిరు వీధి వ్యాపారి మహమ్మద్ బువాజీజీతో ఓ అధికారి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ప్రజల ఆందోళనలు మొదలు పెట్టారు. ఆ ఉద్యమమే అరబ్ స్ప్రింగ్. మెల్లగా ఆ ఉద్యమం ఈజిప్ట్, యెమెన్, లిబియాలకు పాకింది. అక్కడి పాలకులు గద్దె దిగేలా చేసింది.
ఆ సమయంలో సున్నీల జనాభా అధికంగా ఉన్న సిరియా అసద్ కుటుంబ పాలనలో ఉంది. అప్పటి పాలకుడు హఫీజ్ అల్ అసద్ మరణంతో 2000లో లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆయన కుమారుడు బషర్ అధికారాన్ని చేపట్టాడు. అదే సమయంలో సిరియాలో కరవు వచ్చింది. ప్రభుత్వం తమను ఆదుకోలేకపోయిందనే అసంతృప్తి నెలకొంది. 2011 నాటికి అసమ్మతి బాగా పెరిగింది. బషర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా బషర్ తన సైన్యం, పోలీసులను అప్రమత్తం చేసి ఎవరి నుంచి చిన్న వ్యతిరేకత వచ్చినా సహించ వద్దని ఆదేశించారు.
ఈ పరిస్థితితో విసిగిపోయిన ఓ 14 ఏళ్ల కుర్రాడు మౌవియా సియాస్నే సిరియాలోని దారా నగరంలో 2011 ఫిబ్రవరి 26న పాఠశాల గోడపై ‘ఎజాక్ ఎల్ దూర్ య డాక్టర్’ (ఇప్పుడు నీ వంతు వచ్చింది డాక్టర్) అని పెద్ద అక్షరాలతో రాశాడు. ఈ రాతలు దేశాన్నే మార్చేస్తాయని ఆనాడు ఆ బాలుడికి కలలో కూడా అనుకోలేదు. విద్య పరంగా నేత్ర వైద్యుడైన బషర్‌ను సిరియాలో ‘డాక్టర్’ అని సంబోధించేవారు. అధ్యక్షుడు కావడానికి ముందు బషర్ లండన్ లో డాక్టర్ గా ప్రాక్టీసు కూడా చేశారు. అందువల్ల అందరూ ఆయన్ని డాక్టర్ అనే పిలిచేవారు.
గోడ మీద రాసిన ఈ నినాదం గురించి- సాయంత్రం ఇంటికొచ్చిన బాలుడు మౌవియా సియాస్నే తన తండ్రికి చెప్పారు. దీంతో ఆ కుర్రాడి కుటుంబం భయంతో వణికిపోయింది. వారు భయపడినట్లే ఆ విషయం దారా ప్రాంతీయ భద్రతాధికారి ఆతిఫ్ నజీబ్‌కు తెలిసింది. అతడు అసద్‌కు సన్నిహితవర్గంలోని వ్యక్తి. అతడి ఆదేశాల మేరకు అక్కడున్న దాదాపు 20 మంది పిల్లలను సైనిక దళాలు బంధించి తీసుకెళ్లాయి. నిర్బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఆ పిల్లల కుటుంబీకులు ఎంత మొరపెట్టుకొన్నా దళాలు కనికరించలేదు. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. ఇవి మెల్లగా దేశం మొత్తం వ్యాపించడంతో చాలామంది ఆందోళనకారులను జైళ్లలో వేశారు. పరిస్థితి చేజారుతుండటంతో అసద్ తరఫున కొందరు వచ్చి దారాలోని పెద్దలను కలిసి దాదాపు 26 రోజుల నిర్బంధం తర్వాత పిల్లలను విడిచిపెట్టారు. పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయబోమని వారితో సంతకాలు పెట్టించుకొన్నారు. విడుదలైన తర్వాత ఆ పిల్లల పరిస్థితి మరింత దిగజారింది. దీంతో 2011 మార్చి 15న తొలిసారి అత్యంత సమన్వయంతో దేశవ్యాప్తంగా ‘డే ఆఫ్ రేజ్’ పాటించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను అదుపు చేసేందుకు సిరియా పాలకులు మళ్లీ హింసనే ఎంచుకొన్నారు. దీంతో ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. ఆ తర్వాత కొన్ని నెలలకే సిరియా సైన్యంలో చీలికలు వచ్చాయి. దీనిలో ఓ భాగం జులైన 2011న ఫ్రీ సిరియా ఆర్మీ (ఎఫ్‌ఎస్‌ఏ)గా ఏర్పడి అసద్ కుటుంబంపై పోరాటానికి దిగాయి. దీనిలోకి ఐసిస్, జబాత్ అల్ నుస్రా, అల్ ఖైదా, ఖుర్దు గ్రూపులు చొరబడ్డాయి. వీటికి తోడు అమెరికా, రష్యా, ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ అంతర్యుద్ధంలో చేరాయి.
కానీ, రష్యా, ఇరాన్‌ల మద్దతుతో అసద్ ఇంతకాలం తిరుగుబాట్లను అణచివేస్తూ వచ్చారు. దీంతో కొన్నాళ్లు ఇడ్లిబ్ ప్రాంతానికే రెబల్స్ పరిమితం అయ్యారు. కానీ, ఇరాన్, రష్యా బలహీనపడినట్లు అంచనాలకు రావడంతో హెచ్‌టీఎస్ (హయాత్ తహరీర్ అల్-షామ్) మరికొన్ని గ్రూపులు మెరుపు దాడులు చేసి అసద్‌ను తరిమేశాయి. దాదాపు 13 ఏళ్లపాటు రగిలిన ఈ రావణ కాష్టంలో దాదాపు 5 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రూ.వేల కోట్ల ఆస్తి ధ్వంసమైంది. తాజాగా దేశాన్ని ఆక్రమించిన హయాత్ తహరీర్ అల్-షామ్ నాడు అల్ నుస్రా నుంచే పుట్టుకొచ్చింది.
'ఉద్యమాలు ఎప్పుడైనా చిన్న చిన్న సంఘటనల నుంచే పుట్టుకొస్తాయి. ఆ విషయాన్ని సైనిక పహారాలో ఉండే నియంతలు గుర్తించే సమయానికే వాళ్లు ఆ మంటల్లోనే హతమై పోయిన సందర్భాలు అనేకం' ఉన్నాయని అరబ్ వ్యవహారాలను సుదీర్ఘ కాలంగా పరిశీలిస్తున్న నిపుణుడొకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.