‘స్లీపర్ బస్సులంటే శవ శకటాలు, బ్యాన్ చేయాల్సిందే’

వాటిని మెరుగుపరచడం కాదు, నిషేధించాలంటున్న IOC మాజీ చైర్మన్

Update: 2025-10-28 11:54 GMT

‘స్లీపర్ బస్‌లు సౌకర్యవంతమైన ప్రయాణానికి మారు రూపం కాదు.. మనంతట మనమే బుక్ చేసుకుంటున్న మన డెత్ ట్రాప్’ అని ఇండియన్ ఆయిల్(Indian-Oil) మాజీ ఛైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య(Srikanth M Vaidya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్లీపర్ బస్సుల(Sleeper Bus)ను కదిలే శవశకటాలుగా ఆయన అభివర్ణించారు. పది రోజుల్లో దేశంలో దాదాపు నాలుగు బస్సుల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కర్నూలు శివార్లలో చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 20 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు చాలా మంది తప్పించుకునే అవకాశం లేక.. సజీవదహనం అయ్యారు. ఈ అంశం ఇప్పటికీ దేశమంతా కూడా నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా స్లీపర్ బస్సులను బ్యాన్ చేయాలంటూ వైద్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. వాటి డిజైన్ ద్వారానే అవి డెత్ ట్రాప్స్‌గా మారుతున్నాయన్నది వైద్య వాదన. ప్రజల సంక్షేమం, ప్రాణాల కోసమైనా భారత ప్రభుత్వం వాటిని వెంటనే బ్యాన్ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు దేశమంతా ఆయన పోస్ట్ గురించే చర్చిస్తోంది.

 

ఇవి ప్రమాదాలు కాదు..

స్లీపర్ బస్‌లు ఇంజినీరింగ్ ఫెల్యూర్స్ అని వైద్య పునరుద్ఘాటించారు. వాటి డిజైన్‌లోనే డెత్ ట్రాప్స్‌ ఉన్నాయని, వాటిని ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచన మానుకుని బ్యాన్ చేయడమే ఉత్తమ మార్గమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే నెలలో రెండు స్లీపర్ బస్‌లు మంటల్లో కాలి బూడిదై పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన ఇందుకు అతిపెద్ద ఉదామరణగా చెప్పారు. వాటిలో ఒకటి కర్నూలు(Kurnool Bus Accident) ఘటన కాగా.. మరొకటి రాజస్థాన్‌లో జరిగింది. ఈ రెండు ప్రమాదాల్లో కలిపి మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక దశాబ్ద కాలంలో చూసుకుంటే మొత్తం 130 మంది ప్రజలు ఇటువంటి ఘటనల్లోనే తమ ప్రాణాలను కోల్పోయారని వైద్య వివరించారు. వీటిలో ఎక్కువ ప్రాణాలు.. నిద్రలో ఉన్న సమయంలో, తప్పించుకోవడానికి వీలులేక పోయాయని చెప్పారు. ప్రమాదం జరిగితే పారిపోవడానికి, తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా స్లీపర్ బస్‌ల డిజైన్స్ ఉన్నాయని అన్నారు. ‘‘ఆ పోయిన ప్రాణాలు దురదృష్టకర ఘటనలు జరగడం వల్ల కాదు. చెత్త డిజైన్, బస్సు ఇంజినీరింగ్‌లో లేని జవాబుదారీతనం, అకౌంటబిలిటీకి వచ్చిన ఫలితాలు’’ అని రాసుకొచ్చారు.

Full View

స్లీపర్ బస్సులు ఇందుకే సేఫ్ కాదు..

వైద్య.. ఊరికినే ఆరోపణలు చేయలేదు. అసలు స్లీపర్ బస్‌లను డెత్ ట్రాప్స్‌గా తాను ఎందుకు అంటున్నారో కూడా వివరించారు. ‘‘ఇరుకైన మార్గం, మూసేసిన ఎగ్జిట్స్, బస్సు నిండా ఇట్టే అంటుకునే ఇంటీరియర్. రద్దీ, ఇరుకైన క్యాబిన్లు.. వీటి వల్ల ఒక్కసారి నిప్పు అంటుకుందంటే ఎక్కడి వాళ్లక్కడ ట్రాప్ అయినట్లే. సేఫ్టీ అనేది క్రమశిక్ష, రాజీలేని పనితీరుతోనే సాధ్యమవుతుంది. ఇండియాలో ప్రస్తుతం ఉన్న బస్ డిజైన్‌లో అన్ని పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది’’ అని వైద్య పేర్కొన్నారు.

 తొలగించడమే మార్గం..

ఇండియాలో ఉన్న విచ్ఛిన్నమైన రవాణా వ్యవస్థ.. అర్థవంతమైన పర్యవేక్షణ నిర్వహణను అసాధ్యం చేస్తుందని వైద్య అంటున్నారు. ‘‘1.6 మిలియన్ బస్సులు రోడ్లపైకి రావడం, దాదాపు 78 శాతం ప్రైవేట్ ఆపరేటర్లు ఐదు కంటే తక్కువ వాహనాలను నడుపుతున్నందున, భద్రతా నిబంధనలను అమలు చేయడం ఒక లాజిస్టిక్ పీడకల. చాలా బస్సులు అక్రమ వైరింగ్, పేలవమైన నిర్వహణతో అసురక్షిత మార్పిడులతో ఉన్నాయి. వ్యాపార మోడల్.. సీట్లు, వేగం, లాభానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. రక్షణ, మనుగడకు కాదు" అని ఆయన హెచ్చరించారు. "తీవ్రమైన తప్పు ఉన్న డిజైన్‌కు అంతే తీవ్రమైన, కఠినమైన దిద్దుబాటు చర్య అవసరం. చైనా, వియత్నాం దీన్ని చేయగలిగినప్పుడు ఇండియా ఎందుకు చేయలేదు. చేయగలదు." అని వైద్య అన్నారు.

స్లీపర్ బస్సులపై విదేశాల యాక్షన్ ఇదే..

చైనా, వియత్నాం, జర్మని లాంటి పలు దేశాలు స్లీపర్ బస్సుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాయని ఆయన గుర్తు చేశారు. ఆ దేశాలు స్లీపర్ బస్సులు అంటే కదిలే శవపేటికలు అని గుర్తించి.. వాటిని పూర్తిగా బ్యాన్ చేశాయి.

వీటిలో చైనా(China).. 2012లో పూర్తి స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. ఇక వియత్నాం(Vietnam) తన సేఫ్టీ కోడ్స్, ఎవాక్యుయేషన్ రూల్స్‌ను పూర్తిగా మార్చుకుంది. జర్మనీ(Germany).. స్లీపర్ లేఔట్స్‌ను కఠినమైన, లో-డెన్సిటీ స్టాండర్డ్స్‌లో అనుమతిస్తుందని ఆయన చెప్పారు. ‘‘కానీ ఇండియా మాత్రం స్లీపర్ బస్సులను నియంత్రించడం మానుకుని.. ప్రమాదాల్లో మరణించిన వారికి పోస్ట్ మార్టమ్‌ చేసుకుంటుంది. ప్రమాదాలు జరిగిన తర్వాత మాత్రమే ఇండియా యాక్షన్‌లోకి దిగుతుంది’’ అని ఆయన అన్నారు.

Tags:    

Similar News