బీజేపీకి డబుల్ షాక్.. ఎన్నికల నుంచి తప్పుకుంటున్న నేతలు
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి బ్రేక్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరిన గంభీర్, జయంత్ సిన్హా. టికెట్ లభించదేమోనన్న అనుమానంతోనేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
By : The Federal
Update: 2024-03-02 12:02 GMT
లోక్‌సభ ఎన్నికలకు దేశమంతా సన్నద్ధం అవుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా 400 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుని ఉంది. ఈ విషయాన్ని అధికారి పార్టీ బడా బడా నాయకులు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే బీజేపీ సుమారు 100 మంది అభ్యర్థులతో తమ తొలి జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. శుక్రవారం తాము ఎన్నికల్లో పోటీ చేయమంటూ ఇద్దరు కీలక నేతలు వెల్లడించారు. తనకు ఎన్నికల బాధ్యతల నుంచి విశ్రాంతి ఇవ్వాలని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కోరిన గంటల వ్యవధిలోనే మరో ఎంపీ జయంత్ సిన్హా కూడా తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ చెప్పి బాంబు పేల్చారు. తనకు రాజకీయాల్లో భాగం వద్దని, రానున్న లోక్‌సభ ఎన్నికల టికెట్‌పై కూడా ఆసక్తి లేదంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇద్దరు ఎంపీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు.
నన్ను తప్పించండి
ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ అధ్యక్షుడిని కోరానని ఝార్ఖండ్ ఎంపీ జయంత్ సిన్హా వెల్లడించారు. ‘‘భారతదేశం సహా ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న వాతావరణ మార్పులపై చేస్తున్న పోరాటంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకోసం నన్ను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించగలరని పార్టీ అధ్యక్షుడు నడ్డాను కోరాను. ఏది ఏమైనా ఆర్థిక, పాలన సమస్యల విషయంలో పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను’’అని ప్రకటించారు. అదే తరహాలో తన క్రికెట్ కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయడానికి తనను కూడా రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలని గంభీర్ వెల్లడించారు.
టికెట్ దక్కదనే పార్టీకి టాటా
అయితే జయంత్ సిన్హా, గౌతమ్ గంభీర్‌కు రానున్న లోక్‌సభ ఎన్నికల టికెట్ లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో వీళ్లు పార్టీకి గుడ్‌బై చెప్పడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. విశ్లేషకులు కూడా ఈ కథనాలు నిజమే అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కనందుకే వాళ్లు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ పలువురు కొత్త నేతలకు టికెట్‌లు ఇస్తుండటంతో సిట్టింగ్ ఎంపీల మదిలో అనుమానాలు చెలరేగుతున్నాయి. కొత్త నేతలకు అవకాశం కల్పించడానికి బీజేపీ తమకు టికెట్లు ఇవ్వడం లేదని భావించిన పలువురు నేతలు యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్తూ బీజేపీ సంస్థాగత అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు కీలక నేతలు కూడా రానున్న ఎన్నికల బరి నుంచి తప్పుకుని విశ్రాంత నేతలుగా మారొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడుగా ఎవరెవరు నేతలు గెలిచే అవకాశం ఉందని బీజేపీ అనేక సర్వేలు చేయించింది. వాటిలో పలు సర్వేల్లో గంభీర్, జయంత్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో వారికి టికెట్ ఇవ్వడంపై బీజేపీ వెనకడుగు వేసి ఉండొచ్చని, అదే విషయంపై వారితో చర్చించి పార్టీ అధిష్టానం సూచనల మేరకే వారిద్దరూ పార్టీని వీడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.