హైదరాబాద్‌ చేరుకున్న జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

జార్ఖండ్‌లో రాజకీయం వేడెక్కింది. జేఎంఎం కూటమి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో భాగంగా వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలించింది.

Update: 2024-02-02 13:00 GMT

జార్ఖండ్‌ గత ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భూకుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించాడని ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపయీ సోరెన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే చంపయీ 10 రోజుల్లోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

హైదరాబాద్‌కు ఎమ్మెల్యేల తరలింపు..

బలపరీక్ష నేపథ్యంలో సంకీర్ణ కూటమి తమ సభ్యులను కాపాడుకునేందుకు సిద్ధమైంది. కొంతమంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వాస్తవానికి గురువారమే వీరు హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం 38 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇంకొందరు జార్ఖండ్‌లో ఉండిపోయారు.

‘‘అసెంబ్లీలో బల నిరూపణకు మాకు 10 రోజుల సమయం ఇచ్చారు. ఈ లోగా బీజేపీ మా ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అందుకే మేం హైదరాబాద్‌కు వచ్చాం’’ అని జేఎంఎం సీనియర్‌ లీడర్‌ ఒకరు చెప్పారు.

మాజిక్‌ ఫిగర్‌ ` 43..

జార్ఖండ్‌ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య  - 81. మాజిక్‌ ఫిగర్‌ - 43.

జేఎంఎం కూటమిలో సభ్యులు - 47 (జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జేడీ,సీపీఐ (ఎంఎల్‌) ఎన్‌సీపీ). అసెంబ్లీలో పార్టీల వారీగా శాసనసభ్యులు సంఖ్యను పరిశీలిస్తే.. జేఎంఎం - 29, కాంగ్రెస్‌- 17, ఆర్‌జేడీ -1, బీజేపీ - 26, ఏఎస్‌జేయూ - 3, ఎన్‌సీపీ -1, సీపీఐ (ఎంఎల్‌) - 1, ఇండిపెండెంట్లు - 2 ఉన్నారు.

Tags:    

Similar News