యుద్ధం తర్వాత వియత్నాం ఎలా వికసించిందంటే...
ఓ పర్యాటకుడి అనుభవం ఇలా;
By : The Federal
Update: 2025-05-05 15:09 GMT
"వియత్నాం వీరోచిత గాధను కళ్లారా చూశా. వియత్నాంతో సరితూగగల పోరాటం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఆ వీరోచిత ఉద్యమం స్ఫూర్తిదాయకం" అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ప్రపంచ వ్యాప్తంగా నేడు వియత్నాం ప్రభుత్వం ఒక్కటే ఏకైక కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంగా విరాజిల్లుతోందని, విద్యా, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఎంతో విశిష్టత సాధించిందని అన్నారు. "నాడు అగ్రరాజ్య అమెరికా దేశాన్ని యుద్ధంలో తరిమికొట్టి.. ఒక చరిత్రగా వియత్నాం నిలిచింది.. అపారంగా నష్టపోయినా అమెరికా నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోంది" అన్నారు రామకృష్ణ. వియత్నం పునరేకీకరణ దినోత్సవ 50వ వార్షికోత్సవ వేడుకల్ని ప్రత్యక్షంగా చూసి వచ్చిన ఆయన మే 5న కారల్ మార్క్స్ జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో తన స్వీయానుభవాలను వివరించారు. ఈ వేడుకల్లో సీపీఐ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు.
"వియత్నం పోరాట పటిమను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంది. తన విద్యార్థి దశ నుంచే ‘మేరా నామ్.. తేరా నామ్ వియత్నాం.. వియత్నాం’ అనే నినాదం బలంగా మనస్సులో నాటుకుపోయింది. ప్రపంచంలో ఎన్నో సంపన్న, పేద, పెద్ద దేశాలున్నప్పటికీ.. వాటిన్నికంటే.. మిన్నగా త్యాగం చేసిన వియత్నం లాంటి దేశం మరొకటి లేదు. వియత్నాంలోని హోచ్మిన్ సిటీలో జరిగిన వేడుకల్లో భాగంగా వివిధ దేశాల కమ్యూనిస్టు నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. అక్కడ ప్రదర్శించిన వీర వియత్నాం చిత్రాలు నన్ను అబ్బురపరిచాయి. ఇంతటి త్యాగం ఎలా చేయగలిగారు అని విస్తుపోయాను" అని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.
ఈ వేడుకల్లో ప్రధానంగా శాంతి, ఐక్యత, జాతీయ అభివృద్ధి అంశాలు ప్రధానంగా ప్రతిధ్వనించాయని అన్నారు. "వీర వియత్నాం కమ్యనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తో లామ్‌తోపాటు అక్కడి పార్టీ నేతలు చూపిన ఆత్మీయత మరువలేనిది. ఈ పర్యటనలో మొదటగా ఏప్రిల్ 29న ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షులు పల్లబ్‌సేన్ గుప్తాతో కలిసి వార్ మ్యూజియాన్ని సందర్శించా. అక్కడ వియత్నాం యుద్ధ సంఘటనలు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. అమెరికా దేశం ఆకాశం నుంచి ప్రయోగించిన రసాయనిక ఆయుధాల ఫోటోలను ఉంచారు.
అమెరికా వియత్నాంపై యుద్ధానికి దిగినపుడు వియత్నాం జనాభా 10 కోట్ల మంది. అటువంటి చిన్నదేశాన్ని ఆక్రమించుకునేందుకు అమెరికా చేయని దుర్మార్గం లేదు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశం 50 లక్షల టన్నుల బాంబులను, కొరియన్ యుద్ధంలో 26లక్షల టన్నులు వినియోగించగా.. ఒక్క వియత్నం యుద్ధంలోనే ఏకంగా 1 కోటి 43 లక్షల టన్నుల బాంబులను అత్యధికంగా వినియోగించింది. ప్రపంచ యుద్ధంలో వేసిన బాంబుల కంటే..మూడు రెట్లుగా వియత్నం యుద్ధానికి అమెరికా ఉపయోగించింది.
