మిగ్‌జామ్ బాధితులకు జగన్ ఓదార్పు
ఎన్నికలకు ముందు ఓదార్పులు మొదలయ్యాయి. ఓపక్క ముఖ్యమంత్రి జగన్, మరోపక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓదార్పు యాత్రలు చేపట్టారు.
Byline : The Federal
Update: 2023-12-08 03:41 GMT
ఎన్నికలకు ముందు ఓదార్పులు మొదలయ్యాయి. ఓపక్క ముఖ్యమంత్రి జగన్, మరోపక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓదార్పు యాత్రలు చేపట్టారు. కోస్తాంధ్రను అతలాకుతలం చేసిన మిగ్‌జామ్ తుపాను బాధితులకు పరామర్శలు వెల్లువెత్తనున్నాయి.
జగన్ టూర్ ఇలా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం మిగ్‌జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం చేరుకుంటారు. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్తులు, తుపాను బాధితులతో నేరుగా సమావేశమవుతారు జగన్. బాధితులతో నేరుగా మాట్లాడి వారికి భరోసా ఇవ్వనున్నారు.
మరుప్రోలువారిపాలెం రైతులతో భేటీ
ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలిస్తారు. స్థానిక రైతులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. తీరం దాటిన తర్వాత కూడా అది ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికి వస్తున్న దశలో పంట నష్టం జరిగింది. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై విరుచుకుపడిన తుపాను వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. జగన్ పర్యటనలో పంట నష్టాన్ని పరిశీలిస్తారు. రైతులకు భరోసా ఇస్తారు.
చంద్రబాబు టూరు ఇలా...
మిగ్‌జామ్ తుపాన్ దాటికి విలవిల్లాడిన పలు జిల్లాల్లో ఆయన పర్యటించన్నారు. రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు.. పంట నష్టపోయిన రైతులను, వరద బాధితులను పరామర్శించనున్నారు.
ప్రకాశం, గుంటూరు జిల్లాలో...
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. నేడు పొన్నూరు, వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.
బాపట్లలో పర్యటన తర్వాత ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించి పంట పొలాలను చంద్రబాబు పరిశీలిస్తారు.