TRUMP-H-1b| ట్రంప్ బృందంలో మిల్లర్, H-1B వీసాదారుల్లో గుండె దడ

మిల్లర్ నియామకంతో వేలాది మంది భారతీయ విద్యార్థులు, H-1B వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారు హడలెత్తుతున్నారు.

Update: 2024-11-15 07:33 GMT
Image- Statue of Liberty with Us map
"మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" (MAGA) నినాదంతో విజయఢంకా మోగించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విధేయులు, మాగా ప్రచారకులు వైట్ హౌస్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది "మాగా" మద్దతుదారులు ట్రంప్ ట్రూప్ లో చేరారు. తాజాగా ఇమ్మిగ్రేషన్ హార్డ్‌లైనర్, ట్రంప్ సన్నిహితుడు స్టీఫెన్ మిల్లర్‌ (STEPHEN MILLER) వైట్‌హౌస్ పాలసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. మిల్లర్ నియామకాన్ని ధృవీకరిస్తూ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇన్‌కమింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను అభినందించారు. ట్రంప్ చేసిన "మరో అద్భుతమైన ఎంపిక"గా అభివర్ణించారు. ట్రంప్ బృందంలో ఎక్కువ మంది కరుడుగట్టిన జాతీయవాదులే కావడం గమనార్హం. వీరి రాకతో ఇప్పుడు H-1B వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజానికి మిల్లర్ గతంలో కూడా ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో ఒకరు. ట్రంప్ కి ఉపన్యాసాలు రాసిచ్చేవారిలో ప్రముఖులు. ముస్లింల రాకపోకలపై నిషేధం ఉండాలని గట్టిగా వాదించే వారిలో మిల్లర్ ఒకరు. 2018 నాటి కుటుంబ విభజన విధానాన్ని (2018 family separation policy) తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.

మిల్లర్ మంచి మాటకారి కూడా. ట్రంప్ ఉపన్యాసాలలో అప్పుడప్పుడు ఆయన చతురోక్తులను ఈయనే చేరుస్తుంటాడు. "అమెరికా అమెరికన్లకు మాత్రమే దక్కాలి", "నిజమైన అమెరికన్ల కోసం అమెరికాను పునరుద్దరించాలి" అనేది ఆయన నినాదం. ట్రంప్ కూడా దాదాపు ఇదే విషయాన్ని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకారం ట్రంప్ తిరిగి ఎన్నికైనట్లయితే చట్టపరమైన, అక్రమ వలసలను నియంత్రించే విధానాలను తీసుకువస్తుందని మిల్లెర్ చెప్పారు. బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న వారిని, సరైన పత్రాలు లేని వలసదారులను క్యాంపుల్లో నిర్బంధించే ప్లాన్ కూడా ఉందన్నారు మిల్లర్.
మిల్లర్ నియామకంతో వేలాది మంది భారతీయ విద్యార్థులు, H-1B వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారు హడలెత్తుతున్నారు. స్టూడెంట్ వీసాల మీద అమెరికాలో చదువు కోసం వెళ్లిన వాళ్లు తమ వీసా గడువు ముగిసిన వెంటనే స్వదేశాలకు వెళ్లిపోవాలన్న నిబంధన ఉంది. ఈ వీసా గడువు ముగిసే లోగా ఎక్కడో చోట H-1B వీసా అంటే వర్క్ పర్మిట్ వీసా సంపాయించుకుంటే సరేసరి, లేకుంటే వెళ్లిపోవాలి. అయితే కొందరు స్టూడెంట్ వీసా గడువు ముగిసినా మరో విద్యాసంస్థలో చేరడమో లేక ఏదైనా మ్యాన్ పవర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఉండడమో చేస్తుంటారు. ఇకపై ఇలాంటివి కుదరదు అనేది మిల్లర్ విధానం. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు మిల్లర్- మాస్టర్స్ లేదా బ్యాచ్లర్ డిగ్రీ ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు కనీసం పదేళ్లపాటు అమెరికాలో హెచ్-1బీ వీసాపై పని చేయకుండా నిషేధించే- Cruz-Sessions bill- ముసాయిదాను మిల్లర్ తయారు చేశారు.
ఇప్పుడు ట్రంప్ మళ్లీ గెలిచారు. ట్రంప్ విధాన నిర్ణేతల్లో ఒకరిగా మిల్లర్ నియమితులయ్యారు. అంటే పాత విధానాన్ని తిరిగి తెరపైకి తీసుకువస్తారని భావిస్తున్నారు. ఇదే జరిగితే భారతీయ విద్యార్థులనేకమందికి నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. H-1B వీసాలపై పరిమితులతో సహా నిర్బంధ ఇమ్మిగ్రేషన్ విధానాల కోసం తన వాదనను కొనసాగించాలని మిల్లర్ భావిస్తున్నారు. H-1B వీసాల విధానంపై ఆంక్షలు పెడితే అమెరికాలోని చాలామంది స్వదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. వేతనాల్లో కోతలు పడే ఛాన్స్ కూడా లేకపోలేదు.
ఇమ్మిగ్రేషన్‌ విధానంపై ట్రంప్ పాలన కఠినంగానే ఉండే అవకాశం ఉంటుంది. నైపుణ్యం కలిగిన వలసదారులకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం లభిస్తుంది. అరకొర చదువుతో అక్కడ ఉండాలనుకుంటే ఇక్కట్లు తప్పకపోవచ్చు. H-1B వీసాల సంఖ్యను పెంచడానికి ఎటువంటి చర్యలను చేపట్టకపోవచ్చు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన విధానాలతో వీసా తిరస్కరణ రేటు పెరిగింది. "ప్రత్యేక వృత్తి నైపుణ్యం" నిర్వచనాన్ని కుదించడం ద్వారా H-1B వర్కర్ల ప్లేస్ మెంట్స్ తగ్గే అవకాశం ఉంది.
2020లో ట్రంప్ అధికారం నుంచి వైదొలగడానికి ముందు ప్రచురించిన H-1B విధానంపై ఆంక్షలు విధించే నిబంధన అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ చట్టానికి ఉల్లంఘన అని ప్రకటించింది. ఫోర్బ్స్ కథనం ప్రకారం విదేశీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను అమెరికా కంపెనీలు నియమించుకునేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించారు ఆనాడు. ఇప్పుడు ట్రంప్ పరిపాలనాధికారులు తిరిగి ఆ విధానాన్నే తీసుకువచ్చే ప్రమాదం లేకపోలేదు.

