కమల్ నాథ్ చూపు కమలం వైపు? మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి షాక్..

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో పెనుసంచలనం నమోదు కానుందా? మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్ ను వీడి, కమలంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

Update: 2024-02-17 14:23 GMT

మధ్యప్రదేశ్ లో గత మూడు పర్యాయాలుగా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడింది. అయితే మధ్యలో ఒకసారి కమలదళానికి షాకిచ్చి కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన కమల్ నాథ్ తరువాత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఆ పదవి మూన్నాళ్లు ముచ్చటే అయినా గత మూడు దశాబ్ధాలుగా ఆయన గాంధీ కుటుంబానికి విధేయుడిగానే ఉంటున్నారు. అయితే ఉన్నట్లుండి ఆయన పార్టీ మారతున్నారనే ప్రచారం ఢిల్లీ సర్కిల్ లో జరుగుతోంది. ముఖ్యంగా ఆయన కుమారుడు నకుల్ నాథ్ తన సామాజిక మాధ్యమం నుంచి కాంగ్రెస్ ఎంపీ లో ని కాంగ్రెస్ అనే పేరును తొలగించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

బీజేపీలోకి వెళ్తున్నారనే ఊహగానాలపై మధ్య ఈ కాంగ్రెస్ నేత మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అయితే పార్టీ మారే అంశం ఏదైనా ఉంటే ముందుగా మీడియాకే చెప్తానని అన్నారు.

ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.." ఈ నిర్ణయం పై ఆవేశపడొద్దు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అయితే పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం నన్ను అసంతృప్తికి గురి చేశాయి" అని చెప్పారు.

" మీరు బీజేపీలో చేరుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అలాంటి ఏదైనా ఉంటే నేను ముందుగా మీకే( మీడియా) కు తెలియజేస్తా" అన్నారు. అయితే ఇటు వైపో, అటువైపో ఉత్సాహంగా లేను. ఏదైన ఉంటే మాత్రం తప్పకుండా తెలియజేస్తా నని వెళ్లిపోయారు. కమల్ నాథ్ ఢిల్లీకి రావడానికి కంటే ముందు తన సొంత నియోజకవర్గమైన చింధ్వారా లో పర్యటిస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి ఆయన తొమ్మిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. 2019 లో మధ్యప్రదేశ్ లోని అన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించినప్పటికీ చింధ్వారా లో మాత్రం తన కొడుకు నకుల్ నాథ్ గెలుపించుకోగలిగాడు.

కమల్ నాథ్ బీజేపీలో వెళ్లవచ్చనే ఊహగానాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. " నేను నిన్న రాత్రి 10.30 కి కమల్ నాథ్ తో మాట్లాడాను. తను చింధ్వారా పర్యటనలో ఉన్నారు. ఇందిరాగాంధీని జనతా పార్టీ జైలు కు పంపినప్పుడు రాజకీయ యాత్రను ప్రారంభించి నెహ్రూ- గాంధీ కుటుంబానికి తన మద్ధతును ప్రకటించిన నాయకుడు కమల్.. అలాంటి వ్యక్తి పార్టీని విడిచిపోతారనుకుంటే మీరేలా నమ్ముతున్నారు. " అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 66 సీట్లలో మాత్రమే విజయకేతనం ఎగురవేసింది. దాంతో ఆయన పలుకుబడి అధిష్టానం దగ్గర తగ్గిపోయింది. అందులో భాగంగానే కమల్ నాథ్ కు రాజ్యసభ సభ్యత్వం కూడా పార్టీ ఇవ్వడానికి నిరాకరించింది. రాహూల్ గాంధీ కోటరి కూడా కమల్ నాథ్ ను వ్యతిరేకిస్తోంది. ఈ నేఫథ్యంలో తను, తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరే ప్రయత్నాలు కమల్ నాథ్ చేస్తున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. వీటిని ఆయన ఇప్పటి వరకూ ఖండించకపోవడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో యువ నేత జ్యోతిరాధిత్య సింథియా కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ కమల్ నాథ్ ను సీఎంగా ప్రకటించింది. కొన్ని రోజుల తరువాత సింధియా తన అనుచరులతో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు కమల్ నాథ్ కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News