CSDS సర్వే : ఈ ఎన్నికల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగమే ప్రధాన సమస్యలు

రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం.. లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా? సర్వేలో తేలిందేమిటి?

Update: 2024-04-12 11:17 GMT

పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం దేశంలోని ఓటర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) నిర్వహించిన ప్రీ-పోల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

సర్వే ప్రకారం.. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో సహా జనాభాలో 62% మంది ఉపాధి దొరకడం పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. 65% మంది పురుషులు, 59% మహిళలు ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం 12% మంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు.

ఉద్యోగాల లభ్యత విషయానికొస్తే.. 67% ముస్లింలు, 63% ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు)లలోని ముస్లింలు , 59% షెడ్యూల్డ్ తెగల(ST)లో ఇదే ఆందోళన వెల్లడైంది. ఉద్యోగ సముపార్జన కష్టమని ఉన్నత కులాలకు చెందిన 57% మంది భావించారని, కేవలం 17% మంది మాత్రమే సులువని చెప్పారని సర్వే వెల్లడించింది.

ఉద్యోగాల కొరతకు ఎవరు కారణం అని అడిగినపుడు 21% మంది కేంద్ర ప్రభుత్వాన్ని, 17% మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేశారు. 57% మంది రెండింటిని బాధ్యులు చేశారు.

ILO నివేదిక..

CSDS-Lokniti పోల్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) నివేదికకు దగ్గరగా ఉంది. దేశంలో ఉన్న 80% నిరుద్యోగుల్లో యువతే ఎక్కువగా ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఉన్న నిరుద్యోగులు డిగ్రీ దాకా చదువుకున్న వారే. 2022లో ఉపాధి, విద్య లేదా శిక్షణలో నిమగ్నమవ్వని మహిళలు, పురుషులతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అధికంగా ఉన్నారు (48.4% మరియు 9.8%).

ద్రవ్యోల్బణం - కష్టాలు..

ద్రవ్యోల్బణం విషయానికొస్తే.. 26% మంది కేంద్రం, 12% రాష్ట్రం, 56% రెండూ కారణమని CSDS పోల్ వెల్లడించింది.

నిత్యావసరాల ధరల పెరుగుదల తమ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని చాలా మంది ఓటర్లు చెప్పారు. పెరుగుతున్న ఖర్చులు ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వారు (76%), ముస్లింలు (76%), షెడ్యూల్డ్ కులాలు (75%) ప్రభావితం చేశాయని సర్వే పేర్కొంది.

జీవనం- నాణ్యత..

జీవన నాణ్యతను గమనిస్తే ..48 శాతం మంది మెరుగుపడిందని చెప్పారు. 36% మంది ప్రజలు కేవలం తమ అవసరాలను తీర్చుకోగలుగుతున్నామని చెప్పారు. సర్వే ప్రకారం 55% మంది గత ఐదేళ్లలో అవినీతి పెరిగిందని, ఇందులో 25% మంది కేంద్రం, 16% రాష్ట్రానికి ఆపాదించారు.

Lokniti-CSDS ప్రీ-పోల్ సర్వే - 2024 19 రాష్ట్రాలలో 10,019 మంది వ్యక్తుల అభిప్రాయాలను సేకరించింది. 100 పార్లమెంట్‌ నియోజకవర్గాలు 100 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 400 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ సర్వే నిర్వహించారు.

Tags:    

Similar News