ఇలా అనుమానించడానికి ప్రత్యేక కారణం ఉంది. ట్రంప్ అజెండాను ముందుకు తీసుకువెళ్లే వారిలో ఒకరైన టామ్ హోమన్ కూడా తిరిగి నియమితులయ్యారు. ఆయన గతంలో ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసీఈ-ICE) డైరెక్టర్ గా పని చేశారు. ఈసారి ఆయన బోర్డర్ సెక్యూరిటీతో పాటు మెరైన్, ఏవియేషన్ సెక్యూరిటీ విభాగాలను చూస్తారని అంటున్నారు. సరిహద్దులు దాటి వచ్చేవారి పట్ల చాలా నిర్దయగా ఉండడం ఈయన ప్రత్యేకత. అందుకే ఆయన్ను బోర్జర్ జార్ అంటుంటారు.
అటు మిల్లర్, ఇటు హోమన్ కలిస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. ట్రంప్ మనసులో ఉన్న వలసల నిరోధ చర్యల్ని వీళ్లిద్దరూ కచ్చితంగా అమలు చేయవచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు జో బిడైన్ పాలనలో ఉన్నంత సులువుగా ఉండకపోవచ్చు.
ఇకపై H-1B వీసాతో పని చేయాలంటే అత్యున్నత ప్రతిభా పాటవాలు, నిపుణత ఉన్న వారికే అవకాశం ఉంటుంది.
ట్రంప్ మొదటిసారి అధ్యక్షునిగా ఎన్నికైన 2016లోనే H-1B వీసాలు గణనీయంగా తగ్గాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం 2019లో అంటే ట్రంప్ దిగిపోవడానికి ముందు హెచ్-1బీ వీసాల అంతకుముందుతో పోలిస్తే సుమారు 21 శాతం తగ్గాయి.
ట్రంప్ రెండో సారి గెలవడంలో వలసలపై ఉక్కుపాదమనే నినాదమే బాగా పని చేసింది. ఈనేపథ్యంలో ఆయన, ఆయన నియమించే అధికారులు వలసలపై మరోసారి విరుచుకుపడే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News