MANMOHAN SINGH | రాష్ట్ర విభజనకు సాక్షీభూతం డాక్టర్ మన్మోహన్ సింగ్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రత్యక్ష సాక్షి ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (MANMOHAN SINGH). ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన రాష్ట్ర విభజన ఇదే.
By : The Federal
Update: 2024-12-26 18:10 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ప్రత్యక్ష సాక్షి ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (MANMOHAN SINGH). ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన రాష్ట్ర విభజన ఇదే. తెలంగాణ అంశం జఠిలమైందని ప్రధాని మన్మోహన్ సింగ్ 2013 అక్టోబర్ అన్నారు. ఆ తర్వాత సరిగ్గా 6 నెలలకు రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైయ్యే సమస్యలు తనకు తెలుసునంటూనే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు తలూపారు. తెలంగాణ విభజనపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(జీఎంఓ) పరిష్కరిస్తుందని చెప్పిన తర్వాత 2014 జూన్ నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. పార్లమెంటు తలుపులు మూసి కరెంటు తీసివేసి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన తీరుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష సాక్షి. రాష్ట్రాన్ని విడగొట్టే సందర్భంలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన ప్రత్యేక హోదా లాంటి ప్రధాన హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014 తర్వాత కూడా వివిధ సందర్భాలలో చెప్పిన మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఇక ఆ డిమాండ్ కూడా ఆయనతో పాటే కాలగర్భంలో కలిసిపోనుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26వ తేదీ రాత్రి న్యూఢిల్లీలో కన్నుమూశారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రస్థానం...
న్మోహన్ సింగ్ 1932 సెప్టెంబరు 26న ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పశ్చిమ పంజాబ్ చక్వాల్ లో జన్మించారు. తొలుత ఆర్థిక వేత్త ఆ తర్వాత రాజకీయవేత్తగా మారారు. పదేళ్ల పాటు భారత ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్ధిక సంస్కరణకు పురుడు పోశారు. ఆయనో సిక్కు. మైనారిటీ వర్గానికి చెందిన తొలి ప్రధానిగా చెబుతారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం, గ్రేట్ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్‌ను పొందారు . 1970వ దశకంలో భారత ప్రభుత్వంతో ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. పలువురు ప్రధాన మంత్రులకు సలహాదారుగా ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి 1976 నుంచి 80 వరకు నాలుగేళ్ల పాటు గవర్నర్‌గా పని చేశారు.
1991లో ఆయన ఆర్థిక మంత్రిగా నియమితులైనప్పుడు దేశం ఆర్థిక పతనం అంచున ఉంది. రూపాయి విలువతో పాటు పన్నులను తగ్గించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, ఆర్థికాభిద్ధికి దోహదపడే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 1991లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తూనే వచ్చారు. 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్ 1999లో లోక్‌సభకు పోటీ చేసినా విజయం వరించలేదు.
2004 పార్లమెంటరీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది. ఆ దశలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సుతారం ఇష్టపడకపోవడంతో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆ పదవి వరించింది. సోనియా గాంధీ సిఫార్సు మేరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
భారతదేశంలోని పేదలకు సంస్కరణలు ఉపయోగపడాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ పరితపించినప్పటికీ పరిస్థితులలో పెద్దగా మార్పురాలేదు. అయితే ఆయన పట్టుపడవకుండా మానవతా ధృక్పదంతో సంస్కరణలు కొనసాగించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్‌తో శాంతి, స్నేహసంబంధాల కోసం ప్రయత్నించడం, భారతదేశంలోని వివిధ మతాల మధ్య సత్ సంబంధాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి.
2009లో రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అవిరళ కృషి చేశారు. అయితే పెరుగుతున్న ఇంధన ఖర్చులు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీశాయి. దీంతో దేశంలోని పేదలకు సబ్సిడీలు అందించడం ప్రభుత్వానికి తలకు మించిన భారమైంది. భారతదేశ ఇంధన డిమాండ్లను తీర్చే ప్రయత్నంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ 2005లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ W. బుష్‌తో అణు సహకార ఒప్పందం కోసం చర్చలు జరిపారు. అణు కర్మాగారాలకు ఇంధన సాంకేతికతను భారత్‌కు అందజేయాలని, ప్రపంచ మార్కెట్‌లో అణు ఇంధనాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని భారత్‌కు అందించాలని కోరారు. ఈ ఒప్పంద ప్రతిపాదనను దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి. 2008 నాటికి ఈ వివాదం ముదిరిపాకాన పడింది. కాంగ్రెస్ పార్టీకి అప్పటి వరకు మద్దతు ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు సింగ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాయి. 2008 జూలై చివర్లో పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే వరకు వెళ్లింది. చివరకు ఆ తీర్మానం ఓడినా దీనివెనుక ఏదో వ్యవహారం ఉందన్న విషయం బయటపడింది. విశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పలువురు ఎంపీలను కొనుగోలు చేసిందనే ఆరోపణలతో కూరుకుపోయింది. అయితే 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీ తో గెలిచింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
భారతదేశ ఆర్థిక వృద్ధి మందగించడం, కాంగ్రెస్ పార్టీ పై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండవ టర్మ్ పాలన అనుకున్నంత సజావుగా సాగలేదు. ఫలితంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దీంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ శకం ముగిసినట్టయింది.
ముగ్గురూ ఆడపిల్లలే...
1958లో గురుశరణ్ కౌర్ ను వివాహమాడిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కి ఉపీందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ అనే ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకున్నారు. వాళ్లెవరూ రాజకీయాల్లో లేరు.
2019లో మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్ర పోషించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే బాలీవుడ్ చిత్రం వివాదాస్పదమైంది. సోనియా గాంధీ ఏమి చెబితే అదే చేసే ఓ బొమ్మగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్రను రూపొందించారు. దీనికి మయాంక్ తివారీ కథ అందించాడు. ఈ చిత్రం సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారం అని చెబుతారు. ఆయన హయాంలో జరిగిన మరో చారిత్రక సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోవడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.