తొలిసారి వెలుగులోకి భక్తరామదాసు విగ్రహం

తెలంగాణ నేలకొండపల్లిలో స్థానికులు ఒక విగ్రహం గుర్తించారు. భద్రాచల రామాలయ నిర్మాత భక్తరామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కావచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

Update: 2024-01-26 06:55 GMT

తెలుగువారి జీవితాలలో అత్యంత ప్రాధాన్యం గల 17వ శతాబ్దపు భద్రాచల రామమందిర నిర్మాణం, రామదాసు చరిత్ర..డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డులు, దేవాలయం జియోగ్రఫీ, ప్రాంతీయ తెలుగు మౌఖిక సంప్రదాయాలలో కొంత వ్యత్యాసాలతో కనిపిస్తుంటాయి. అలాగే రామదాసు జీవితంపై ఆయనే రాసుకున్న దాశరథి శతకంలోని అంశాలు, మరికొన్ని నిజాం, డచ్‌ రికార్డులు తప్ప విస్పష్టమైన ఆధారాలు మిగలలేదు. రామదాసు ఎలా వుండేవాడు, ఆయన ఆహార్యం ఏమిటి అనేప్రశ్నల నేపథ్యంలో కళాకారుల ఊహల మేరకు ఇప్పటి వరకూ అనేక విధాలైన రామదాసు విగ్రహాలు తయారయ్యాయి. నేలకొండపల్లిలోని కంచర్లగోపన్న ప్రాచీన నివాసాన్ని రామదాసు ధ్యాన మందిరంగా మార్చి అక్కడొక కాంస్య విగ్రహం ఏర్పాటు చేసారు.

ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో బాపు గారి ఊహల మేరకు నిర్మించిన ఇంకొక విగ్రహం కూడా ఉంది. భద్రాద్రిలోనూ రామదాసు రూపాన్ని చూపిస్తూ ఊహాలతో చేసిన విగ్రహం ఉంది. కానీ ఆయన సమకాలికంగా తయారైన విగ్రహాలు వెలుగులోకి రాలేదు.

నేలకొండపల్లి స్థానికులు పసుమర్తి శ్రీనివాస్‌, స్థానిక పోలీస్టేషన్‌లో రావిచెట్టుకింద ఉన్న ఒక విగ్రహాన్ని గమనించారు. కాసెపోసికట్టిన ధోవతితో, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా, అంజలిముద్రతో, స్థానభంగిమలో, మొన కిందికిపెట్టిన కత్తి ఎడమసందిటపెట్టి, నిల్చున్న భక్తుడు, మీసాలతో, తలవెనక స్నానంచేసి జారుముడివేసుకున్న గోష్పాదశిఖతో కనిపిస్తున్న ఈ విగ్రహం.. ఆలయ మర్యాదలతో నిలబడిన రాజహోదాగల వ్యక్తిదని, కుడి, ఎడమ భుజాలమీద చక్ర, శంఖాల ముద్రలున్నందున వైష్ణవ భక్తునిదని, చెవులకున్న కుండలాలు, మెడలో హారం అతని నిరాడంబరతను తెలుపుతున్నాయని విగ్రహ పరిశీలన చేసిన కొత్తతెలంగాణ చరిత్ర బృందం చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్‌, కట్టా శ్రీనివాసులు ప్రతిమ లక్షణాలను వివరించారు.

నేలకొండపల్లిలో దొరికిన ఈ శిల్పం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడు, భద్రాచల రామాలయనిర్మాత, నేలకొండపల్లి వాసి అయిన భక్తరామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కావడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News