రేపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

కేంద్ర ఎన్నికల సంఘం రేపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.

Update: 2024-03-15 09:06 GMT
సార్వత్రిక ఎన్నికలకు శనివారం (మార్చి 16) నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ తేదీలను ప్రకటించనున్నారు.
ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.

గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

Tags:    

Similar News