ప్రపంచ యుద్ధం 3 సంవత్సరాల 20 నెలలు జరిగితే వియత్నాం యుద్ధం 17 సంవత్సరాల 2 నెలలపాటు కొనసాగింది. వియత్నాం అమెరికా యుద్ధంలో 30లక్షల మంది చనిపోయారు. 20లక్షల మంది క్షతగాత్రులయ్యారు. 3లక్షల మంది ఆచూకీ లేకుండా పోయారు. వెరసి మొత్తంగా 53లక్షల మంది యుద్ధబాధితులు. ఈ మొత్తానికి కారణం అమెరికా. ఆ యుద్ధం వినాశనం సృష్టించింది. కనీసం తాగేందుకు మంచినీరు లేని దేశంగా వియత్నాంను మిగిల్చింది. అటువంటి విపత్తు నుంచి కోలుకుని నేడు వియత్నాం పురోగమిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతోంది. ఇప్పుడక్కడ చూస్తుంటే అసలక్కడ యుద్ధం జరిగిందా? అనే సందేహం వస్తుంది. అంతగా వియత్నాం అభివృద్ధి సాధించింది" అని రామకృష్ణ అబ్బరపడ్డారు.
అమెరికాలోని లాస్‌ఏంజిల్స్, డల్లాస్ తదితర నగరాలకు దీటుగా వియత్నాం దేశ రాజధాని హనోయ్ సిటీ అభివృద్ధి చెందిందన్నారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ సభల్లో మొదటగా ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత మేజర్ జనరల్, యూత్ లీడర్‌కు అవకాశం ఇస్తారని చెప్పారు. దీని ఆధారంగా వియత్నాంలో యూత్‌కు, మహిళలకు పెద్దపీట వేస్తారని, లీడర్లకు, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులకు, మాజీ జనరల్ సెక్రటరీలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. వారి ప్రసంగాల్లో గెరిల్లా నాయకుల ప్రస్తావన కూడా ఉంటుందన్నారు. ఈ పోరాటంలో భాగంగా అమెరికాకు చెందిన 59 లక్షల మంది సైన్యాన్ని వియత్నాం మట్టి కరిపించిందని, అమెరికా యుద్ధంలోకి దిగి పారిపోయిన దేశాల్లో వియత్నాం ఒకటని అన్నారు. వియత్నాం రిపోర్టులో...‘వియత్నాం దేశ ప్రజలు, దేశ కమ్యూనిస్టు పార్టీ, ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేకవాదుల మద్దతు, అమెరికాలోని మానవతా హృదయం గల మేధావులు’...వాళ్లందరి సహకారంతో యుద్ధంలో విజేతలుగా నిలిచాం’ అని నివేదించారని రామకృష్ణ వివరించారు.
చైనా తరహానే వియత్నాం అభివృద్ధి చెందిందని, ఇందుకు ఉదాహరణగా..30 ఏళ్ల క్రితం దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) 70శాతం మంది ఉండగా...ప్రస్తుతం 1.9శాతమే బీపీఎల్‌లో ఉన్నారని చెప్పారు. ఆ దేశంలో అందరు చదువుకుంటున్నారని, సంస్కృతి, సంప్రదాయాలు గొప్పగా ఉన్నాయని, అక్కడ ఒక్క కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం తప్ప, మరే పార్టీ లేదన్నారు. దేశభక్తి చాలా ఎక్కువన్నారు. వియత్నాం ప్రభుత్వ గొప్ప విధానాల్ని ఒక్క కమ్యూనిస్టులే కాకుండా, కమ్యూనిస్టేతరులూ కొనియాడతారని వివరించారు. వియత్నాం వేడుకలకు చైనా, అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియాలోని సీపీఐ నుంచి తాను ఈ వేడుకలకు హాజరైనట్లు రామకృష్ణ చెప్పారు.