పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి కూలినట్లేనా!

పశ్చిమ బెంగాల్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ. కూటమికీ ఇప్పటికీ సిద్ధమే అంటున్న కాంగ్రెస్.

Update: 2024-03-03 08:25 GMT
Source: Twitter

షణ్ముఖ పోచరాజు



బీజేపీని పవర్ నుంచి తొలగించడమే లక్ష్యంగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా అన్ని మార్గాలను కలియచూస్తూ దశాబ్దాలుగా వివాదాలు ఉన్న పార్టీలతో కూడా పొత్తు పెట్టుకుంటూ ‘ఇండియా’ కూటమికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిశాయి. కాంగ్రెస్‌తో చేతులు కలిపి 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని నిశ్చయించుకున్నాయి. కానీ కూటమి తొలినాళ్లలో అంతా చక్కగానే నడిచినా కొంత కాలంగా ఇండియా కూటమి పార్టీల మధ్య మనస్పర్థలు, విభేదాలు రాజుకుంటున్నాయి. గతేడాది తెలంగాణ సహా ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య విభేధాలు నెలకొన్నాయి. వాటిని ఇటీవల పరిష్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లో కూటమిని కొనసాగించడానికి ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కొన్ని షరతులతో ఓకే చెప్పారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం కూటమి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.

అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం: మమత

పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ఎంపీ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తన అభ్యర్థులను బరిలోకి దించుతుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని మమతా వెల్లడించారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి కూలిపోయిందని అర్థమవుతోంది. దాంతో పాటుగా గతంలో కూడా కాంగ్రెస్‌పై టీఎంసీ సుప్రీం మమతా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం 40 స్థానాల్లో కూడా విజయం సాధించలేదని, పశ్చిమ బెంగాల్‌లో అయితే ఒక్క లోక్‌సభ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడదని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరి పోరాటం చేసిన తన సత్తా, తమపై ప్రజలకు ఉన్న ఆదరణను నిరూపించుకుంటుందని మమతా స్పష్టం చేశారు.

ఇప్పటికీ సంధికి ఓకే: కాంగ్రెస్

ఇండియా కూటమితో తాము విడిపోతున్నట్లు టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీ చెప్పకనే చెప్పారు. కానీ టీఎంసీతో పొత్తుకు కాంగ్రెస్ తలుపులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, రెండు పార్టీల మధ్య ఇప్పటికీ సంధి సాధ్యమేనని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. పాట్నాలో ప్రతిపక్షాల ర్యాలీ చేస్తున్న క్రమంలో టీఎంసీ, కాంగ్రెస్ పొత్తును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మమతా బెనర్జీ ఇప్పటికీ తాను ఇండియా కూటమిలో భాగస్వామినే అని, బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని చెప్పిన ప్రతిసారి ఆమె మాటలను మేము నమ్ముతాం. అందుకే జనరల్ ఎన్నికల్లో పొత్తు కోసం టీఎంసీకి కాంగ్రెస్ తలుపులు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. 42 స్థానాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని కేవలం మమతా చెప్పారు. మా దృష్టిలో స్థానాల కేటాయింపులపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరి క్షణం వరకు పొత్తు విషయంలో తుది నిర్ణయం చెప్పలేం’’అని వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌లో కూడా కాంగ్రెస్‌కు షరతులు తప్పవా!

ఇండియా కూటమి విషయంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. తాము కూటమి నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అఖిలేష్ వెల్లడించారు. కానీ ఆఖరి నిమిషంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న కేవలం 17 స్థానాల్లోనే కాంగ్రెస్ పోటీ చేయాలని, అప్పుడే తాము కూటమిలో ఉంటామని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తమ మద్దతు ఇస్తామని అఖిలేష్ యాదవ్ షరతులు పెట్టారు. వాటికి కాంగ్రెస్ కూడా తలొంచి పొత్తును నిలబెట్టుకుంది. కాగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు షరతులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు మాత్రమే కేటాయించాలని టీఎంసీ భావిస్తుందో, అందుకు కాంగ్రెస్ ఓకే చెప్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News