ప్రియాంకా గాంధీ పిల్లల్ని చూశారా? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో!

భారతీయ ప్రజాస్వామ్యంలో వంశ పాలన ఒక వైరుధ్యంగా ఉన్న అనువంశిక పాలనకు ఒక ఆమోదం ఉందేమోననిపిస్తుందంటారు మేధావులు. గాంధీ కుటుంబ వారసత్వంపై వివాదాలున్నా..

Update: 2024-05-26 05:39 GMT

భారతీయ ప్రజాస్వామ్యంలో వంశ పాలన ఒక వైరుధ్యంగా ఉన్న అనువంశిక పాలనకు ఒక ఆమోదం ఉందేమోననిపిస్తుందంటారు మేధావులు. గాంధీ కుటుంబ వారసత్వంపై వివాదాలున్నా అదే ఇంటి పేరు ఓపక్క గౌరవాన్ని మరోపక్క పేరు ప్రతిష్టలనూ తెచ్చిపెడుతుందేమో..

భారత రాజకీయాల్లో ఐదో తరంగా ఉన్న ప్రియాంక గాంధీ పిల్లలు నిన్న తళుక్కున మెరిసినపుడు మీడియా చేసిన హడావిడే ఇందుకు నిదర్శనం. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వధేరా కొడుకూకూతుళ్లు రేహాన్‌ రాజీవ్, మిరాయా మొదటిసారి శనివారం ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెహ్రూ–గాంధీ–వధేరా కుటుంబంలో ఐదో తరానికి చెందిన ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు తాము పుట్టి పెరిగిన జాతీయ రాజధానిలో పార్లమెంటు ఎన్నికల్లో ఓటేయడం భారత ప్రజలకు ఆసక్తికర వార్తే. ఈ పిల్లలు అప్పుడే అంత పెద్దవాళ్లు అయిపోయారా అని ఒకరంటే ఎంతముద్దుగా ఉన్నారోనంటూ ముద్దూముచ్చట చూపిన వారు మరికొందరు. ఇదే అదునుగా పోలింగ్ కేంద్రాల వద్ద మీడియా హడావిడి సరేసరి. ఓ వృద్ధురాలి వెనుక ఓటు కోసం నిల్చుని ఉన్న రేహాన్, మిరాయా ఫోటోలను తీసేందుకు- టీవీ ఛానళ్ల వాళ్లు పోటీపడ్డారు.

1970 జూన్ 19న రాహుల్ జన్మిస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత 1971 డిసెంబర్ లో ప్రియాంక జన్మించారు. ఈ ఇద్దరికీ వాళ్ల నాయనమ్మ ఇందిరా గాంధీయే పేర్లు పెట్టారు. ప్రియాంకకు రాబర్ట్ వధేరాతో 1986లో తొలిసారి పరిచయం అయింది. అప్పుడు ఆమెకు 15 ఏళ్లు. వారిద్దరికీ ఆటపాటలన్నా, కుక్కల్ని పెంచడమన్నా చాలా ఇష్టం. ఆ తర్వాతి కాలంలో వారి పరిచయం అనుబంధంగా మారింది. 1993లో ఫ్యాషన్ డిజైనర్ ఆశిష్ సోనీ ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్ లో రాబర్ట్, ప్రియాంకలు కలిసి జనం కంటబట్డారు. ఆ మర్నాడు పత్రికల్లో వీళ్ల పోటోలు సందడి చేశాయి. స్లీవ్ లెస్ నల్లటి టీ షర్టులో ప్రియాంక, వధేరాల పోటోలు ప్రచురితమయ్యాయి.


 



రాబర్ట్ వధేరాను జీవిత భాగస్వామిగా ఎంచుకున్న ప్రియాంక నిర్ణయం పలువుర్ని ఆశ్చర్య పరిచిందంటారు. రాబర్ట్ మొరాదాబాద్ కు చెందిన ఓ ఇత్తడి వ్యాపారి కుమారుడు. ఒద్దిక, అణకువగా ఉండే సిగ్గరి. 1997 ఫిబ్రవరి 18న ప్రియాంకతో వివాహం జరిగే వరకూ రాబర్ట్ ఎవరో చాలామందికి తెలియదు. కనీసం కాలేజీ చదువైనా పూర్తి చేయని రాబర్ట్ తో తన కుమార్తె పెళ్లికి ఇష్టపడడాన్ని సోనియా గాంధీ కూడా వ్యతిరేకించిందంటారు. వధేరా కుటుంబంలో కొందరికి ఆర్.ఎస్.ఎస్.తో సంబంధాలు ఉన్నట్టు కూడా చెబుతారు. తల్లి అభ్యంతరాలతో సంబంధం లేకుండా ప్రియాంక గాంధీ తన అన్న రాహుల్ మద్దతుతో వధేరాను పెళ్లి చేసుకుంది. రాబర్ట్ వధేరా బ్లాక్ మెటల్ కొయ్య, ప్లాస్టిక్ తో తయారు చేసే కాస్ట్యూమ్స్ జ్యూయలరీ వ్యాపారాన్ని నిర్వహించేవారు. ఈ పనిలో తరచూ విదేశాలకు వెళుతుంటారు. ప్రియాంకాకి కూడా ఈ కాస్ట్యూమ్స్ జ్యూయలరీ అంటే బాగా ఇష్టం.

