కరువు సాయం కోసం ‘సుప్రీం’తలుపు తట్టిన కర్ణాటక
లోక్ సభ ఎన్నికల వేళ.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు చట్టబద్దంగా రావాల్సిన నిధులను కేంద్రం మంజూరు చేయడం లేదంటూ కోర్టు మెట్లెక్కారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి కరువు సాయాన్ని విడుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టు తలుపుతట్టింది కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం.
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. లోక్‌సభ ఎన్నికల వేళ.. కర్నాటక ఆవేదనను కేంద్రానికి ఎత్తిచూపడం, బీజేపీ ఎంపీల నిర్లక్ష్యాన్ని బయటపెట్టడం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యూహంలో భాగంగా చెప్పుకోవాలి.
కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రధాన అంశాలు పన్నుల పంపిణీ, కేంద్ర నిధుల విడుదలలో జాప్యాన్ని విమర్శిస్తూ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. వారితో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
‘‘రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు? రాష్ట్రవ్యాప్తంగా కరువు పీడిత ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం ఎంపీల కర్తవ్యం. కాని వారు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.’ అని సిద్ధరామయ్య క్యాబినెట్‌లోని పేరు చెప్పడానికి ఇష్టపడని మంత్రి ఒకరు ఫెడరల్‌తో అన్నారు.
స్పందన లేకపోవడంతో సుప్రీంకు..
“కేంద్రం నుంచి పరిహారం కోసం వేచిచూశాం. స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం హక్కును వినియోగించుకున్నాం. రాష్ట్రానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులు వెంటనే విడుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాం. మా వాటా ఇస్తారని ఐదు నెలల పాటు ఎదురుచూశాం. మాకు వేరే మార్గం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ”అని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సిఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కరువు, ప్రకృతి వైపరీత్యాల సంభవించినపుడు, జనాన్ని ఆదుకునేందుకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని రూపొందించారు. కానీ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేకపోయిందని పిటిషన్ వాదించింది. కర్ణాటక రాష్ట్రంలోని 240 తాలూకాలలో 223 తాలూకాలను కరువుగా ప్రకటించారు. కరువు కారణంగా 48 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు నష్టపోయాయని, కేంద్రం ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు లేఖలు రాసింది.
మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రూ. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి NDRF నుంచి 18,171.44 కోట్లు. కరువు పరిస్థితుల నిర్వహణకు రాష్ట్రానికి రూ.35,162.05 కోట్లు అవసరమని తేల్చారు.
15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ. 6,764 కోట్లు కర్ణాటకతో సహా మూడు రాష్ట్రాలకు కేటాయించారు. అయితే నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సిఫార్సులను ఆమోదించడానికి నిరాకరించింది.
ఎన్నికల వ్యూహం..
ఎన్నికల వ్యూహంలో భాగంగా.. కర్ణాటక పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న అసమానతలను ఎత్తి చూపాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటక పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కర్ణాటక కాంగ్రెస్ ప్రచార కమిటీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. మోడీ ప్రభుత్వం కర్ణాటక అవసరాలను విస్మరించి, రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని హోర్డింగ్‌లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు వెలిశాయి. కర్ణాటక ప్రయోజనాలను కాపాడటంలో 25 మంది బీజేపీ ఎంపీలున్నా ప్రయోజనం లేదంటూ హైలైట్ చేస్తున్నారు.
బీజేపీ ఏమంటోంది..
సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర సమస్యలను రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం విమర్శిస్తోంది. కాంగ్రెస్ ఎత్తుగడ రాజకీయ ప్రేరేపితమని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ అన్నారు. “బీజేపీ ప్రభుత్వం గతంలో కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. కానీ కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ఖజానా నుంచి ఉపశమనం కల్పించింది. కరువు సాయంపై ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 7న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో కేంద్రం నుంచి గ్రాంట్‌లు రాకపోవడం, పన్నుల పంపిణీలో అసమానతలను ఎత్తిచూపిన విషయం తెలిసిందే.