‘కుంభమేళా రాజ్యాంగం’ రాబోతున్నది, జాగ్రత్త

అలహాబాద్ లో ఇప్పటికే కుంభమేళా రాజ్యాంగం తయారైంది, 2024 ఎన్నికల తరువాత దానికి మద్దతు లభిస్తే అది అమలులోకి వస్తుంది. ఫ్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరిక

Update: 2024-01-25 11:19 GMT

-అలూరు రాఘవశర్మ 


తిరుపతి: ఇస్లామిక్ దేశాలలో వలే మన దేశంలోనూ మత విలువల ఆధారంగా సరికొత్త ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాబోతోందని పౌరహక్కుల నేత, సామాజిక శాస్త్రాల విశ్లేషకులు ప్రొఫెసర్ జి. హరగోపాల్ హెచ్చరించారు.
అలహాబాద్ లో ఇప్పటికే కుంభమేళా రాజ్యాంగం తయారైందని, 2024 ఎన్నికల తరువాత దానికి మద్దతు లభిస్తే అది అమలులోకి వస్తుందని అన్నారు.
తిరుపతిలోని ఎస్వీ యూనిర్సిటీ సెనెట్ హాల్ లో ‘రాజ్యాంగం-నైతికత’ అన్నఅంశంపై పౌరచైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆ వేదిక గౌరవాధ్యక్షులు రాఘవ శర్మ అధ్యక్షతన సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ, రాజ్యాంగ సభలో 1949లో జరిగిన చర్చ సందర్భంగా, ఈ రాజ్యాంగం మన సంస్కృతి కి సంబందిం చింది కాదని, ఇది చీలికలు పేలికల రాజ్యాంగమని, పాశ్చాత్య విలువలు కలదని, కాదని కొందరు ఆనాడే విమర్శించారన్నారు.
ఆనాడు అలా విమర్శించిన వారే ఈనాడు కుంభమేళాలో సర్వసంగ పరిత్యాగులైన సాధువులు తయారు చేసిన రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు.
ఇస్లాంలో కానీ, క్రైస్తవంలో కానీ ఒకే దేవుడు, ఒకే తాత్విక చింతన కనుక ఇస్లామిక్ దేశాల్లో మత విలువల ప్రాతిపదికన రాజ్యాంగం అమలవుతోందనన్నారు.
హిందూ మతంలో ఆరు తాత్విక చింతనలున్నాయని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేవుడని, ఏ దేవుడిని ఆధారం చేసుకుని, ఏ తాత్వికత చింతనను ఆధారం చేసుకుని మత రాజ్యాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందని ప్రశ్నించారు.



 


హిందూ మతం నుంచి కొన్ని విలువలతో రాజ్యాంగాన్ని తయారు చేయాలని కొందరుప్రయత్నం చేయగా, అంబేద్కర్ దాని మూలాలను ప్రశ్నించారని గుర్తు చేశారు.
ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు సమానత్వాన్ని అంగీకరించరని, సమానత్వం అంటే ఎదగడానికి ప్రతి మనిషికీ సమాన అవకాశాలు కల్పించడమేనని నిర్వచించారు.
మహిళల హక్కులను ఏ ఒక్క మతం అంగీకరించదని, ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారు ముందుకు రావడంతో, పరిమితమైన హక్కులున్నప్పటికీ ఈరాజ్యాంగాన్ని సమర్థించాల్సి వస్తోందని అన్నారు.




 


ఈ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమాజం కంటే ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవలసిన సమయంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని హరగోపాల్ వివరించారు.
రాజ్యాంగం పైన ఎస్వీ యూనిర్సిటీలో లో చర్చ జరగడం చాల సంతోషకరమైన విషయమని, ఉత్తర భారత దేశంలోని విశ్వవిద్యాలయాల్లో రాజ్యాంగంపైన చర్చ జరగడం దాదాపు అసాధ్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో దాదాపు 70కి పైగా కేంద్ర విశ్వవిద్యాలయలున్నప్పటికీ, ఏ ఒక్క విశ్వవిదాయలయంలోనూ చర్చకు తనను పిలవడం లేదని అన్నారు.
ఒక వేళ చర్చకు తనను పిలిచినా చివరలో నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని కేంద్ర విశ్వవిద్యాలయంలో ’ప్రజాస్వామ్య భవిష్యత్తు’ అన్న అంశంపై విద్యార్థులు ఏర్పాటు చేసిన సదస్సుకు తనను పిలిచారని, తీరా వెళ్ళే సరికి గేట్లు మూసేశారని, రిజిస్త్రార్ వచ్చి సదస్సుకు అనుమతి లేదని, రేపు పెట్టుకోండని చెప్పారని తెలిపారు.
పై నుంచి ఆదేశాలు వస్తే వీసీ, రిజిస్ట్రార్ మాత్రం ఏంచేస్తారని అన్నారు.
రాజస్తాన్ వైస్ చాన్సలర్ తనకు మిత్రుడైనప్పటికీ, తనను పిలిస్తే గొడవవుతుందని మాట్లాడనివ్వలేదని వివరించారు.
రాజ్యాంగంలో ఏం రాశారన్నది కాదని, వాస్తవ పరిస్థతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగం నైతికత మధ్య ఘర్షణ జరుగుతోందని గుర్తుచేశారు.
రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఇచ్చారంటే, ఆ హక్కును వెనక్కి తీసుకునే హక్కు కూడా దానికి ఉంటుందన్నారు.
మనిషి సహజంగా మాట్లాడతాడని, మాట్లాడే హక్కును మరొకరు ఇవ్వడమేమిటని హరగోపాల్ ప్రశ్నించారు.
మతాన్ని రాజకీయాలలోకి తీసుకురావడం వల్ల రాజ్యాంగ నైతికత దెబ్బతింటుందని అన్నారు.
రాజ్యాంగ విలువలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని అంటూ రాజ్యాంగాన్ని చదవండని పిలుపునిచ్చారు.
మానవ సంబంధాలను పునరుద్ధరించవలసిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో ఈనాటి సమాజానికి కావలసిన నైతికత ఉందని, మనకు సమానమైన న్యాయం జరిగేలా రాజ్యాంగ పీఠిక రాశారని అన్నారు. భారతీయుడు ఎలా ఉండాలో చూపిన రాజ్యాంగంలో పౌరుడి హక్కులే కాకుండా బాధ్యతలు కూడా పేర్కొన్నారని తెలిపారు. హరగోపాల్ భావజాలంతో తనకు ఏకీభావం లేకపోయినా, వారు మాట్లాడే విధానం, విశ్లేషించే విధానం, సమస్యను చెప్పే విధానం చాలా బాగుంటుందని, వారిక్కడికి రావడం తమ విశ్వవిద్యాలయం చేసుకున్న పుణ్యమని కొనియాడారు. మానవ విలువలు కాలానుగుణంగా మారుతుంటాయని, ప్రాంతంతో పాటు కాలం కూడా వాటిని నిర్దేశిస్తుందని అన్నారు. పౌరచైతన్యవేదిక లక్ష్యాలను, కర్తవ్యాలను వేదిక ప్రధాన కార్యదర్శి కుమార్ రెడ్డి వివరించారు. వేదిక కోశాధికారి హరీష్ స్వాగతం పలికిన సభకు అధ్యక్షులు వాకా ప్రసాద్ వందనసమర్పణ చేశారు.


Tags:    

Similar News