ప్రియాంక, రాహుల్ గాంధీలు నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నాలుగో తరమైతే 2001 తర్వాత పుట్టిన ఆమె పిల్లలు ఇప్పుడు ఐదో తరం. గాంధీ, నెహ్రూ కుటుంబాల వారసులకు రాజకీయ ప్రాధాన్యత ఉంది. అందువల్లే ప్రియాంక పిల్లలు రేహాన్, మిరాయా ఓటు వేయడం కూడా విశేషమే అయింది.

రాజీవ్ తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక కుమారుడు రేహాన్ ప్రతిష్టాత్మక డూన్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. ప్రియాంక గాంధీ తన కుమారుడు రెహాన్ అడ్మిషన్ ప్రక్రియ కోసం స్వయానా రెండు సార్లు డెహ్రాడూన్‌కు వెళ్లివచ్చారు. ప్రవేశానికి ముందు పిల్లల ఇంటర్వ్యూ తప్పనిసరి కావడంతో రెహాన్ ను తీసుకుని వెళ్లారు. ఏడో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నారు. డూన్ స్కూల్లో చదివిన గాంధీ కుటుంబంలో నాల్గవ సభ్యుడు రెహాన్. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తన కుమారులు ఇద్దర్నీ- సంజయ్, రాజీవ్ గాంధీలను ఇక్కడే చదివించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని అడ్మిట్ చేశారు. ప్రియాంక కుమారుడు రెహాన్ కూడా అదే స్కూల్లో చదివించారు. ఆ తర్వాత లండన్ లో చదివారు.


 



యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ లోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (ఎస్వోఏఎస్‌)లో ఎంఏ రాజనీతి చదువుతున్న రేహాన్‌ తన చెల్లితోపాటు ఓటేసి పోలింగు కేంద్రం నుంచి బయటకు రాగానే మీడియా చుట్టుముట్టింది. ప్రశ్నల వర్షం కురిపించింది. వాటన్నింటికీ ఓపిగ్గా జవాబు ఇచ్చారు. ఓటింగ్ ప్రాధాన్యత మొదలు రాజ్యాంగ పరిరక్షణ వరకు ఆ ఇద్దరూ పిల్లలు జవాబులు చెప్పడం గమనార్హం.. ‘రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే ఈ ఎన్నికల్లో ప్రధానాంశం. అందరూ బాధ్యతగా ఓటేయాలి,’ అని రెహాన్‌ చెప్పడం భారత రాజ్యాంగంపై ఈ 23 ఏళ్ల యువకుడికి ఉన్న అవగాహనకు అద్దంపడుతోంది. తల్లి ప్రియాంక నాయనమ్మ ఇందిరాగాంధీ 1975–77 మధ్య ఎమర్జెన్సీ కాలంలో భారత రాజ్యాంగానికి సవరణల ద్వారా దానికి తూట్లు పొడిచి 1977 ఎన్నికల్లో ఓడిపోయిన విషయం రేహాన్‌ లండన్‌ యూనివర్సిటీలో చదువుకున్నాడని ఆయన మాటలు సూచిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ పదే పదే భారత సంవిధాన్‌ (రాజ్యాంగం) తమకు పవిత్ర గ్రంథమని చెబుతున్నాగాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆయన పరిపాలిస్తున్నారని, 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భారత సంవిధానాన్ని బుట్టదాఖలు చేస్తారని కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, తమ మేనమామ రాహుల్, అమ్మమ్మ సోనియా, తల్లి ప్రియాంక చేస్తున్న హెచ్చరికలు రేహాన్‌ బుర్రకెక్కినట్టు కనిపిస్తున్నాయి.

అన్నా చెల్లెళ్లు రేహాన్, మిరాయా ఇద్దరు చాలా నమ్రతతో మీడియా ముందు వ్యవహరించారు. ఎక్కడా తొణుకు బెణుకు లేకుండా నింపాదిగా సమాధానాలు ఇచ్చారు. ఇద్దరికీ భారతీయ రాజకీయాలపై బాగానే అవగాహన ఉన్నట్టు కనిపిస్తోందని వారి మాటల్ని విన్న రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మీడియా ఎదుట కనిపించడం వారికిదే తొలిసారి.

Tags:    

Similar News